ఇండియాలో 40 రోజుల క‌నిష్టానికి, రెండు ల‌క్ష‌ల్లోపు కేసులు

ఇండియాలో క‌రోనా సెకెండ్ వేవ్ 40 రోజుల క‌నిష్టానికి చేరింది. చాన్నాళ్ల త‌ర్వాత రెండు ల‌క్ష‌ల్లోపు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక ద‌శ‌లో నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదు అయిన సంగ‌తి…

ఇండియాలో క‌రోనా సెకెండ్ వేవ్ 40 రోజుల క‌నిష్టానికి చేరింది. చాన్నాళ్ల త‌ర్వాత రెండు ల‌క్ష‌ల్లోపు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఒక ద‌శ‌లో నాలుగు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదు అయిన సంగ‌తి తెలిసిందే.

ఆ త‌ర్వాత అవ‌రోహ‌ణ క్ర‌మంలో ప‌య‌నిస్తున్న కేసుల సంఖ్య ప్ర‌స్తుతానికి రెండు ల‌క్ష‌ల్లోపు స్థాయికి చేరింది. సోమ‌వారం రోజున దేశంలో దాదాపు 1.95 ల‌క్ష‌ల స్థాయిలో కేసులు న‌మోదు అయ్యాయి. రిక‌వ‌రీల సంఖ్య మూడు ల‌క్ష‌ల‌కు పైనే ఉంది.

దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య‌లో కూడా ల‌క్ష‌కు పైగా త‌గ్గుద‌ల చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం దేశంలో అధికారికంగా క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య 26 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉంది. గ‌త ప‌ది రోజుల్లోనే దాదాపు యాక్టివ్ కేసుల సంఖ్య ప‌ది ల‌క్ష‌ల వ‌ర‌కూ త‌గ్గడం గ‌మ‌నార్హం.

చివ‌రిసారిగా ఏప్రిల్ 13- 14 తేదీల్లో రెండు ల‌క్ష‌ల స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య న‌మోదు అయ్యింది. ఆ త‌ర్వాత కేసుల సంఖ్య‌పెరుగుతూ వెళ్లింది. ఇప్పుడు త‌గ్గుద‌లలో రెండు ల‌క్ష‌ల్లోపు స్థాయికి చేర‌డంతో.. రోజువారీ కేసుల సంఖ్య 40 రోజుల క‌నిష్టానికి చేరుకుంది. అయితే.. శ‌ని-ఆది వారాల్లో శాంపిల్స్ ఇచ్చిన వారి రిజ‌ల్ట్స్ సోమ‌, మంగ‌ళ‌వారాల్లో వెల్ల‌డి అవుతూ ఉంటాయి.

ఈ నేప‌థ్యంలో.. టెస్టుల‌కు వెళ్లే వారి, టెస్టులు చేసే వారి మీద కూడా వీకెండ్ ప్ర‌భావం ఉంటుంద‌ని, అందుకే సోమ‌, మంగ‌ళ‌వారాల్లో వెల్ల‌డ‌య్యే కేసుల్లో కాస్త త‌గ్గుద‌ల చోటు చేసుకోవ‌డం, ఆ త‌ర్వాత స్వ‌ల్పంగా కేసుల సంఖ్య పెర‌గ‌డం ఉంటుంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

కానీ.. కేసుల సంఖ్య‌లో గ్రోత్ రేట్ మాత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా త‌గ్గుతూ వ‌స్తూ ఉంది. దీంతో ఈ వారం ఆఖ‌రుకు, ఈ నెలాఖ‌రుకూ సెకెండ్ వేవ్ లో రోజు వారీ కేసుల సంఖ్య చాలా వ‌ర‌కూ త‌గ్గ‌వ‌చ్చ‌నే అంచ‌నాలున్నాయి. అవే నిజ అయ్యే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి.