నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు బాధ గురించి వింటుంటే …అయ్యయ్యో, రామ…రఘురామ అని ఆవేదనతో ప్రతి ఒక్కరి మనసు ఆవేదనతో మూలుగుతుంది. పాపం ఆయన అంతగా కలత చెందుతున్నారు.
పాడు నొప్పులు…లోకంలో ఎవరు లేరని, అన్నీ ఆయనకేనా? బెయిల్ మంజూరైనా, సైనికాస్పత్రి నుంచి ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారంటే, ఎంతగా అనారోగ్యంతో బాధపడుతున్నారో కదా! రఘురామకృష్ణంరాజు శత్రువులకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కమాండెంట్‌కు రఘురామకృష్ణంరాజు తన ఆవేదనను అక్షరీకరిస్తూ రాసిన లేఖ, ఆయన ఆక్రందనను ప్రతిబింబిస్తోంది. ఇంతకూ ఆయన లేఖలో ఏముందంటే…
‘నా రెండు కాళ్లూ తీవ్రంగా నొప్పి పెడుతున్నాయి. అకస్మాత్తుగా నా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో 146/99, నాలుగు గంటల సమయంలో 151/101కు పెరిగింది. ఒంట్లో మగతగా ఉంటోంది. నోరు పిడచకట్టుకు పోతోంది. నా ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డాక్టరు సేన్ గుప్తా, డాక్టర్ ఫిలిప్ పర్యవేక్షణలో 2-3 రోజులు ఇక్కడే వైద్య సేవలు అందించండి’ అని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి కమాండెంట్‌ను రఘురామరాజు అభ్యర్థిస్తూ లేఖ రాశారు.
గతంలో ఆయనకు హైకోర్టులో బెయిల్ రాలేదని సీఐడీ పోలీసులు కొట్టారని రఘురామ డ్రామా ఆడారని ప్రభుత్వం వాదించింది. మరి ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానమే ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరైన తర్వాత రెండు కాళ్లూ తీవ్రంగా నొప్పి పెడుతున్నాయట పాపం.
బీపీ కూడా పెరిగిందట. ఒంట్లో ఉత్సాహం లేకపోగా, మగతగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నోరు పిడచకట్టుకుపోతోందని ఆయన ఎంతో ఆవేదనగా తన బాధనంతా వెల్లడించారు. అదేంటోగానీ, సంతోషంగా ఉంటే అన్ని బాధలు పోతాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. రఘురామ విషయంలో అంతా రివర్స్‌గా ఉంది. హేమిటో, రాజుగారితో జగనే కాదు అనారోగ్యం కూడా ఆడుకుంటున్నట్టుంది.
అసలే రఘురామ మహానటుడని , అందుకే బెయిల్ కోసం తనపై దాడి జరిగిందనే డ్రామాను రక్తి కట్టించాడని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పుడంటే సరి, మరి ఇప్పుడేమంటారు? ఏదో సందర్భానుసారం ఢిల్లీ , ఎల్లో చానళ్ల వేదికగా కాస్త నటించిన మాట వాస్తవమే అయ్యిండొచ్చు.
అలాగని ప్రతిసారి ఆయన నటిస్తారంటే ఏమైనా సబబా? ఇప్పటికైనా రఘురామది నటన కాదని, నిజంగా అనారోగ్యమేనని నమ్మండి ఫ్లీజ్. నమ్మితే పోయేదేమీ లేదు…రఘురామకృష్ణంరాజుకు మానసిక ఊరట తప్ప!
సొదుం రమణ