గత కొన్ని రోజులుగా దక్షిణాదిలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై నివేదిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు చేరింది.
కరోనా కట్టడికి ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు బాగా పనిచేస్తోందనే ప్రచారం పెద్ద ఎత్తున జరగడంతో …కృష్ణపట్నానికి ఎక్కడెక్కడి నుంచో జనం క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో జనాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, మరోవైపు ఆ మందు శాస్త్రీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
ఈ నేపథ్యంలో మందుపై పరిశోధన కోసం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య తయారు చేసిన మందుపై రాష్ట్ర ఆయుష్ విభాగం పరిశోధన చేసింది. అనంతరం నివేదికను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఆయుష్ రాష్ట్ర కమిషనర్ రాములు సమర్పించారు.
అనంతరం రాములు మీడియాతో మాట్లాడుతూ ఆనందయ్య మందు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే 70-80 వేల మందికి మందు పంపిణీ చేసినట్టు తమకు ఆనందయ్య చెప్పాడని రాములు తెలిపారు. భారీ సంఖ్యలో మందు పంపిణీ చేసిన నేపథ్యంలో ఒకరిద్దరికి సమస్యలు రావడం పెద్దగా సీరియస్గా తీసుకోనవసరం లేదన్నారు.
పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజలకు పంపిణీ చేయవచ్చన్నారు. మూడు, నాలుగు రోజుల తర్వాత సీసీఆర్ఏఎస్ నివేదిక వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆయుష్ రాష్ట్ర కమిషనర్ మాటలను బట్టి ఆనందయ్య మందు కోసం గరిష్టంగా ఒక వారం ఎదురు చూడక తప్పదు.