కరోనా వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సెలబ్రిటీలు మొదలుకుని సామాన్యుల వరకు తమతమ పరిధుల్లో వివరిస్తున్నారు. కరోనా మహమ్మారిపై ఒక రకంగా ప్రపంచం యుద్ధం ప్రకటించింది. ఈ పోరాటంలో అందరూ సైనికులే.
కరోనా వచ్చిన తర్వాత అప్రమత్తం కావడం కంటే….అసలు మన దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే అంశంపై సీఎం జగన్ చెల్లెలు, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె అయిన డాక్టర్ నర్రెడ్డి సునీత కొన్ని చిట్కాలు చెప్పారు.
కరోనా వైరస్‌కు గురైనప్పటికీ , బాధిత రోగులు 80 శాతం వెంటనే కోలుకుంటున్నట్టు డాక్టర్ సునీత తెలిపారు. సహజంగా ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు తదితర సమస్యలతో బాధపడుతుంటే సంబంధిత మందులు పారాసిటమాల్, ఇతర మందులు రోగి వాడుతారన్నారు. అయితే మందులతో పాటు రోగికి విశ్రాంతి అనేది ఎంతో ప్రధానమైందని డాక్టర్ సునీత చెప్పుకొచ్చారు.
కరోనా లక్షణాలున్నప్పుడు అందరికీ దూరంగా ఉండాలన్నారు. ఇంకా చెప్పాలంటే క్వారంటైన్ యువర్ సెల్ఫ్.. అంటే మిగిలినవారికి అందుబాటులో ఉండకుండా ఉంటే ఇతరులకు వ్యాపించకుండా ఉంటుందన్నారు. ఇది చాలా ముఖ్యమైందన్నారు.
ఎవరితో మాట్లాడకుండా రెండు వారాల పాటు ఒక గదిలో ఒంటరిగా గడపడం అంటే మాటలు కాదని డాక్టర్ సునీత తెలిపారు. కానీ తప్పదన్నారు. కరోనా లక్షణాలుంటే 14-15 రోజులు క్వారంటైన్‌లో పెట్టడం తప్పనిసరి అన్నారు. ఎదురెదురుగా కూర్చోవడం, మాట్లాడటం తగదన్నారు.
అయితే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని, సంగీతం, పాటలు వింటూ గడపవచ్చని డాక్టర్ సునీత తెలిపారు. వీటితో పాటు మెడిటేషన్ అనేది చాలా ముఖ్యమైందన్నారు. ఎందుకంటే మెడిటేషన్ ద్వారా మానిసక ధైర్యాన్ని, స్థైర్యాన్ని పొందవచ్చన్నారు. యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. బాడీకి వ్యాయామం అవసరమన్నారు. ఆరోగ్యకరమైన పౌష్టికాహారం తినడం చాలా ముఖ్యమని డాక్టర్ సునీత చెప్పుకొచ్చారు. వీటితో పాటు నిత్యం చేతులు కడుక్కోవడాన్ని అలవాటుగా చేసుకుంటే జీవితంలో చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు అని డాక్టర్ సునీత వివరించారు.