హ‌మ్మ‌య్య‌…ఊపిరి తీసుకోవ‌చ్చు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. దీంతో ఏపీ ప్ర‌జానీకం హ‌మ్మ‌య్య అంటూ ఊపిరి తీసుకుంటోంది. గ‌త కొన్ని రోజులుగా నెమ్మ‌దిగా క‌రోనా ప్ర‌భావం త‌గ్గుతుంద‌నేందుకు న‌మోద‌వుతున్న కేసులే నిద‌ర్శ‌నం. గ‌డిచిన 24…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. దీంతో ఏపీ ప్ర‌జానీకం హ‌మ్మ‌య్య అంటూ ఊపిరి తీసుకుంటోంది. గ‌త కొన్ని రోజులుగా నెమ్మ‌దిగా క‌రోనా ప్ర‌భావం త‌గ్గుతుంద‌నేందుకు న‌మోద‌వుతున్న కేసులే నిద‌ర్శ‌నం. గ‌డిచిన 24 గంట‌ల్లో 12,994 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. అలాగే 96 మందిని క‌రోనా బ‌లిగొంది.

ఒక్క రోజులో 22 వేల పైచిలుకు కేసులు న‌మోదై ఆందోళ‌న క‌లిగించింది. అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా వ‌రుస‌గా వంద‌కు పైబ‌డి న‌మోదు అవుతుండ‌డం ఏపీ ప్ర‌జానీకానికి నిద్ర‌లేని రాత్రులు మిగిల్చింది. దిన‌దిన‌గండం అన్న‌ట్టు బిక్కుబిక్కుమ‌ని గ‌డ‌పాల్సిన ద‌యనీయ స్థితి. 

ఈ నేప‌థ్యంలో 58,835 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 12,994 మందికి పాజిటివ్ ఉన్న‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. ఇంత‌కు ఒక రోజు ముందు 91,629 మంది న‌మూనాల‌ను ప‌రీక్ష చేయ‌గా 18,767 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. అలాగే రెండు రోజుల క్రితం 90,609 మంది న‌మూనాల‌ను ప‌రీక్షించ‌గా 19,981 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

ఇదిలా ఉండ‌గా గ‌డిచిన 24 గంట‌ల్లో 18,373 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,03,762 యాక్టీవ్ కేసులున్న‌ట్టు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ విడుద‌ల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. గ‌డిచిన 24 గంట‌ల్లో చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. 

క‌డ‌ప జిల్లాలో అత్య‌ల్పంగా ఇద్ద‌రు మృతి చెందారు. ఈ కేసులు, మ‌ర‌ణాలు త‌క్కువ కాన‌ప్ప‌టికీ, గ‌తంతో పోలిస్తే కొంత ఆశాజ‌న‌కంగా ఉంద‌ని చెప్పొచ్చు. ఈ నెలాఖ‌రుకు క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని నిపుణుల అంచ‌నా నిజ‌మయ్యేలా తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఆ రోజు కోసం యావ‌త్ దేశ‌మంతా ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తోంది.