ఎమ్బీయస్: ఒక్క వాక్సిన్‌కి ఇన్ని రేట్లా?

ఒకటే వస్తువు, నాణ్యతలో తేడా లేదు, కానీ వేర్వేరు సంస్థలకు వేరేవేరే రేట్లకు అమ్మవచ్చు అని కేంద్రం నిర్ణయించింది. ఇదెక్కడి చోద్యం అని అందరూ విస్తుపోతున్నారు. టీకాల ధరలో కేంద్రానికి, రాష్ట్రానికి, ప్రయివేటుకి వ్యత్యాసం…

ఒకటే వస్తువు, నాణ్యతలో తేడా లేదు, కానీ వేర్వేరు సంస్థలకు వేరేవేరే రేట్లకు అమ్మవచ్చు అని కేంద్రం నిర్ణయించింది. ఇదెక్కడి చోద్యం అని అందరూ విస్తుపోతున్నారు. టీకాల ధరలో కేంద్రానికి, రాష్ట్రానికి, ప్రయివేటుకి వ్యత్యాసం ఎందుకు అని సుప్రీం కోర్టు అడిగితే కేంద్రం సమర్పించిన అఫిడవిట్ ఏం చెప్పింది? అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్, మీకేం తెలియదు ఊరుకోండి అని చెపుతూ దానితో బాటే ‘మేం భారత్‌కు, సీరంకు ఒక్క పైసా కూడా అడ్వాన్సు యివ్వలేదు. మే, జూన్, జులైలలో 11 కోట్ల డోసుల కోవిషీల్డు సరఫరా చేయడానికి గాను రూ.1732 కోట్లు సీరంకు, 5 కోట్ల కోవాక్సిన్ సరఫరా చేయడానికి భారత్‌కు రూ.767 కోట్లు మాత్రం యిచ్చాం.’ అని చెప్పింది. (అది కూడా పీకల దాకా మునిగాక యిచ్చాం తప్ప, ముందుగా యివ్వలేదు అని చెప్పలేదనుకోండి)

దానితో బాటు ఐసిఎమ్‌ఆర్ సహకారంతో భారత్ క్లినికల్ ట్రయల్స్ చేయడానికై రూ.35 కోట్లు, సీరం ట్రయల్స్‌కై రూ.11 కోట్లు యిచ్చామంది. (ఆంధ్రజ్యోతి మే 19) మన జనాభాకై (18 ఏళ్లు దాటినవాళ్లు) సుమారు 200 కోట్ల డోసులు కావాలంటే కేంద్రం బుక్ చేసిన వాక్సిన్‌లు ఎన్ని? మార్చిలో 12 కోట్లు, తర్వాత 16 కోట్లు! పిల్లలకు కూడా వాక్సిన్ వేయాలంటే ఇంకెంత కావాలో ఊహించండి. ఇదే మన మూడో పాయింటు – స్వదేశంలో తయారయ్యే వాక్సిన్లకు ఫండింగ్ చేయకపోవడం! వాక్సిన్‌లు బుక్ చేయడమే కాదు, వాక్సిన్‌లను అభివృద్ధి పరచడానికి కూడా అగ్రదేశాలు నిధులిచ్చాయి. ‘‘ఇండియా టుడే’’ ఏప్రిల్ 26 సంచిక ప్రకారం 2020 అక్టోబరులో ‘‘ఆపరేషన్ వార్ప్ స్పీడ్’’ క్రింద అమెరికన్ ప్రభుత్వం 18 బిలియన్ డాలర్లు యిచ్చింది. జర్మన్ ప్రభుత్వం బయోఎన్‌టెక్‌కు 445 మిలియన్ డాలర్లు యిచ్చింది. యుకె ప్రభుత్వం 1.70 బిలియన్ డాలర్లు యిచ్చింది.

మన ప్రభుత్వం మాత్రం విదేశీ కంపెనీలకే కాదు, ఇండియన్ కంపెనీలకూ నిధులు యివ్వలేదు. భారత్ ఎండీ ఎల్లా కృష్ణ ఎన్నో సార్లు ‘అంతా మా డబ్బుతోనే చేస్తున్నాం.’ అంటూ వచ్చారు. ప్రభుత్వం పోనీ నేను సాయం చేస్తానులే అనలేదు. సీరం పూనావాలా ఉత్పత్తి పెంచడానికి నిధులు కావాలని నోరు విడిచి అడిగినా యివ్వలేదు. నిధులు సకాలంలో యిచ్చి వుంటే అవి యీ పాటికి సామర్థ్యం పెంచుకుని టీకాలు సప్లయి చేసి వుండేవి. ఈ రోజు అవసరం పడింది కాబట్టి, డబ్బు చేతిలో పెట్టి ‘చప్పున పట్రా’ అంటున్నారు. నిధులివ్వగానే అటక మీద నుంచి తీసివ్వడానికి అవేమైనా చేటలా? వాక్సిన్‌లంటే ఫ్యాక్టరీ స్థలం పెంచుకోవాలి. అవసరమైన యంత్రాలు తెప్పించుకోవాలి. ముడిసరుకు ఏర్పాటు చేసుకోవాలి. ప్యాకింగ్ మెటీరియల్ దగ్గర్నుంచి అన్నీ తెచ్చుకోవాలి. తగిన, అనుభవజ్ఞులైన సాంకేతిక సిబ్బందిని సమకూర్చుకోవాలి. వాళ్లు అప్పటికప్పుడు తయారవ్వరు. వాళ్ల కోసం వెతకాలి.

ప్రభుత్వాన్ని నడిపే పెద్దలకు యివేమీ తోచవా? కొంప అంటుకున్నాక బావి తవ్వడం ప్రారంభించినట్లు, పరిస్థితి యీ మేరకు విషమించాక ఏప్రిల్ 28న కేంద్రం సీరంకు రూ.3000 కోట్లు, భారత్‌కు రూ.1500 కోట్లు యిచ్చింది. ‘‘అందాల రాముడు’’ సినిమాలో నాగభూషణం బట్లర్‌తో ‘నాకు అర్జంటుగా పెసరట్లు కావాలి’ అంటాడు. ‘అర్జంటంటే కుదరదండి, ముందుగా పెసలు నానాలి…’ అని బట్లర్ చెప్పబోతూ వుంటే ‘..అయితే నాను’ అంటాడు నాగభూషణం. ‘నేను కాదండి, పెసలండి.’ అని బట్లర్ మొత్తుకున్నా, నాగభూషణం వినకుండా ‘నాకు యిప్పుడే తినాలనిపిస్తోంది. కావాలి, లేకపోతే నీ ఉద్యోగం డిస్మిస్’ అంటాడు. అలా వుంది మన ప్రభుత్వం కథ.

ఆ సినిమాలో బట్లర్ లాగానే యీ కంపెనీలు కూడా ఇవాళ మీరు నిధులిచ్చినా మేం జులైకి కానీ ఉత్పత్తి పెంచలేం అని స్పష్టంగా చెప్పేశాయి. ‘‘ఇండియా టుడే’’ మే 24 ప్రకారం సీరమ్ కెపాసిటీ నెలకు 6-7 కోట్లుంది. దాన్ని 10 కోట్లు చేయాలి. జులై నుంచి ప్రభుత్వానికి 11 కోట్లు యివ్వాలి. దీనికి తోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో కోవాక్స్ ఫెసిలిటీకై ఫిబ్రవరి-మార్చిలలో10 కోట్ల డోసులు యివ్వడానికి సీరమ్ కమిటై వుంది. కానీ 1.80 కోట్ల డోసులు మాత్రం యివ్వగలిగింది. సెకండ్ వేవ్ రావడంతో మన ప్రభుత్వం ఎగుమతులు నిషేధించడంతో గతంలో అది ఆస్ట్రాజెన్‌కాతో చేసుకున్న ఒప్పందాన్ని మన్నించలేక పోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కోవాక్సిన్ వేయించుకుంటే 9 విదేశాలకు మాత్రమే (నేపాల్, ఇరాన్ వంటివి) ప్రయాణించగలం. అదే కోవిషీల్డు వేయించుకుంటే 100 దేశాలదాకా వెళ్లగలం. అందువలన విద్య, వ్యాపారాలకై విదేశాలు వెళదామనుకునేవారు కోవిషీల్డుకే ఎగబడుతున్నారు. కోవాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రి-క్వాలిఫికేషన్ వచ్చేవరకూ కోవిషీల్డుపై ఒత్తిడి ఎక్కువగా వుంటుంది.

భారత్ బయోటెక్‌కు వస్తే అది తన హైదరాబాదు, బెంగుళూరు ప్లాంట్లలో నెలకు అన్ని వాక్సిన్‌లు కలిపి 1.6 కోట్ల డోసులు చేయగల సామర్థ్యం కలిగివుంది. ఇప్పుడు 6 కోట్లకు పెంచుదామనుకుంటోంది. కరోనా వాక్సిన్‌ ఒక్కటే చేస్తానంటే కుదరదు కదా, ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో వున్న అనేకానేక టీకాల ఉత్పత్తిని ఆపలేరు. అందువలన వీళ్లు నెలకు ఎన్ని యివ్వగలరో కచ్చితంగా చెప్పడం కష్టం. పైగా కోవిషీల్డ్ వాక్సిన్ ప్రక్రియ కంటె కోవాక్సిన్ ప్రక్రియ క్లిష్టం కాబట్టి, ఉత్పత్తి పెంచడంలో కష్టాలున్నాయి. ప్రభుత్వ నిర్వహణలోనే ఉన్న హాఫ్‌కిన్ ఇన్‌స్టిట్యూట్ (2 కోట్ల డోసులు చేయగలదు), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్, భారత్ ఇమ్యునోలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ (చెరో కోటి చేయగలవు) సామర్థ్యాలను యిప్పటివరకు వాడుకోలేదు. ఇప్పుడు భారత్‌తో కలిసి కోవాక్సిన్ తయారుచేయడానికి అనుమతి యిచ్చింది. ‘ఏడాది క్రితమే నిధులు, అనుమతి యిచ్చి వుండాల్సింది’ అన్నారు ఇవైలోని పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్ మురళీధరన్ నాయర్.

యుపిఏ హయాంలో పిఎంకె తరఫున ఆరోగ్య శాఖ నిర్వహించిన అన్బుమణి రాందాస్ (నేటి టీకా సంక్షోభానికి మూలకారకుడితనే అని వ్యాసాలు వస్తున్నాయి), హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలీలో వున్న టీకా కేంద్రాన్ని మూసేసి, తన ప్రాంతంలోని చెన్నయ్ వద్ద వున్న చెంగల్పట్టు వద్ద రూ. 900 కోట్లతో పబ్లిక్ సెక్టార్‌ రంగంలో ఎచ్ఎల్ఎల్ హెల్త్‌కేర్ వారి సబ్సిడియరీ ఎచ్ఎల్ఎల్ బయోటెక్‌కై ప్రణాళిక వేశాడు. జాతీయ టీకా కార్యక్రమంలోని టీకాల ఉత్పత్తికై అది ఉపయోగపడుతుందన్నాడు. అది 2017లో పూర్తయింది. 5.5 కోట్ల టీకాలు తయారుచేయగలదు. కానీ యిప్పటివరకు ఒక్క టీకా కూడా తయారుచేయలేదు. (ఇండియా టుడే, మే 24). దాన్ని యిప్పటికే వాడుకోవలసి వుంది. ఇప్పటికైనా వాడుకోవాలి.

4) మన దగ్గర తయారైన వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం – మన వాక్సిన్‌లు మనకే చాలకపోయినా 94 దేశాలకు 6.60 కోట్ల డోసులు పంచిపెట్టడం జరిగింది. ఇదేమిటని సుప్రీం కోర్టు అడిగితే ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం, ఒకటే యూనిట్. ’ అంటూ ప్రభుత్వం తన మార్చి 11 నాటి అఫిడవిట్‌లో సూక్తులు వల్లె వేసింది. ‘తనకు మాలిన ధర్మం, మొదలు చెడ్డ బేరము’ అనే తెలుగు సామెత కోర్టు వల్లించలేదు లెండి. ఇక్కడ యింకో కారణం కూడా చెప్పింది. టీకాలు యివ్వడానికి దేశంలో తగినంతమంది సిబ్బంది, మౌలిక వసతులు లేకపోవడం చేత ఆ స్థాయికి మించి ఉత్పత్తి అయిన టీకాలనే ఎగుమతి చేశాం అని చెప్పుకుంది. అంటే ఆక్సిజన్, ఆసుపత్రుల మాట అటుంచి కనీసం టీకాలు వేసేటంత మౌలిక వసతులను కూడా ఏడాదిలో ఏర్పాటు చేయలేదని ప్రభుత్వమే ఒప్పుకున్నట్లయింది. ‘‘వాక్సిన్ మైత్రి’’ పేర యితర దేశాలకు ఎగుమతి చేయసాగారు కానీ రాష్ట్రాలతో మైత్రి నెరపలేదు. టీకాల ఎగుమతిని మార్చి 29 న మాత్రమే నిషేధించారు. ఎగుమతి చేసే రోజుల్లో కిమ్మనని మీడియా, ప్రతి వాక్సిన్ అపురూపమై పోయిన యీ రోజుల్లో అప్పుడెందుకు పంపారు అని అడుగుతోంది.

5) విదేశీ వాక్సిన్లను అనుమతించక పోవడం – ఫైజర్ మన దేశంలో ఉత్పత్తి చేసేందుకు అప్లికేషన్ పెట్టుకుంటే దానిపై కేంద్రం చాలాకాలం స్పందించలేదు. దాంతో అది తన దరఖాస్తును ఉపసంహరించుకుంది. విదేశాలలో తయారైన వాక్సిన్లను మన దేశంలో వాడడానికి ప్రభుత్వం అనుమతించలేదు. ఇక్కడ క్లినికల్ పరీక్షలు నిర్వహించాల్సిందే అంది. సెకండ్ వేవ్ కారణంగా వాక్సిన్‌ల డిమాండ్ పెరిగి, సప్లయి లేకపోవడంతో ఏప్రిల్ 13న ఆ నిబంధన సడలించి, యుకె, యుఎస్, ఇయు, జపాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్రూవ్ చేసిన వాటికి ‘ఎమర్జన్సీ యీజ్’ కింద అనుమతి యిచ్చింది. స్పుట్నిక్‌కు ఏప్రిల్ 12న మాత్రమే అనుమతి యివ్వడంతో మే 5 నుంచి వాటి సరఫరా ప్రారంభమైంది.

లభ్యమౌతున్న వాటిలో ఫైజర్, మోడెర్నా వాక్సిన్‌లు బాగా పనిచేస్తున్నాయని అంటున్నారు. ఫైజర్ యిప్పటికే ఇయుకి 60 కోట్లు, యుఎస్‌కు 30 కోట్లు కమిట్ అయి వుంది. 91 దేశాలకు 43 కోట్ల డోసులు పంపింది. 2022, 2023లకు అనేక ఒప్పందాలు చేసుకుని వుంది. ఈ పరిస్థితుల్లో ఇండియాకు ఎన్ని అందించగలుగుతుందో తెలియదు. కానీ పాశ్చాత్య దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది కాబట్టి, అక్కడి డిమాండు తగ్గి, యిక్కడ సప్లయి చేసే అవకాశం వుంది. మోడెర్నా విషయానికి వస్తే – దాని కెపాసిటీని 80 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచుకుంటోంది. ఇప్పటికే 100 కోట్ల డోసులు విడుదల చేసి, యీ ఏడాది చివరకు మరో 100 కోట్లు చేయాలని చూస్తోంది. 2022 నాటికి 300 కోట్ల డోసులు చేయడానికి పెట్టుబడులు పెడుతోంది.

ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల వద్ద, మోడెర్నా టీకాను మైనస్ 20 డిగ్రీల వద్ద స్టోర్ చేయాలి కాబట్టి, ఇండియాలో కోల్డ్ సప్లయి చెయిన్ అంత పటిష్టంగా లేదు కాబట్టి, వాటిని అనుమతించలేదు అని కొందరు వాదిస్తున్నారు. నగరాల్లో కొన్ని పెద్ద ఆసుపత్రులు అవసరమనుకుంటే ఆ టెంపరేచర్‌లో స్టోర్ చేయగల సామర్థ్యాన్ని సమకూర్చుకుంటాయి. గ్రామగ్రామాలకు వాటిని సరఫరా చేయడం కష్టం కానీ, అవసరం వున్న వాళ్లను ఆయా ఆసుపత్రులకు వెళ్లి వేయించుకోమనవచ్చు. స్టోరేజీ సౌకర్యం వలన టీకా ధర సహజంగా ఎక్కువ వుంటుంది. డబ్బున్న వాళ్లు మాత్రమే కాదు, మధ్యతరగతి వాళ్లు కూడా వెళ్లి వేయించుకుంటారు. ఎందుకంటే కరోనా వస్తే ఆసుపత్రికి లక్షల్లో ఖర్చవుతోంది. దాని కంటె వేలు ఖర్చు పెట్టడం చౌక కదా! కానీ ప్రభుత్వం ఎందుకనో కానీ అనుమతించలేదు.

ఇప్పుడు వాక్సిన్‌లకు కొరత ఏర్పడడంతో వాక్సిన్ తయారీ పేటెంటును తీసేయాలని ప్రపంచంలో డిమాండు ప్రారంభమైంది. భారత ప్రభుత్వం సుప్రీం కోర్టుకి చెప్పినపుడు తను యీ దిశగా ప్రయత్నిస్తోందని కూడా చెప్పింది. దీని గురించి అటూ, యిటూ ఎన్నయినా చెప్పవచ్చు. నా వ్యక్తిగత అభిప్రాయమైతే యిది అన్యాయం. మన దేశపు చట్టాల ప్రకారం ప్రోడక్టుకి పేటెంటు వుండదు కానీ ప్రాసెస్‌కు వుంటుంది, అదీ పదేళ్లపాటు! దీనివలననే మన దేశం జనరిక్ మార్కెట్లో ముందంజ వేసి ప్రపంచ మార్కెట్లో నిలదొక్కుకుంది. ప్రాసెస్‌కు పేటెంటు వుంటుంది కాబట్టి మార్కెట్లో వున్న ప్రోడక్టును వేరే రకంగా తయారుచేసి పదేళ్లపాటు లాభాలు ఆర్జించే అవకాశం వుంటుంది కాబట్టి రిసెర్చి చేయడానికి ఉత్సాహం వుంటుంది. ఇప్పుడు అది కూడా తీసేస్తే భవిష్యత్తులో రిసెర్చి చేసేవాళ్లెవరుంటారు?

అగ్రశ్రేణి ప్రపంచదేశాలు ప్రోడక్ట్ పేటెంటుకై (దీనిలో చాలా అంశాలున్నాయి, వివరాలలోకి వెళ్లటం లేదు) పట్టుబడుతున్నాయి కాబట్టి, మన దేశంలో రిసెర్చిని ప్రోత్సహించాలి. కానీ జరుగుతున్నదేమిటి? దానికి ప్రోత్సాహకాలు తీసేస్తున్నారు. గతంలో రిసెర్చిపై పెట్టిన పెట్టుబడికి 175% రాయితీ యిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 100% కు తగ్గించారు. ఇప్పుడు పూర్తిగా తీసిపారేశారు. ఇలాటి పరిస్థితుల్లో భారత్ బయోటెక్ వంటి సంస్థలు నానా తంటాలూ పడి, రిసెర్చి చేస్తే (ఏ మేరకు చేసింది అనేది యిప్పుడు వివాదాస్పదమైంది) ఆ టెక్నాలజీని యితర సంస్థలతో పంచుకోమని ఒత్తిడి చేయడం భావ్యమా? రిసెర్చి అంటే ఎంతో రిస్కుతో కూడిన వ్యవహారం. కార్పోరేట్లేవీ ఆ రిస్కు తీసుకోలేదు. నష్టం వస్తే రిసెర్చి చేసిన కంపెనీదే! ఇప్పుడు అది సఫలమైంది కాబట్టి, అది మాకు చెప్పేయ్ అనడం సబబేనా?

ఈసపు కథ ఒకటి వుంది. వేసవికాలంలో చీమ కష్టపడి ఆహారం దాచుకుంటే, మిడత హాయిగా ఎగురుతూ పాటలు పాడుతూ గడిపేసింది. చలికాలం వచ్చేసరికి, ఆహారం దొరక్క మిడత మలమల మాడింది. చీమ దగ్గరకి వచ్చి తిండి పెట్టవా? అంటే అది లెక్చరిచ్చింది. సరైన సమయంలో కష్టపడకపోతే యిదే జరుగుతుంది తెలుసా? అని. మిడత బుద్ధి తెచ్చుకుంది. ఇటీవలి కాలంలో దీనికి పారడీ కూడా విన్నాను. దానిలో చివర మిడత ఊరుకోదు. తనలాటి బద్ధకస్తుల్ని పదిమందిని పోగేసి ‘మనమంతా ఆకలితో మాడుతూంటే, యీ బూర్జువా చీమ అంతా పోగేసుకుని కూర్చుంది. అదంతా మనకు సమానంగా పంచాలి.’ అని నినాదాలిచ్చింది. అప్పుడు ప్రభుత్వం ‘ఔను, సంపదంతా ఒకరి దగ్గరే పోగుపడితే ఎలా?’ అంటూ చీమను దండించి, మిడతలతో సహా అందరికీ సమానంగా పంచింది. ఇప్పుడీ వాక్సిన్ పేటెంటు కథ యిలాగే వుంది. ప్రభుత్వం కాకపోతే కార్పోరేట్లయినా భారత్, కాడిలా, బయోలాజికల్-ఇలకు అప్పులిచ్చాయా? విరాళాలిచ్చాయా? రిసెర్చి ఖర్చులు భరించాయా? ఇప్పుడు మేధోసంపత్తిలో వాటా ఎలా అడుగగలవో నాకు అర్థం కావటం లేదు. రిస్కు నీది, ప్రాఫిట్ మాది అన్నట్లుగా లేదూ!

కోవాక్సిన్ మేధోసంపత్తి విషయంలో యిప్పుడు వివాదం వస్తోంది. ‘అది సంపూర్ణంగా మాదే. ఐసిఎమ్మార్, ఎన్ఐవీల నుంచి పరిజ్ఞానమేదీ తీసుకోలేదు. మేం వేరే ఎవరితోనూ ప్రాసెస్‌ను పంచుకోము.’ అని భారత్ కో-ఫౌండర్, జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ప్రకటించారు. ఇన్నాళ్లూ యీ మాట చెప్పలేదు. ఐసిఎమ్మార్ వాటా వుందనే అందరూ అనుకుంటూ వచ్చారు. అది పేటెంటు హక్కు అడుగుతానని అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఒరిజిల్ స్ట్రయిన్ ఎన్ఐవీ నుంచి తీసుకుని వుండకపోతే యానిమల్ ట్రయల్స్ ఎప్పుడు, ఎలా చేశారో భారత్ చెప్పవలసి వుంటుంది. ఇక ప్రభుత్వాన్ని అడగవలసినదేమిటంటే ఆ స్ట్రయిన్ యిచ్చేటప్పుడు భారత్ బయోతో ఒప్పందం రాయించుకోలేదా? ఇప్పుడిలా మాట్లాడుతూంటే వెంటనే ఖండించకపోవడానికి కారణం ఏమిటి? ఓ పక్క ప్రభుత్వానికి భాగస్వామ్యం వుందనే అభిప్రాయంతో అనేక రాష్ట్రాలు ‘మేం భూమిస్తాం, మా దగ్గర ఫెసిలిటీ పెట్టండి’ అని భారత్‌ను అడుగుతూంటే, ఏ మేరకు భాగస్వామ్యం వుందో స్పష్టం చేయవద్దా?

6) వాక్సిన్ ధరల పాలసీ – టీకాల కొరత ఏర్పడ్డాక, కేంద్రం టీకా ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిలో సగం తమకు పాత రేటులోనే అందించాలని, మిగతా సగం రాష్ట్రాలకు (రూ. 300-400కు), ప్రయివేటు ఆసుపత్రులకు (రూ.600-1200కు) హెచ్చు ధరకు అమ్ముకోవచ్చని చెప్పడంలో హేతుబద్ధత ఏమిటో ఎవరూ చెప్పలేక పోతున్నారు. రెండు వాక్సిన్ల సామర్థ్యం యించుమించు ఒకటేననీ, ఏది వేయించుకున్నా ఫరవాలేదని చెప్తూ, రెండింటిని తను ఒకే ధరకు కొంటూ రాష్ట్రాలను మాత్రం కోవిషీల్డు అయితే 300కే కొనవచ్చనీ, కోవాక్సిన్ అయితే 400కి కొనాలనీ చెప్పడమేమిటి? అలాగే ప్రయివేటు ఆసుపత్రుల విషయంలో వాక్సిన్ ధరల మధ్య రెట్టింపు తేడా వుండడమేమిటి? ప్రభుత్వం వ్యాపారంలో కలగజేసుకోను అంటూంటుంది. మళ్లీ తనకు మాత్రం 1200 రూ.ల సరుకు 150కే యిమ్మనమంటోంది.

ఒకే సరుకుని వేరే చోట హెచ్చు రేటుకి అమ్ముకోవచ్చు అని అనుమతిస్తే, కంపెనీవాళ్లు కేంద్రానికి స్టాకు లేదని చెప్పి, ప్రయివేటుగా అమ్ముకునే ప్రమాదం వుంది కదా! ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు దోపిడీకి గురి కాకుండా, రిసెర్చికి ఖర్చు పెట్టిన కంపెనీలు నష్టపోకుండా కంపెనీలను సంప్రదించి ఏదో ఒక ధరను ఫిక్స్ చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. ఎవరికైనా ఒకే రేటుకి యిమ్మనమనాలి. ఇక ప్రయివేటు విషయానికి వస్తే యీ రెండు కాకుండా విదేశీ వాటిని అనుమతించాలి. స్పుట్నిక్‌ను అపోలోవాళ్లు రూ.1000కి కొని 1250కు అమ్ముతామంటున్నారు. అలాగే ఫైజర్, మోడెర్నాలను కూడా తెప్పించి ప్రయివేటు ఆసుపత్రులను అమ్మమనవచ్చు.

‘ఒన్ నేషన్, ఒన్ రేషన్’.. లాటి నినాదాలతో హోరెత్తించే మోదీ సర్కారు ‘ఒన్ నేషన్, ఒన్ వాక్సిన్ రేట్’ అని ఎందుకు అనటం లేదు? ఇది రాష్ట్రాలతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఆరోగ్యం రాష్ట్రాల బాధ్యత అన్నపుడు వాక్సిన్ పంపిణీపై కేంద్రం గుత్తాధిపత్యం ఎందుకు తీసుకుంది? కంపెనీలు హెచ్చు ధర వస్తుంది కాబట్టి ప్రయివేటుకే అమ్ముకోవాలని చూస్తాయి. రాష్ట్రాలు అడిగితే స్టాకు లేదంటాయి. కరోనా విపత్తు అధిగమించడానికి పిఎం కేర్స్‌కు విరాళాలు వెళతాయి. కరోనా వలన ఆదాయానికి గండిపడి, కేంద్రం నుంచి జిఎస్టీ బకాయిలు రాక, రాష్ట్రాలు తిప్పలు పడుతూ వుంటే యిప్పుడవి వాక్సిన్‌ల కోసం ప్రయివేటు ఆసుపత్రులతో పోటీ పడాలి. పైగా రాష్ట్రాలు అడిగినా కంపెనీలు కేంద్రాన్ని సంప్రదించి, ఆ మేరకే కోటా కేటాయించి పంపిణీ చేస్తారు.

అసలు మన ఇండియన్ కంపెనీలు టీకాల ధరలు ఎందుకు పెంచుతున్నాయి? వాళ్లు డోసు రూ.250కు అమ్ముదా మనుకున్నపుడు ప్రభుత్వం సరేననాల్సింది. రిసెర్చి చేసినందుకు వాళ్లకు ప్రతిఫలం దక్కాలి కదా పాపం. కానీ రూ.150కే యిమ్మంది. ప్రస్తుత ప్రభుత్వం ‘మేం వ్యాపారం చేయం, కలగజేసుకోం’ అంటుంది. మళ్లీ దీనిలో మాత్రం వేలు పెట్టింది. ఇప్పుడు హఠాత్తుగా పాత ధరలు పెంచేసింది. కేంద్రానికో ధర, రాష్ట్రానికో ధర, ప్రయివేటు ఆసుపత్రులకో ధర! పెంచుకోమన్నారు, తర్వాత పెంచినదానిలో తగ్గించమన్నారు, అదేదో మనకు ఉద్ధరింపులా! రూ.150కి అమ్మినపుడు మీరేమైనా నష్టపోతున్నారా? అని ఓ టీవీ యింటర్వ్యూలో అడిగితే ఆదార్ పూనావాలా ‘అబ్బే లేదు, లాభాలు తక్కువ వస్తున్నాయంతే’ అన్నాడు. మరి యిప్పుడు ఎంత వస్తున్నాయో ఆలోచించండి. ఆక్స్‌ఫర్డ్ టీకా అభివృద్ధి పరచడంలో ప్రభుత్వాలు, ధార్మిక సంస్థలు విరాళాలు యిచ్చాయని మర్చిపోకూడదు.

నిజానికి టర్నోవరు పెరిగితే ధర తగ్గడం సహజం. ఎల్లా కృష్ణ కూడా అదే చెప్పారు. మా హెపటైటిస్ బి వాక్సిన్ ధర మంచినీళ్ల బాటిలు ధరకు యిస్తున్నాం. దీని డిమాండు పెరిగినపుడు యిది కూడా అదే ధరకు యివ్వగలం అని. దాన్నే పూనావాలా వెక్కిరించాడు. ఇప్పుడు యిబ్బడిముబ్బడిగా డిమాండు పెరిగింది కాబట్టి టీకా ధర బాగా తగ్గాలి. కానీ పెరగడమేమిటి? దీనికి లాజిక్ ఏమైనా వుందా? ఆక్స్‌ఫర్డ్ టీకా ధరలు అమెరికాలో 4 డాలర్లు, యుకెలో 3 డాలర్లు, ఈయూలో 3.5 డాలర్లు… యిలా వున్నాయి. అంటే రూ.300 లోపు. మన దేశంలో చౌకకార్మికులు కాబట్టి ధర దాని కంటె బాగా తక్కువగా వుండాలి. మరి రూ. 600కి అమ్మడమేమిటి?

పూనావాలా రూ.3000 కోట్ల గ్రాంటు అడిగితే, ప్రభుత్వం గ్రాంటుగా కాదు, అడ్వాన్సుగా మాత్రమే యిస్తానందని, అందుకని టీకా ధర రూ.150 నుంచి రూ.300కి పెరిగిందని ‘‘సాక్షి’’ ఏప్రిల్ 25 నాటి వ్యాసంలో చదివాను. అదే నిజమైతే ప్రభుత్వం గ్రాంట్‌గానే యిచ్చి టీకా ధర తగ్గేట్లు చేయవచ్చు కదా! మన దేశజనాభాలో 18 ఏళ్లు దాటినవారు 91 కోట్లు. అంటే 182 కోట్ల డోసులు కావాలి. వేస్టేజి కలిపితే 200 కోట్లు. ఒక్కోదానికి రూ. 150 ధర చెల్లించినా రూ.30 వేల కోట్లు అవుతుంది. బజెట్‌లో 35 వేల కోట్లు వాక్సిన్‌లకై పెట్టారు కదా! దానిలోంచి పూనావాలాకు గ్రాంట్ యిచ్చి రూ.150కి యివ్వమంటే సరి కదా!

7) వాక్సిన్ పంపిణీలో వ్యత్యాసం – వాక్సిన్‌ల కోటాను 18-44 ఏళ్ల జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు కేటాయిస్తామని కేంద్రం అంటోంది. కేసుల ప్రాతిపదికపై యివ్వడం సబబు కానీ, యిలా చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేసినట్లే! దీని ఔచిత్యం గురించి సుప్రీం కోర్టు అడిగితే ‘ఇది వైద్యనిపుణులు సూచించిన విధానం. తుది మాట మాదే, మీకేమీ సంబంధం లేదు’ అని కేంద్రం జవాబు చెప్పింది. పైగా ‘వాక్సిన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ పరిధిలోకి వస్తుంది, న్యాయపరిధిలోకి రాదు. అందువలన మీరు జోక్యం చేసుకోవద్దు. కాదూ కూడదని అత్యుత్సాహంతో మీరు కలగచేసుకుంటే, విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు.’ అని మొరటుగా జవాబు చెప్పింది. అనేక దేశాల్లో యీ టీకా ఉచితంగా యిస్తున్నారు కదా అంటే ‘విదేశాల నుంచి వాక్సిన్లు తెప్పిస్తున్నాం. రాష్ట్రప్రభుత్వాలను కంపెనీ నుంచి డైరక్టుగా కొనుక్కోవడానికి అనుమతి యిచ్చాం. (ఆ కంపెనీలు అలా అమ్మం అని యిప్పుడు చెప్పాయి) 45 ప్లస్ వాళ్లకు ఉచితంగా యివ్వడానికి మేం కట్టుబడి వున్నాం. అనేక రాష్ట్రప్రభుత్వాలు 45 లోపు వాళ్లకు ఉచితంగా యిస్తానంటున్నాయి. ఇంకేం కావాలి?’ అని వాదించింది. హెర్డ్ ఇమ్యూనిటీకై 70% మందికి టీకా యివ్వాలంటున్నారు. టీకాకరణలో అంకెలు చూడబోతే – ఇది రాసేనాటికి ‘‘న్యూయార్క్ టైమ్స్’’ ప్రకారం అమెరికా జనాభాలో 39% రెండుడోసులు తీసుకోగా (ఫస్ట్ ‌డోస్ తీసుకున్నవారు 49%), యుకె 34(57), ఇటలీ 17(35), జర్మనీ 14(40), ఫ్రాన్స్ 15(34), స్పెయిన్ 17(35), మన దేశం 3.1(11). వాళ్ల జనాభా తక్కువ, మనది ఎక్కువ అని వాదించేవాళ్లుంటారు. ఈ జనాభా రాత్రికి రాత్రి పుట్టుకుని వచ్చినది కాదు. ఎప్పుడూ వున్న సమస్యే. ఎక్కువ కాబట్టి, మన సౌకర్యాలు మరింతగా వుండాలి. ఏడాదిగా అవి ఏర్పాటు చేసుకున్నామా?

8) ఆరోగ్యవసతుల లేమి కారణంగా వాక్సిన్‌కు అనూహ్యమైన డిమాండ్ రావడం – ఇది ఆఖరి అంశం. మొదట్లో చెప్పినట్లు, సెకండ్ వేవ్ యింత ఉధృతంగా వచ్చి వుండకపోతే ప్రజలు టీకా కోసం ఎగబడేవారు కాదు. రోగం వచ్చినా సులభంగా చికిత్స చేయించుకోగలిగితే ఎగబడేవారు కాదు. కానీ ప్రభుత్వం యీ విషయంలో ఘోరంగా వైఫల్యం చెందింది. 60 ఏళ్ల కాంగ్రెసు పాలన పక్కన పెట్టండి. 2014 నుంచి యీ ప్రభుత్వం పెంచిన ఆసుపత్రి బెడ్స్ ఎన్నో చెప్పమనండి. అదీ కాదు, కరోనా వచ్చి మన లోపాలను పరిహసించి వెళ్లిన ఏడాదిలో పెంచినవెన్నో చెప్పండి. కరోనా సెకండ్ వేవ్ మనకు ఏడాది గడువు యిచ్చింది. అయినా యిప్పుడు కూడా ఆక్సిజన్ లేదు, మందులు లేవు, ఇంజక్షన్లు లేవు, బెడ్స్ లేవు అంటే ఎలా? పరిస్థితి యింత భీకరంగా మారడంతోనే ప్రజలు బెంబేలెత్తిపోయి వాక్సిన్ కాదు, నాటుమందు కాదు, కాలకూటవిషం తాగమన్నా తాగడానికి సిద్ధపడుతున్నారు.

నిజానికి ఈ ఏడేళ్ల బిజెపి ప్రభుత్వహయాంలో గర్వంగా చెప్పుకోదగినదేమైనా వుందా అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచడమే! రోజూ కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ వంటి అవినీతి మచ్చ వున్న మాజీ కాంట్రాక్టరుకి యీ పని అప్పచెప్పినప్పుడే ఎన్నికల ఖర్చుకి, ఫిరాయింపులకు బిజెపికి డబ్బులు ఎక్కణ్నుంచి వస్తున్నాయో తెలిసిందనిపిస్తుంది. ఈ ప్రభుత్వం మారితే తప్ప, అవన్నీ బయటపడవు. ఏది ఏమైనా ఏదైనా కట్టగల సామర్థ్యం వుండి, ప్రస్తుతం సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో తలమునకలా మునిగిన బిజెపి ప్రభుత్వానికి ఏడాదిలోగా తాత్కాలిక ఆసుపత్రులైనా కట్టడం అసాధ్యమంటే నమ్మబుద్ధి కావటం లేదు. అదే విధంగా ఆక్సిజన్ ప్లాంట్లు ఒకటి రెండు రాష్ట్రాలు తప్ప తక్కినవేవీ కట్టుకోలేదేం? బిజెపి పాలిత రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేదే! కేంద్రం ప్రత్యేక పథకం కింద ఆసుపత్రులు, ఆక్సిజన్ ఏర్పాటు చేసి వుండవచ్చు కదా! కరోనా కాకపోతే మరో రోగానికైనా అవసరపడతాయి కదా!

ఇప్పుడు వాక్సిన్ల కొరత ఏర్పడిన తర్వాత కూడా ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించటం లేదు. రాష్ట్రాలను డైరక్టుగా కొనుక్కోవండి కావలిస్తే అంది. ఫైజర్, మోడెర్నాలు యీ అభ్యర్థన కేంద్రం ద్వారా రావాలంది. అమెరికాలో 4 కోట్ల ఆస్ట్రాజెనెకా (మన కోవిషీల్డు) టీకాలు నిరుపయోగంగా పడివున్నాయి. మనకు ఫైజర్, మోడెర్నాయే సరిపోయాయి కదా, వీటిని ఇండియాకు పంపవచ్చు కదా అని అక్కడి ఎన్నారైలు అమెరికన్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాటి సందర్భాల్లో ‘విశ్వగురువు’ అనే భావన పక్కన పెట్టి, భారత ప్రధాని అమెరికా అధ్యక్షుడితో నేరుగా మాట్లాడితే చకచకా పనులవుతాయి. ట్రంప్ అయితే మోదీగారు ఛట్టున ఫోన్ చేసేవారేమో, బైడెన్ కాబట్టి జయశంకర్‌ను పంపి వూరుకున్నారు. అడిగేది తన కోసం కాదు, దేశప్రజలకోసం అని గుర్తుంచుకుని వుంటే యీ తాత్సారం జరిగేది కాదు.

కరోనా సెకండ్ వేవ్ బీభత్సం గురించి ఎంతమందినైనా నిందించి, తిలాపాపం తలా పిడికెడు అని సర్దిపెట్టేయవచ్చు. కానీ ప్రభుత్వాధినేత మోదీకి ఓ నాలుగు పిడికెళ్లు ఎక్కువ వేయాలని నా ఉద్దేశం. పైన చెప్పిన అంశాలన్నిటిలో ఆయన వైఫల్యం కనబడుతోంది. ఫస్ట్ వేవ్ వచ్చినపుడు జరిగిన తడబాట్లపై విమర్శ వచ్చినా సరిదిద్దుకోకపోవడం క్షమార్హం కాదు. ‘బిజెపి ‘అచ్ఛే దిన్’ తెస్తానంది కానీ ‘చచ్చే దిన్’ తెచ్చింది అంటూ నోట్ల రద్దు సమయంలో హేళన చేశారు కొందరు. ఇప్పుడు లిటరల్‌గా చచ్చే దిన్నే! ఆత్మీయుల మరణవార్తలు వారానికి మూడు వింటున్నాను. సెకండ్ వేవ్ అనారోగ్యాలకు, మరణాలకు బాధ్యత ఆయనదే. టీకా సర్టిఫికెట్ల మీదనే కాదు, సెకండ్ వేవ్ కరోనా డెత్ సర్టిఫికెట్లపై కూడా ఆయన బొమ్మ వేయడం సమంజసం. మన ఆక్రోశం మాట ఎలా వున్నా, త్వరలోనే కోవిడ్ ఔషధం వచ్చేస్తుందని, ప్రజలకు టీకాలపై ఆసక్తి తగ్గి, డిమాండు పడిపోతుందని, ఆ విధంగా కొరతను అధిగమిస్తామనీ ఆశిద్దాం. (సమాప్తం)

ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2021)