కరోనా కబలిస్తుంటే ఎన్నికలెందుకు అని అడగలేదు కానీ, కరోనా కబలిస్తుంటే అరెస్ట్ లేంటి అని మాత్రం అడుగుతున్నారు నారా లోకేష్. అసలింతకీ లోకేష్ ఏం మాట్లాడుతున్నారు..? చట్టం తన పని తాను చేసుకోవద్దు అంటున్నారా..? లేక నిందితుల తరపున వకాల్తా పుచ్చుకుంటున్నారా..?
టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, జనార్దన్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కక్ష సాధింపులంటూ ట్విట్టర్ పక్షి మరోసారి బయటకొచ్చి కేకలేసింది. ప్రజలను కరోనాకు బలిచేస్తూ, ప్రతిపక్షనేతలపై కక్షసాధింపు పనిలో సీఎం జగన్ బిజీగా ఉన్నారంటూ విమర్శిస్తున్నారు లోకేష్.
అచ్చెన్నాయుడు టైమ్ నుంచీ ఇదే పాట..
టీడీపీ నేతల అరెస్ట్ లకు వైసీపీ మహూర్తాలేవీ పెట్టలేదు. వారు చేసిన పాపాలే శాపాలై ఇప్పుడు నేతలంతా ఊచలు లెక్కబెడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా కరోనా కష్టకాలంలో అరెస్ట్ లేంటి అంటూ లోకేష్ ఇలాగే మాట్లాడారు. ఆ తర్వాత కొల్లు రవీంద్ర హత్య కేసులో అరెస్ట్ అయినా కూడా కరోనాతో లింకు పెట్టారు. ధూలిపాళ్ల నరేంద్ర, రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ విషయంలో కూడా టీడీపీ ఒకటే పాట పాడింది.
కరోనా కష్టకాలంలో ఈ అరెస్ట్ లేంటి అంటూ మండిపడింది. జనసేన కూడా వారికి వంతపాడింది. టీడీపీ లెక్క ప్రకారం.. కరోనా కష్టకాలంలో తప్పు చేసినవారిని అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాలనేది వారి సిద్దాంతం కావచ్చు. లేక కరోనా కష్టకాలంలో ఖైదీలను పెరోల్ పై బయటకు పంపించండి అన్న సుప్రీంకోర్టు సూచనను లోకేష్ ఇలా అర్థం చేసుకున్నారోమో తెలియాలి.
మేం ప్రతిపక్ష నేతలం, తప్పులు చేసుకుంటూ పోతాం, చూసీ చూడనట్టు ఉండాలి, అరెస్ట్ చేస్తే.. కక్షసాధింపు అంటాం.. అన్నట్టుంది లోకేష్ పరిస్థితి. జగన్ కక్షసాధించాలనుకుంటే.. ముందు చంద్రబాబు, లోకేష్ ని అరెస్ట్ చేసేవారు కదా. కర్నూలులో కొత్తరకం కరోనా వచ్చిందని చంద్రబాబు చేసిన తప్పుడు ప్రచారంతో ఏపీపై చాలా రాష్ట్రాలు నిషేధం విధించాయి.
ఇలాంటి విషయాల్లో భారత్ వేరియంట్ అని ప్రచారం చేస్తున్నవారికి కేంద్రం కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ చంద్రబాబు ఏకంగా ఓ జిల్లాని టార్గెట్ చేసుకుని కర్నూలు వేరియంట్ అంటూ రచ్చ చేశారు. కేసులు నమోదైనా, అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబుకి బేడీలు పడలేదు కదా..? మరిదాన్నేమంటారు.
ఇప్పటికైనా చినబాబు ఇలాంటి నాటకాలు ఆపాలి. కరోనా కష్టకాలంలో తప్పులు చేస్తే అరెస్ట్ చేయొద్దు అంటూ చెత్తలాజిక్ లు చెప్పకుండా ఉంటే బాగుంటుంది. రానురాను లోకేష్ మాటలు ఎలా తయారయ్యాయంటే.. కరోనా తగ్గిన తర్వాత ఎవర్నైనా అరెస్ట్ చేస్కోండి అన్నట్టుంది.