ఇప్పటివరకు పరీక్షలు రాసిన ఏ పదో తరగతి విద్యార్థికి ఎదురవ్వని కఠిన పరీక్ష ఇది. ఎప్పట్లా ఎగ్జామ్ హాల్ లో కూర్చొని ప్రశ్నాపత్నంపై దృష్టి పెడితే సరిపోదు. పక్కన ఎవరు తుమ్మతున్నారో, ఎవరు దగ్గుతున్నారో కూడా గమనిస్తూ పరీక్ష రాయాల్సిన సమయం ఇది. అవును.. ఇవాళ్టి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఇకపై ప్రతి రోజూ 2 పరీక్షలు. ఒకటి ప్రశ్నాపత్రంలో ప్రశ్నలకు జవాబులు రాయాలి, రెండోది కరోనా బారిన పడకుండా ఇంటికి వెళ్లాలి.
పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2530 పరీక్షా కేంద్రాల్ని విద్యాశాఖ సిద్ధంచేసింది. మొత్తంగా 5 లక్షల 34 వేల మంది ఈసారి పరీక్షలు రాస్తున్నారు. కరోనా వల్ల ఈసారి ప్రభుత్వం కొన్ని నిబంధనల్ని సడలించింది. విద్యార్థులు మాస్కులతో పరీక్షలు రాయొచ్చు. విద్యార్థులు తీసుకొచ్చే వాటర్ బాటిళ్లను కూడా ఎగ్జామ్ హాల్ లోకి అనుమతిస్తారు.
అటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఎగ్జామ్ హాల్ లో శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ఈసారి పరీక్ష గదిలో కేవలం 20 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకున్నారు. అందుకే పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. దీనికితోడు పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో వైద్యుల్ని కూడా ఉంచింది.
అయితే అన్ని పరీక్షా కేంద్రాలు ప్రభుత్వం చెప్పినట్టు లేవని పలువురు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉండడం లేదు. ఒకే గదిలో 20మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, నిబంధనలు సడలించినా జాగ్రత్తగా ఉండాల్సింది విద్యార్థులు మాత్రమే. ఈసారి పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వడమే కాకుండా, కరోనాను ఎదుర్కొనేందుకు కూడా ప్రిపేర్ అయి పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. వచ్చే నెల 6 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి.