మనకు ఇష్టమైతే ఏదైనా ఇంగువతో సమానం అని సామెత ఊరికనే పుట్టలేదు. ఆవు వ్యాసం మాత్రమే వచ్చిన వాడు ఏ వ్యవహారం అయినా అక్కడకే తీసుకెళ్తాడని జోక్ వుండనే వుంది.
జగన్ అంటే పిచ్చి కోపం వుండి వుండొచ్చు. చంద్రబాబు మీదనో, తెలుగుదేశం అంటేనో అంతకు మించిన ప్రేమ వుంటే వుండొచ్చు. ఈ రెండింటి వల్ల ఏ సంఘటన అయినా తనదైన కళ్లద్దాలతో చూడడం అలవాటైపోయిందేమో?
ఇలా చూడడంలో ఒక్కోసారి బ్యాలన్స్ గా రాయాలనో, బ్యాలన్స్ తప్పకూడదనో ప్రయత్నిస్తుంటారు. అలాంటపుడు చిత్రమైన సంగతులు బయటకు వస్తుంటాయి.
ఈవారం ఆర్కే ఏం రాసారు? ఒక సారి చూద్దాం.
''..మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ మీద తిరుగుబాటు వెనుక ప్రచ్ఛన్న శక్తి వుంటే వుండొచ్చు. కానీ ప్రేరణ మాత్రం ఏకపక్ష పోకడలే…''
ఇదీ ఆర్కే తీర్మానం. అలా రాస్తూ..ఆంధ్రకు వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చాక నెం2 గా ఎవ్వరూ ఎదగకుండా చూసారట. నాదెండ్లను నమ్మకపోవడంతో ఆయన అసంతృప్తితో తిరుగుబాటుకు దిగారట. జనం అప్పటికి ఇంకా ఎన్టీఆర్ అంటే అభిమానం వుండడంతో, మద్దతుగా నిలవడంతో నాదెండ్ల ప్లానింగ్ ఫలించలేదు అంటున్నారు ఆర్కే .
ఆ తరువాత కూడా ఎన్టీఆర్ వైఖరిలో అస్సలు మార్పు రాలేదట. కానీ నాదెండ్ల ఉదంతం చూసిన తరువాత జానారెడ్డి, కేఇ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు లాంటి వాళ్లకు అసంతృప్తి వున్నా ధైర్యం చేయలేకపోయారట.
ఆ తరువాత లక్ష్మీ పార్వతి పోకడలు సహించలేక అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి, సీనియర్లు అశోక్, యనమల వంటివారు కలిసి తిరుబాటు చేసారట.
అంటే నాదెండ్లది వెన్నుపోటు కాదా? ఆర్కే తిరుగుబాటు అనే చెబుతున్నారు. నాదెండ్ల తరువాత ఎవ్వరూ ప్రయత్నించడానికే భయపడ్డారు. చివరకు చంద్రబాబు ఆ పని చేసారు. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ పోకడలే అని క్లారిటీ ఇచ్చారు.
మరి ఇన్నాళ్లూ నాదెండ్లది వెన్నుపోటు అని కదా అంటూ వస్తున్నారు. నాదెండ్ల కుటుంబాన్నే దూరం పెట్టారు. ఇన్నాళ్ల తరువాత క్లారిటీ ఇచ్చారు…నాదెండ్ల..చంద్రబాబు చేసింది ఒక్కటే అని.
నాదెండ్ల టైమ్ లో ఉపేంద్ర అధికార కేంద్రంగా వున్నారు…చంద్రబాబు టైమ్ లో లక్ష్మీ పార్వతి వున్నారు. అప్పుడు నాదెండ్లకు ఈనాడు మద్దతు లేదు. చంద్రబాబు టైమ్ లో ఈనాడు మద్దతు వుంది. అంతే తేడా. మిగిలినది అంతా సేమ్ టు సేమ్.