ఆత్మకూరు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఆరంభంలోనే అధికార పార్టీ వైసీపీ అదరగొట్టింది. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌పై 5,337 ఓట్ల మెజార్టీని సాధించడం విశేషం. మొదటి రౌండ్లో వైసీపీ అభ్యర్థికి 6,067 ఓట్లు, బీజేపీ అభ్యర్థికి కేవలం 730 ఓట్లు మాత్రమే వచ్చాయి.
మొత్తం 20 రౌండ్లు ఉన్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటి రౌండ్ ఫలితం చూస్తే… వైసీపీ టార్గెట్ పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీ సాధించడం ఈజీ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా భారీ మెజార్టీ సాధించాలని వైసీపీ పట్టుదలతో ఎన్నికల వ్యూహం రచించింది.
ఇదిలా వుండగా ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేయలేదు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌తో పోల్చితే ఉప ఎన్నికలో దాదాపు 20 శాతం తక్కువ పోలింగ్ నమోదు కావడం గమనార్హం. దీంతో వైసీపీ ఊహించినంత మెజార్టీ రాకపోవచ్చనే ప్రచారానికి తెరలేచింది.
అయితే ఇప్పుడు ఒక్క రౌండ్ కౌంటింగ్ పూర్తి కావడంతో మెజార్టీపై ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ఏది ఏమైనా ఆరంభ ఫలితమే వైసీపీ ఊహించినంత మెజార్టీ రావడం మాత్రం ఆ పార్టీలో జోష్ నింపుతోంది.