ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమకిచ్చిన మాట నిలబెట్టుకోలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కొన్ని నెలలుగా కోపంగా ఉన్నారు. అసలు తమ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారో, చేయరో అనే అనుమానం కూడా మెజార్టీ సచివాలయ ఉద్యోగుల్లో ఉండేది. మరోవైపు ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా మాటలు, రాతలు సచివాలయ ఉద్యోగుల్లో మరింత భయాన్ని, ఆందోళనను పెంచాయి. చాలీచాలని జీతం ఇస్తూ, జీవితాంతం గ్రామ, వార్డు సచివాలయాలకు బానిసల్లా సేవలు అందించాల్సి వస్తోందని ఆవేదనలో వారిలో కనిపించేది.
ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేస్తూ వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సచివాలయ ఉద్యోగుల్లో ఆనందానికి అవధుల్లేవు. జగన్ చిత్రపటానికి రాష్ట్రవ్యాప్తంగా పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞత చాటుకుంటుండడం విశేషం.
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నెలకొల్పి, ఒక్కసారిగా 1.34 లక్షల కొత్త ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం సృష్టించింది. కేవలం మెరిట్ మార్కుల ఆధారంగానే నియామక ప్రక్రియ జరిగింది. ఇంటర్వ్యూ ప్రక్రియ చేపడితే అవినీతికి, ప్రతిపక్షాల ఆరోపణలకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని, ఆ ఊసే లేకుండా చేశారు.
తొలి విడత నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్మెంట్ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్‌కు అర్హత సాధించారని అధికారులు తెలిపారు. రెండో విడత నోటిఫికేషన్లో ఉద్యోగాలు పొందిన వారికి ఇంకా రెండేళ్ల సర్వీసు పూర్తి కాలేదు.
మొదటి విడత జాయిన్ అయిన వారికి కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు చేయడం ఆనందదాయకం. కొత్త పీఆర్సీ ప్రకారం జూలై నుంచి వేతనాల్ని తీసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా పలు అనుమానాలకు తెరదించుతూ ప్రభుత్వం ప్రొబేషన్ డిక్లేర్ చేసిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఇంతకాలం ఉన్న కోపం పోయినట్టేనా? ఆయనకు భవిష్యత్‌లో సచివాలయ ఉద్యోగులు, వారి కుటుంబాలు అండగా ఉంటాయా? కాలం జవాబు చెప్పాల్సిన ప్రశ్నలివి.