నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలో అకస్మాత్తుగా ఏంటీ మార్పు? ఉన్నట్టుండి ఆయనకు రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప, శత్రువులు లేరని కనిపించడం వెనుక కారణం ఏంటనే చర్చకు తెరలేచింది. రాజకీయ నేతలు ఊరికే ఏదీ మాట్లాడరు. మాట్లాడారంటే, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే హితవచనాలు పలికి ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ నెల్లూరు రాజకీయ చైతన్యానికి ప్రతీక.
నెల్లూరులో శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులకు, సర్పంచ్‌లకు, కార్యకర్తలకు చెబుతున్నా అంటూ జ్ఞానబోధ చేశారు. అదేంటంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడవద్దట.
ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను శత్రువుగా చూడొద్దని, వారిని రాజకీయాల్లో పోటీదారులుగా మాత్రమే పరిగణించాలని హితబోధ చేశారు. అధికార మదం తలకెక్కితే, అధికార మదంతో ప్రవర్తిస్తే ప్రజలు చెప్పాల్సిన రోజు, చెప్పాల్సిన విధంగా వాత పెడతారు సోదరులారా అని చెప్పడం చర్చనీయాంశమైంది.
ఏపీలో రాజకీయాలు ఘర్షణ వాతావరణంలో సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం శత్రువుల్లా దూషించుకోవడం, కేసులు పెట్టుకోవడం తదితర అవాంఛనీయ వాతావరణంలో రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో తమను టీడీపీ ప్రభుత్వం వేధించిందంటూ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగింది. దీంతో రాజకీయ నేతల మధ్య వైషమ్యాలు మరింతగా పెరిగాయి. ఒకరి చావులు మరొకరు కోరుకునేంత ద్వేషం నేతల మాటల్లో కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సంబంధాలు ఎలా వుండాలో క్లాస్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. రెచ్చగొట్టేలా కాకుండా తమ వారిని హెచ్చరించేలా కోటంరెడ్డి ప్రసంగించడం వైసీపీ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది. తనకు మంత్రి పదవి దక్కలేదని మీడియా సాక్షిగా కోటంరెడ్డి కన్నీళ్లపర్యంతం కావడం తెలిసిందే.
వైసీపీ అధిష్టానంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో తాజా తత్వబోధన కోటంరెడ్డి భవిష్యత్ రాజకీయ పంథాకు సంకేతాలా? అనే అనుమానం లేకపోలేదు.