ఏ సమస్యనీ, సందర్భాన్నీ వదిలిపెట్టకుండా సెటైర్లు వేసే రామ్ గోపాల్ వర్మ మళ్లీ “జస్ట్ ఆస్కింగ్” అంటూ మొదలు పెట్టేశాడు. ఈసారి కరోనా వైరస్ పై ఆయనకున్న ప్రేమను చాటుకున్నాడు. కరోనాపై వర్మ పేల్చిన సెటైర్లు.. ట్విట్టర్ లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. పనిలో పనిగా తన అభిమాన శత్రువు కేఏపాల్ పై కూడా పంచ్ లు వేశారు వర్మ.
కరోనా గురించి, తనకున్న వేల ఎకరాల స్థలాలను, పెద్ద పెద్ద బిల్డింగ్ లను ఐసోలేషన్ వార్డులుగా వాడుకోవాలంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేఏపాల్ ఇచ్చిన ఆఫర్ గురించి వర్మ జోకులు పేల్చాడు. అన్ని ఆఫర్లు ఇవ్వడం కంటే.. దేవుడికి చెప్పి ఆ కరోనా వైరస్ నే తీసేయొచ్చు కదా అని అన్నాడు వర్మ. నిన్ను ఇంతలా తిడుతున్నందుకు నాకు కరోనా వైరస్ సోకేలా శపించు అని కూడా సవాల్ విసిరాడు.
పాల్ కామెడీ హైలెట్ అయితే, ఇక వైరస్ పై వర్మ చూపించిన ప్రేమ మరో లెవల్. కరోనా వైరస్ ని సృష్టించిన దేవుడు ఆ వైరస్ తో ప్రేమలో పడ్డాడని, వారిద్దరూ లవర్స్ అయితే ఆ లవ్ స్టోరీలే జనాలే విలన్స్ అని, అందుకే జనాలను వైరస్ పట్టిపీడిస్తోందని సెలవిచ్చాడు. దేవుడు సృష్టించిన జనం చర్చిలు, మసీదులు, ఆలయాలు నిర్మించి పూజలు చేస్తున్నట్టే, అదే దేవుడు సృష్టించిన కరోనా వైరస్ కూడా ఆయన కోసం సూక్ష్మ స్థాయిలో గుడులు, చర్చిలు, మసీదులు కట్టే ఉంటుందని అవే దేవుడికి నచ్చి ఉంటాయని అన్నాడు. అందుకే మనం కట్టుకున్న ఆలయాలన్నీ మూసివేస్తున్నామని లాజిక్ గా మాట్లాడారు.
కరోనా రెలిజయన్ సృష్టిద్దామని కూడా నెటిజన్లకు సలహా ఇచ్చాడు వర్మ. పనిలోపనిగా భార్యాభర్తల సంబంధాల గురించి కూడా సెటైర్లు వేశాడు. ఐసోలేషన్ అనే ప్రక్రియ వల్ల ఒకరినొకరు ద్వేషించుకునే భార్యాభర్తలు కరోనాకు థ్యాంక్స్ చెబుతున్నారని, ఎవరి గదుల్లో వారు ఉంటున్నారని అన్నాడు.
అమెరికాలో ఓ మాల్ ముందు ఉన్న క్యూలైన్ ని చూపిస్తూ.. బాహుబలి-2 థియేటర్ల ముందు క్యూలైన్ రికార్డులు బద్దలైనట్టేనని రాజమౌళిని కూడా తన ట్వీట్లలోకి లాగేశాడు. ఫైనల్ గా తనకిష్టమైన షోలే సినిమాకి మాస్క్ లు అతికించి ఫన్నీ మీమ్ వదిలాడు వర్మ. ఇంకొన్నాళ్లు కరోనా వైరస్ ప్రపంచాన్ని వదలకపోతే రాబోయే రోజుల్లో సినిమాల్లో హీరోహీరోయిన్లు, చివరికి విలన్లు కూడా మాస్క్ లతోనే కనిపిస్తారని అప్పుడు షోలే లాంటి టైటిళ్లు థోలే అవుతాయని ట్వీటాడు.
మొత్తమ్మీద.. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. తన బుర్రలోని వెటకారాన్నంతా కరోనా సాకుతో ట్విట్టర్ పేజీలో పెట్టేశాడు ఆర్జీవీ. నవ్వుకున్నోళ్లకి నవ్వుకున్నంత, తిట్టుకున్నోళ్లకి తిట్టుకున్నంత..