మంచికో చెడుకో తెలియదు కానీ లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. నువ్వా నేనా అన్నట్లుగా ఏపీలో ఉన్న పొలిటికల్ సీన్ ఒక్కసారిగా డల్ అయింది. 90 శాతం సీట్లు టార్గెట్ దిశగా సాగుతున్న వైసీపీ దూకుడుకు కొంచెం బ్రేక్ పడింది.
అయితే ఎన్నికలు ఎపుడు పెట్టినా మాదే విజయం అని వైసీపీ మంత్రులు అంటున్నారు. ఉత్తరాంధ్రాలో తీసుకుంటే స్థానిక ఎన్నికలపైన టీడీపీకి పెద్ద ఆశలేమీ లేవు. విశాఖ మేయర్ సీటు విషయంలో కూసింత పేరాశ మిణుకుమంటోందిట.
దానికి కారణం నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి చెందిన వారు కావడమే. అయితే ఎటూ గ్యాప్ వచ్చింది కాబట్టి అధికార వైసీపీ ఎక్కడికక్కడ మరింత గట్టిగా సర్దుకునేందుకు అవకాశం ఏర్పడింది. దాంతో పాటే ఇప్పటి వరకూ వైసీపీ వైపుగా సాగుతున్న వలసలు ఉత్తరాంధ్రాలో మరింత ఎక్కువ అయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇందులో మాజీ మంత్రులు, తాజా ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వారూ వీరు అని చూడకుండా వచ్చిన వారికి వచ్చినట్లుగా కండువా కప్పేసి మరీ ఉత్తరాంధ్రా టీడీపీని కకావికలం చేసేందుకు వైసీపీకి ఇదే మంచి తరుణంగా కనిపిస్తోందని అంటున్నారు.
చేతిలో అధికారం, కావల్సినంత సమయం ఉండడంతో ఎన్నికల వాయిదా ఫ్యాన్ పార్టీకే ఎక్కువగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అప్పట్లో వైసీపీలో చేరాలని ఉవ్విళ్ళూరి వెనక్కి తగ్గిన ఓ బడా నాయకుడిని వైసీపీ వైపుగా లాగేసే కార్యక్రమం దాదాపుగా విజయవంతమైనట్లుగా చెబుతున్నారు.
అంతే కాదు, ఎన్నడూ ఊహించని ట్విస్టులు కూడా ఉంటాయని, ఎవరూ అనుకోని నాయకులే వైసీపీ గడప తొక్కుతారని కూడా అంటున్నారు. మొత్తానికి ఈ వాయిదా తమకు కొత్త ఇబ్బందులే తెస్తోందని సాక్షాత్తు తమ్ముళ్ళే అంగీకరిస్తూ విచారించడం విశేషమే.