సౌదీ అరేబియా పాలన యిప్పటివరకు సోదరుల మధ్యనే సాగుతూ వచ్చింది. రాచకుటుంబంలోని ముఖ్యులందరికీ ఏదో ఒక ప్రభుత్వ పదవి కట్టబెట్టడంతో వాటి ద్వారా ప్రభుత్వనిధులను తమకు కావలసినవారికి పంచుకునే వెసులుబాటు ఉండడంతో అందరూ ఖుషీగానే ఉంటూ వచ్చారు. పైగా అధికారాలన్నీ రాజు చేతిలో ఉండేవి కావు. ‘ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్’ (సమానుల్లో ప్రథముడు) అనే సిద్ధాంతానికి కట్టుబడి, అందర్నీ సంప్రదించి మెజారిటీ అభిప్రాయాన్ని అనుసరించి మెలగేవాడు. అందుకే యిన్నేళ్లూ సౌదీ అరేబియాలో కుట్రలు జరగలేదు.
అయితే ప్రస్తుత రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ 2015లో గద్దె నెక్కిన దగ్గర్నుంచి పద్ధతి మారిపోయింది. అందుకే అసంతృప్తి ఎక్కువవుతోంది. ఇతను గద్దె నెక్కేనాటికి మహమ్మద్ బిన్ నయీఫ్ అనే అతని అన్న కొడుకు యువరాజుగా, హోం మంత్రి (ఇంటీరియర్ మినిస్టర్)గా వుండేవాడు. ఇతను అతన్ని తీసేసి తన కొడుకు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను 2017 జూన్‌లో యువరాజుగా, డిఫెన్స్ మంత్రిగా, ఉపప్రధానిగా, ఎకనమిక్ కౌన్సిల్ చైర్మన్‌గా నియమించాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి సర్వాధికారాలు కట్టబెట్టినట్లు కొడుక్కి పూర్తి అధికారాలు యిచ్చేశాడు.
నిజానికి ప్రస్తుత రాజు తర్వాత జీవించి వున్న అతని సొంత సోదరుడు అహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ రాజు కావాలి. ఇప్పుడు యువరాజు సల్మాన్‌కి అతనిపై కన్ను ఉంది. అతన్ని ఎలాగైనా తప్పించేసి, తనే రాజై పోవాలని యితని ఆశ. తనకు అధికారం దక్కగానే 2017 నవంబరులో అవినీతిపై, మనీలాండరింగ్‌పై పోరాటం పేరుతో 40 మంది రాచబంధువులను ఖైదు చేశాడు. వారిలో మాజీ యువరాజు మహమ్మద్ నయీఫ్ ఒకడు.
పాత రాజు అబ్దుల్లాకు దన్నుగా నిలిచిన వ్యాపారస్తులను, మంత్రులను, దాయాదులను మొత్తం 500 మందిపై విచారణ జరిపించి, వారి బ్యాంకు ఖాతాలు స్తంభింపచేసి, 800 బిలియన్ డాలర్ల ఆస్తులను ఎటాచ్ చేసి, యిబ్బంది పెట్టాడు. చివరకు 2019 జనవరిలో అవినీతినిరోధక కమిటీ వర్క్ పూర్తయిందని ప్రకటించింది. 381 మంది వ్యక్తుల నుండి 107 బిలియన్ డాలర్లు వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు చేర్చారు. ఇదంతా తనకు ఎదురు లేకుండా చేసుకోవడానికి చేసిన కుట్రే అని అందరి అనుమానం.
ఇప్పుడు మార్చి 6న మళ్లీ రాజుగారిపై కుట్ర అంటూ కొందరిని ఒక హోటల్లో బంధించినట్లు వార్తలు వచ్చాయి. ప్రభుత్వం వాటిని ధృవీకరించలేదు, నిరాకరించలేదు. ఈ సారి బందీలైన వారిలో భవిష్యత్తులో రాజు కావలసిన అహ్మద్ బిన్ అబ్దుల్, అతని కుమారుడు నయీఫ్ బిన్ అహ్మద్, మాజీ యువరాజు మహమ్మద్ బిన్ నయీఫ్ ఉన్నారట. తన సోదరుణ్ని, సోదరుల కొడుకులను బందీలుగా చేయడానికి రాజు ఎందుకు ఒప్పుకున్నాడు అనేదే యింకా అర్థం కావటం లేదు.
కరోనా భయంతో మక్కాలోని గ్రాండ్ మసీదు మూసివేయడాన్ని అహ్మద్ ఎద్దేవా చేశారని, ఆ విషయం యువరాజు వెళ్లి చెప్పడంతో రాజుకి కోపం వచ్చి ఆదేశాలు యిచ్చాడని అంటున్నారు. అతను గతంలోనే యెమెన్‌పై తండ్రీకొడుకులు చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకించాడని అంటారు. వ్యాఖ్యలు చేస్తే కుట్ర అయిపోతుందా?
అసలు సంగతేమిటంటే అహ్మద్, నయీఫ్ యిద్దరూ గతంలో హోం మంత్రులుగా పని చేసినప్పుడు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పరచారు. తాము భవిష్యత్తులో రాజులైనప్పుడు తిరుగుబాట్లు జరిగితే ముందే కనిపెట్టేందుకు నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అవి యిప్పుడు యువరాజు సల్మాన్‌కు యిబ్బందిగా పరిణమించాయి. జర్నలిస్టు ఖష్షోగిని చంపిస్తే ఆ విషయం బయటకు వచ్చేసింది. దాన్ని యితరులపై నెట్టేసి ఏదో కాలక్షేపం చేశాడు కానీ రాచకుటుంబం అతనిపై గుర్రుగా వుండడంతో ఒక ఏడాది పాటు తగ్గి వున్నాడు. ప్రజలకు నచ్చిన సంస్కరణలను కొన్ని ప్రవేశపెట్టి వాళ్ల అభిమానంతో లాక్కు వద్దామని చూస్తున్నాడు.
ఇప్పుడు ఆయిల్ విషయంలో దేశ ఆర్థిక వ్యవస్థతో ఒక ప్రయోగం చేద్దామనుకుంటున్నాడు. అది బెడిసికొడితే ప్రజల్లో అసంతృప్తి కలిగి, తిరుగుబాటు రావచ్చు, తనకు తన విరోధులుగా ఉన్న బమైన రాచబంధువులు దానికి మద్దతు యివ్వవచ్చు. అది జరగకుండా చూడాలంటే ముందు వాళ్లని నిర్వీర్యం చేయాలి. బాబాయికి 78 ఏళ్లు ఉన్నా తన కజిన్ మహమ్మద్ నయీఫ్‌కు 60 ఏళ్లే. అంటే తన కంటె 26 ఏళ్లు మాత్రమే పెద్ద. అతన్ని యువరాజు పదవి నుంచి దింపేసి, తను ఎక్కినపుడు అతను అభినందించడానికి వచ్చాడు కానీ విధేయత (బయా) ప్రకటించలేదు.
ఈ ఆయిల్ ప్రయోగం యిప్పుడే ఎందుకు చేయాలి అంటే మూడేళ్ల ఒపెక్ ప్లస్ ఒప్పందం యీ నెలతో ముగిసిపోతోంది. ఏదో ఒక సాహసం చేసి రష్యాకు, అమెరికాకు బుద్ధి చెప్పి ప్రజల చేత ఓహో అనిపించుకోవాలని ఐడియా. మరో పక్క చూస్తే 84 ఏళ్ల తండ్రి అస్వస్థుడిగా ఉన్నాడు. ఆయనపై ఉన్న దాయాదులకు ఉన్న గౌరవం తనపై లేదని, ఆయన మరణానంతరం తనను లెక్క చేయరని తెలుసు. అందువలన వీళ్లను యిప్పుడే తండ్రి పేరు మీద ఖైదు చేసి, తన ఐడియా చీదేస్తే తనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించే నాయకుడు లేకుండా చేయాలని అనుకున్నాడు.
2030 నాటికి సౌదీ అరేబియాను గ్లోబల్ పవర్‌గా చేస్తానని, దానికి గాను దాని పెట్టుబడులను డైవర్సిఫై చేస్తానని యువరాజు సల్మాన్ చెప్పి వున్నాడు. కానీ ఆయిల్ ధరలు తగ్గిపోతూ రావడంతో దేశం ఆర్థికవ్యవస్థ దెబ్బ తింటోంది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గి చైనా సౌదీ నుంచి తన ఆయిల్ దిగుమతులను తగ్గించింది. ఇతర దేశాల్లో కూడా కరోనా వ్యాపిస్తూన్న కారణంగా ఆయిల్ ధరలు పడిపోయాయి. 2019 డిసెంబరు 31కి 66 డాలర్లున్న బారెల్ మార్చి రెండోవారానికి సగం రేటుకి లభిస్తోంది. ఈ టైములోనే ఒపెక్ ప్లస్ ఒప్పందంపై సమీక్ష చేయవలసిన అవసరం వచ్చింది.
2014 తర్వాత ఆయిల్ ధరలు దారుణంగా పడిపోయినప్పుడు సౌదీ నాయకత్వంలోని ఒపెక్ (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్), దానిలో సభ్యత్వం లేని రష్యా కలిసి ఒక ఒప్పందానికి వచ్చాయి. ధర పెరగాంటే డిమాండ్ ఎక్కువ, సప్లయి తక్కువ ఉండాలి. సప్లయి తక్కువ వుండాంటే ఉత్పాదన తగ్గించాలి. అందుకని ఉత్పత్తి తగ్గించాలని యీ దేశాలన్నీ అంగీకరించాయి. ఆ ఒప్పందం యీ నెలాఖరుతో ముగుస్తుంది. ఇప్పుడు కరోనా, యితర కారణాల వలన ధర పడిపోయింది కాబట్టి మన ఉత్పాదన మరింత తగ్గిద్దాం అని సౌదీ ప్రతిపాదించింది.
కానీ రష్యా దానికి ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే ఉత్పాదన తగ్గించి రష్యా కొన్ని విధాలుగా నష్టపోయింది. దాని ఎనర్జీ కంపెనీలు నష్టాల పాలయ్యాయి. దానితో సౌదీకి కోపం వచ్చింది. రష్యాను ఎలాగైనా దెబ్బ కొట్టాని, ధరలు యింకా తగ్గించాలని ఉత్పత్తి పెంచేసింది. రోజుకి 97 లక్షల బారెల్స్ యిప్పుడు తయారు చేస్తున్నాం కదా, ఏప్రిల్ నుంచి 123 లక్షలు చేస్తాం అంటోంది. పైగా ధరలపై డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఇలా రష్యాను దెబ్బ కొట్టి అది దాసోహం అన్నాక, అప్పుడు ఉత్పత్తిని బాగా తగ్గించేయాలని ప్లాను. ఒకవేళ రష్యా లొంగి రాకపోతే కనీసం రష్యన్ మార్కెట్టయినా తనకు కైవసం అవుతుంది.
దీనితో బాటు అమెరికాను కూడా దెబ్బ కొట్టాలని చూస్తోంది సౌదీ. అమెరికాలో షేల్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే కంపెనీలున్నాయి. వీళ్లు బావుల నుంచి తైలాన్ని బయటకు తీస్తే వాళ్లు శిలాజాలనుంచి తయారు చేస్తారు. నెలకు 12 బిలియన్ బ్యారెళ్లను తయారు చేసి మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. కానీ ఆ తయారీ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సౌదీ పడగొట్టేసిన ధరకు అమ్మితే వాళ్లు దివాళా ఎత్తుతారు. అదే సౌదీకి కావలసినది. దెబ్బకి రష్యా, అమెరికా రెండూ కుదేలవుతాయి. అవి నాశనమయ్యాక తను ఎంత రేటుకి కావాలంటే అంత రేటుకి అమ్ముకుని సూపర్ పవర్‌గా ఎదగవచ్చు.
అయితే యీ లోపున సౌదీ ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురవుతుంది. ఇప్పటికే దాని బజెట్ లోటు 50 బిలియన్ డాలర్లుంది. దాని ఆదాయంలో 90% పెట్రోలియం సెక్టార్ నుంచే వస్తుంది. బజెట్ బాలన్స్ కావాలంటే బ్యారెల్ కనీసం 60 డాలర్లకు అమ్మాలి. రష్యా వేచి చూసే పాలసీ అవంబిస్తోంది. ఏదో ఒక విధంగా సౌదీ అమెరికన్ షేల్ కంపెనీను నాశనం చేస్తే మార్కెట్లో వాటి పోటీ తప్పిపోతుంది. పైగా రష్యా ఆదాయంలో 30% మాత్రమే ఆయిల్ నుంచి వస్తుంది. అందువలన ఆ సెక్టార్లో నష్టాల వలన దాని బజెట్ మరీ కుదుపుకు గురి కాదు.
సౌదీ పరిస్థితి అది కాదు కాబట్టి, అమెరికాను, రష్యాను దెబ్బ తీసే క్రమంలో ఒపెక్ దేశాన్నీ బలహీనపడతాయని రష్యా ఆశ. తన ఆయిల్ కంపెనీలు బలహీనపడుతూంటే అమెరికా చూస్తూ ఊరుకోదు కదా. ఎంత మిత్రదేశమైనా సౌదీని దెబ్బ కొట్టాలని చూడవచ్చు. అది తెలిసి కూడా యువరాజు సల్మాన్ యీ జూదమాడుతున్నాడు. పర్యవసానం ఎలా ఉన్నా జూదక్రీడ సాగేటంతకాలం సౌదీ పౌరులకు సౌకర్యాలు తగ్గించవలసి రావచ్చు. దానివలన ప్రజల్లో అసంతృప్తి కలుగుతుందని, దాన్ని రాచకుటుంబంలోని తన పోటీదారులు సొమ్ము చేసుకుంటారనే భయంతోనే వారిని ముందుగా బంధించాడని అనుకోవాలి.
చివరగా- యీ ఆటలో ఇండియాకు దక్కే అరటిపండు ఏమైనా ఉందా అంటే మనం మన అవసరాల్లో 83% ఆయిులును దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ధరలు తగ్గితే కేంద్ర ప్రభుత్వ ఖజానాకు లాభమే. ఇక సామాన్యుడి మాట కొస్తే ఏమైనా లాభమా అంటే నమ్మకం లేదు. ప్రస్తుతానికైతే పెట్రోలు, డీజిలు ధరఎనిమిది నెలల క్రితం ఉన్న ధరకు వచ్చింది. అంతర్జాతీయంగా ధర సగానికి పడిపోయింది కదా, మనకెందుకు పడదు అంటే యీ ప్రభుత్వ విధానం అది!
కేంద్రమూ పన్ను వేసి ఆర్జించుకుంటోంది, వివిధ పార్టీల ఆధీనంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలూ ఆర్జించుకుంటున్నాయి. ఏమైనా అంటే ప్రజలు ఎక్కువగా సొంత వాహనాలు వాడకుండా, కాలుష్యం పెరగకుండా చూడడానికి యిలా చేస్తున్నాం అంటారు. ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు బస్సులు, లారీలు యివన్నీ ధరలు పెంచుతాయి. వస్తువుల రవాణా కాస్ట్లీ కావడంతో వస్తువుల ధరలుపెరుగుతాయి. కాస్కేడింగ్ ఎఫెక్ట్‌తో అన్ని ధరలూ పెరుగుతాయి. ఇవి పాలకులకు తెలియదా? అయినా బుకాయిస్తారు.
ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2020)
[email protected]