రేవంత్ రెడ్డికి బెయిల్ లభించింది. నాయకుడు జైల్లో నుంచి రాగానే అనుచరులు అభిమానులు పండగ చేసుకోవడం చాలా మామూలు సంగతి అయిపోయింది. అలాగే కొన్ని రోజులుగా రిమాండులో ఉన్న రేవంత్ రెడ్డి బెయిలు మీద బయటకు రాగానే ఆయన అనుచరులు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి అనుచరగణానికి ఈ ఆనందం క్షణభంగురమేనా? వాళ్లను నిరాశ పరచడానికి మరో షాక్ ఎదురుచూస్తున్నదా అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి రేవంత్ రెడ్డి ఇవాళ బెయిలు మీద బయటకు రావడం కాదు. ఇదివరలో కూడా ఆయన బెయిలు మీదనే బాహ్య ప్రపంచంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబునాయుడు మాటలను నమ్ముకుని, ఆయన ప్రాపకం, మిత్రుడి ప్రయోజనం కోసం ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న తర్వాత.. చాలా కాలం పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. బెయిలుపై బయటకు వచ్చాక… కొన్నాళ్లు మామూలుగానే ఉన్నప్పటికీ.. ఆయన తిరిగి కేసీఆర్ ప్రభుత్వంపై చెలరేగడం ప్రారంభించారు. ఎంపీ అయిన తర్వాత ఆ జోరు మరింత పెరిగింది.
ఇటీవల ఆ జోరులో భాగంగా ఆయన కేటీఆర్ మీద బురద చల్లడానికి ప్రయత్నించడమూ.. డ్రోన్ కెమెరాలను ప్రయోగించడం అనేది నేరంగా పరిణమించింది. అనుమతి లేకుండా డ్రోన్ లను ఎగురవేసినందుకు గాను… రేవంత్ రెడ్డి మీద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు రిమాండు విధించింది. ఆ కేసులో ఇప్పుడు బెయిలు వచ్చింది. అయితే ఇందులో పెద్దగా మురిసిపోయేంత విజయం లేదు.
ఎందుకంటే.. ఈ కేసులో ఆయన జెయిల్లో ఉన్న సమయంలోనే… ఓటుకు నోటు కేసులో ఏసీబీ చాలా సవివరమైన చార్జిషీటును దాఖలు చేసింది. ఆ కేసులో ఆయన ఏ1 నిందితుడు. ఆ కేసులో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష తప్పదనేవారున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఓటుకు నోటు కేసులో తుది తీర్పు వస్తే గానీ.. రేవంత్ సేఫ్ అవునో కాదో చెప్పలేం. ఇంకో సంగతి.. ఆ తీర్పుతోనే చంద్రబాబునాయుడు భవితవ్యం కూడా తేలనుంది. ఆయన గొంతుగా చెబుతున్న ఫోన్ కాల్ రికార్డింగ్ విషయంలో ఏసీబీ ఫోరెన్సిక్ నివేదికను కూడా కోర్టుకు సమర్పించిందని వార్తలు వస్తున్నాయి.