కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనేది సామెత! నిజానికి కత్తిపీటకు దురద ఉండకూడదనే నియమం ఏముంది? కందకు తగిన దురద కందకు ఉంటే.. తనకు తగినంత దురద కత్తిపీటకు కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కందకంటె ఎక్కువ దురద కూడా కత్తిపీటకు ఉంటుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది. సీఎం కమల్ నాధ్ కు లేని టెన్షన్, మాజీ కాబోతున్న ఎంపీ దిగ్విజయ్ సింగ్ లో కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్ లో మొన్నటిదాకా ఉన్న పార్టీ బలాలను లెక్కవేసుకుని… ఎన్ని ఎంపీ స్థానాలు తమ పార్టీకి దక్కుతాయో కాంగ్రెసు లెక్క వేసుకుంది. ఆ స్థానాల్లో ప్రస్తుతం పదవీకాలం ముగిసిన జాబితాలోని దిగ్విజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఆయన మధ్యప్రదేశ్ వాసే గనుక.. అదే రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ కూడా వేశారు.
కానీ.. పార్టీలో కీలక నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా భాజపాలో చేరిపోవడం, ఆయన వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేయడం వారికి అనూహ్యమైన పెద్ద మలుపు అని అనుకోవాలి. కాంగ్రెస్ పరిస్థితి పాపం ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఆ రాజీనామాలను ఆమోదిస్తే తక్షణం ప్రభుత్వం కూలుతుంది.. ఎంపీ పదవి ఓడిపోతారు. ఆమోదించకపోయినా ప్రభుత్వం కూలుతుంది. ఎంపీ పదవికి బేరాలు సాగించుకోవచ్చు..!
అందుకే దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు బేరాల బాట పట్టారు. బెంగుళూరు క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు ఎకాయెకీ స్వయంగా వచ్చేశారు. వారిని నిర్బంధించారని, తాను వెళ్లి వారితో మాట్లాడి కాపాడాలని సెలవిచ్చారు. కానీ ఆయన పప్పులు కన్నడ పోలీసుల వద్ద ఉడకలేదు. వారు అరెస్టు చేసి నిర్బంధించారు. వారిని కలవనిచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తానని కూడా ఆయన హెచ్చరించారు.
హతవిధీ.. కాంగ్రెసులో ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ వృద్ధ నేతకు ఎన్నికష్టాలు వచ్చాయో కదా… మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవసరమైన ఓట్లు సంపాదించుకోవడానికి.. ఆయన అరెస్టు కావడానికి, దీక్షలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇంతకూ కమల్ నాధ్ మాత్రం.. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఎటూ తనది కూలిపోయే ప్రభుత్వమే గనుక.. ఎమ్మెల్యేల గురించి పెద్దగా ఫోకస్ పెడుతున్నట్లు లేదు మరి!