జగన్మోహన రెడ్డి సుప్రీం కోర్టు తీర్పు చూసిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోవాలని, ఈ సుప్రీంతీర్పుతో జగన్మోహన రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు 43వ లెంపకాయ పడిందని.. తెలుగుదేశం వర్గాలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. అక్కడికేదో సుప్రీం తీర్పు జగన్ సర్కారుకు చెంపపెట్టు అన్నట్టుగా వారు పండగ చేసుకుంటున్నారు.
కాదు కాదు… పండగ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు. జగన్ కు కోర్టు అక్షింతలు పడ్డాయనే భ్రమల్లోకి ప్రజల్ని నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకూ కోర్టు తీర్పులో వారు అంతగా పండగ చేసుకోవాల్సిన అంశం ఏముంది?
సుప్రీం కోర్టు తమ తీర్పులో- తర్వాత ఎన్నికలు ఎప్పుడు జరుగాయనే సంగతి నిర్ణయించేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుందనే నిర్ణయాన్ని కొట్టిపారేయడమే అన్నిటికంటె కీలకమైన అంశం. దీనివల్ల ప్రభుత్వానికి చేతులు కట్టేసినట్లుగా మారిన నిబంధనల నుంచి సర్కారుకు ఉపశమనం లభించింది.
అన్నిటికంటె మించి ఉగాది పర్వదినం నాటికి ఏకంగా సుమారు మూడు లక్షల మందికి ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేయదలచుకున్న బృహత్ యజ్ఞం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రభుత్వంలోకి వచ్చిన నాటినుంచి.. నిరుపేదలను ఇంటిస్థలాల యజమానులుగా చేయాలనే సత్సంకల్పంతో జగన్మోహన రెడ్డి ఇచ్చిన హామీని అనుకున్న గడువు తేదీకే నిలబెట్టుకునే సదవకాశం ఈ తీర్పు ద్వారా లభించింది.
ఇది చాలా కాలం కిందటే ప్రకటించిన పథకం గనుక.. లబ్ధిదారుల ఎంపిక పర్వం కూడా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కంటె ముందే పూర్తయిపోయింది గనుక… ఈ కార్యక్రమానికి ఆటంకాలు సృష్టించవద్దని జగన్ సర్కారు ఎన్నికల సంఘాన్ని కోరింది.
నోటిఫికేషన్ విడుదల చేసిన రోజున… ఉగాది నాడు ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం కోడ్ నిబంధనల కిందికి వస్తుందో లేదో పరిశీలించి చెబుతామని.. కాస్త ఆశావహంగా ఈసీ వెల్లడించారు. రెండు రోజుల తర్వాత.. ఇళ్లపట్టాల పంపిణీ ఆపివేస్తున్నట్లు చెప్పారు. నిజానికి అప్పటికీ ప్రభుత్వం ప్రతికూలంగా స్పందించలేదు.
కానీ కరోనా అనే సాకుతో ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేసిన తర్వాత.. అప్పటిదాకా కోడ్ అమల్లో ఉంటుందని చెప్పడమే చోద్యంగా తయారైంది. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత.. అప్పటిదాకా కోడ్ అమల్లో పెడితే ఎలా అని సుప్రీం ధర్మాసనం ఈసీని నిలదీయడమే జగన్ సర్కారు సాధించిన విజయం.
ఈ తీర్పుతో ఇళ్ల పట్టాల పంపిణీ నిర్విఘ్నంగా సాగుతుంది. మరైతే.. తెలుగుదేశం నాయకులు ఎందుకు పండగ చేసుకుంటున్నారో… అసలు వారికి ఏమైనా క్లారిటీ ఉందో లేదో అర్థం కావడం లేదు.