సీతారామశాస్త్రి విరించిగా మారి విరచించిన సినీ గీతం సిరివెన్నెల. ఒక్కో తరంలో ఒక్కో మహా గేయ రచయితను కలిగి వుండడం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం. మల్లాది, పింగళి తరం దగ్గర నుంచి ఆత్రేయ, శ్రీశ్రీ ల మీదుగా వేటూరి వరకు వచ్చిన సత్సంప్రదాయాన్ని నిలబెట్టిన కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అన్నట్లుగా, ఆయనే సినిమా దగ్గరకు వచ్చారు. వసంత గీతాలు రచించారు.
అలాంటి సిరివెన్నెలకు పద్మశ్రీ వచ్చింది. కాదు. కాదు. చాలా ఆలస్యంగా వచ్చింది. అయితేనేం వచ్చింది. తెలుగువాడైన సిరివెన్నెలకు తెలంగాణ కోటాలో వచ్చింది. ఉత్తరాంధ్రలో పుట్టి, పెరిగి, తండ్రి యోగి మాస్టారి నుంచి నేర్చుకున్న విద్యతో ఉద్యోగం సాధించి, కానీ కవిత్వాన్ని సాధన చేసి, సినీ కవిగా మారారు.
స్పృశించని జోనర్ లేదు. వినిపించని స్వరం లేదు. నినదించని సమస్య లేదు. ఎపుడో అపుడు ఎవరో ఒకరు నడవరా ముందుగా అని చెప్పినా, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అని నిలదీసినా, బలపం పట్టి భామ ఒళ్లో అ..ఆ..ఇ..ఈ నేర్చుకున్నా..ఆయనకే చెల్లు.
ప్రకృతిని, ప్రకృతి ధర్మాన్ని ఎక్కువగా పాటల్లో వినియోగించిన సినీ కవి సిరివెన్నెలే అనుకోవాలి. ఇండస్ట్రీ చేత గౌరవంగా శాస్త్రిగారు అని పిలుపించుకున్న ఆయన రాసిన పాటలను పలవరిస్తూ పోవాలి అంటే, అదో ఉద్గంధ్రమే అవుతుంది. లేదా పరిశోధనే అవుతుంది.
అలాంటి మహా రచయితకు పద్మశ్రీ అన్నది ఓ పురస్కారం మాత్రమే. అంతకు మించిన పురస్కారాలు ఏమున్నా అన్నింటికీ ఆయన అర్హుడు. ఏ అర్హతలు పెద్దగా లేకున్నా, రాజకీయ, సామాజిక పలుకుబడితో అవార్డులు తెచ్చుకున్న వారెందరోవున్నారు. అయితే మోడీ వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న మంచి విషయం ఏమిటంటే, ఈ అవార్డులు మాత్రం కాస్త అర్హమైనవారికి మాత్రమే ఇస్తున్నారు. అదో సంతోషం.
పద్మశ్రీ అందుకున్న సీతారామశాస్త్రి గారికి అభినందనలు.
బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?
అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత