ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రతిదీ రాజకీయ ప్రయోజనం పొందాలని టీడీపీ భావిస్తోంది. అయితే దీన్ని తప్పు పట్టాల్సిన పనిలేదు. రాజకీయ పార్టీలు ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలని అనుకోవడం సహజం. అయితే ఇందుకు హింసకు పాల్పడి సమాజంలో అశాంతిని క్రియేట్ చేయాలనే ఆలోచనే దుర్మార్గం. చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా ఈ దఫా హింసను ప్రేరేపిస్తున్నారనే అభిప్రాయం సొంత పార్టీ నుంచి కూడా వస్తోంది.
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, తన పర్యటన షెడ్యూల్‌లో లేని పుంగనూరు పట్టణంలోకి వెళ్లాలని అనుకోవడమే విధ్వంసానికి దారి తీసింది. పైగా తరిమి కొట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పుంగనూరు నుంచి తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆయన అటు వైపు కన్నెత్తి చూడడానికి భయపడ్డారు. అలాగని ఊరుకోలేదు.
పుంగనూరు బైపాస్ మీదుగా వెళ్తానని చెప్పి, ఆ తర్వాత అకస్మాత్తుగా పట్టణంలోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో వ్యవహారం గందరగోళంగా మారింది. పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. టీడీపీ శ్రేణుల్ని నిలువరించే ప్రయత్నంలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయాలపాలయ్యారు. ఇదే సందర్భంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడి చేసుకున్నారు. తన పర్యటన రణరంగంగా మారాలని చంద్రబాబు కోరుకున్నట్టుగానే జరిగిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. తద్వారా రాజకీయ ప్రయోజనాన్ని పొందొచ్చనేది చంద్రబాబు భావన. రాజకీయ పార్టీల ప్రయోజనాలు ఎలాగున్నా అంతిమంగా నష్టపోయేది, పోతున్నది మాత్రమే కార్యకర్తలే. అనవసరంగా కేసుల్లో ఇరుక్కుని ఎక్కడెక్కడో దాక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇప్పటి వరకు పుంగనూరు విధ్వంసం కేసులో 62 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు సెబ్ ఏఎస్పీ శ్రీలక్ష్మి వెల్లడించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ విధ్వంసాలకు ప్రధాన కారకులుగా సాంకేతిక ఆధారాలతో గుర్తించి పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి పీఏ గోవర్ధనరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. విచారణలో కుట్ర బాగోతం బయట పడిందన్నారు.
ఈ నెల 2న రొంపిచెర్లలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో కుట్రకు స్కెచ్ వేశారన్నారు. రూట్ మ్యాప్‌లో మాత్రం పుంగనూరు బైపాస్ మీదుగా బాబు వెళ్తారని చూపి, ఆ తర్వాత పట్టణంలోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తే పోలీసులు, వైసీపీ శ్రేణులు అడ్డు పడతాయని, అప్పుడు గొడవ సృష్టించొచ్చనే ముందస్తు ప్రణాళికతోనే చేశారనే వాస్తవాల్ని బయటపెట్టారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల కాల్పులు జరిపితే, కొందరి ప్రాణాలు పోతే, ఆ శవాలపై అధికార పునాదులు నిర్మించుకోవాలనే చంద్రబాబు దుష్టపన్నాగాలు సాగలేదనేది పోలీసుల వాదన.
పుంగనూరు ఎపిసోడ్‌తో వైసీపీ, అలాగే ప్రభుత్వం అప్రమత్తం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. పుంగనూరు వేదికగా చాలా పెద్ద ఎత్తుగడ వేసుకున్నప్పటికీ, అదృష్టం కొద్ది అవేవీ వర్కౌట్ కాలేదని వైసీపీ చెబుతోంది. ఆదిలోనే చంద్రబాబు ప్లాన్ అట్టర్ ప్లాప్ అయ్యిందనేది ప్రభుత్వ, అధికార పార్టీ అభిప్రాయం.