టీటీడీ నూతన పాలక మండలి చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి ఈ నెల 10వ తేదీ ఉదయం 11.44 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 8వ తేదీతో ప్రస్తుత పాలక మండలి గడువు ముగియనుంది.
ఏ మాత్రం ఆలస్యం కాకుండా వెంటనే కొత్త చైర్మన్‌ను సీఎం జగన్ నియమించడం విశేషం. గతంలో వైఎస్సార్ హయాంలో 2006 నుంచి 2008 వరకూ రెండేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా భూమన బాధ్యతలు నిర్వర్తించారు.
టీటీడీలో భూమన బలమైన ముద్ర వేయగలిగారు. అనేక విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుని టీటీడీ పరపతిని పెంచారన్న పేరు దక్కించుకున్నారు. ఇప్పుడు వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ పాలనలో రెండోసారి ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని భూమన దక్కించుకోవడం విశేషం. టీటీడీలో భూమన మరోసారి నూతన సంస్కరణలకు శ్రీకారం చుడతారనే చర్చకు శ్రీకారం చుట్టింది.
టీటీడీ నేతృత్వంలో అనేక విద్యా, వైద్య, ఆధ్మాత్మిక రంగాలకు చెందిన సంస్థలు నడుస్తున్నాయి. వాటి నిర్వహణ తీరుపై విమర్శలున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థల్లో తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో చదువు వెనుకపడిందనే విమర్శ వుంది. అలాగే తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం వుంది.
తిరుమల అంటే వీఐపీలకు మాత్రమే సంబంధించిన వ్యవహారమనే ఆరోపణ లేకపోలేదు. సామాన్య భక్తులకు దర్శనం, వసతుల కల్పన విషయమై పెద్ద పీట వేయాల్సిన అవసరం వుంది. వీటన్నింటిపై భూమన ప్రత్యేక దృష్టి సారించి మరోసారి తనదైన ముద్రను వేస్తారని ఆశిద్దాం.