హైదరాబాద్ పుష్పాలగూడా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. కొన్ని వందల అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది. వేల మంది కార్మికులు పని చేస్తూ వుంటారు. ఉదయం, సాయంత్రం చీమల్లా కనిపిస్తూ వుంటారు. అంతా బీహార్ వాళ్లు. ఎవరికీ తెలుగు రాదు. ఎక్కడో చిన్నచిన్న గుడారాల్లో నివసిస్తూ వుంటారు. లాక్‌డవున్‌లో రోడ్డు మీద కనిపడిన పాదయాత్రికులు వీళ్లే.
శనివారం సాయంత్రం 5 గంటలకి బయటకెళితే రకరకాలుగా అరుస్తూ వందల మంది రోడ్డు మీద కనిపించారు. ఎత్తయిన రేకుల మధ్య పెద్ద నిర్మాణం జరుగుతూ వుంది. అక్కడ మట్టి కూలి ముగ్గురు చనిపోయారని అంటున్నారు. ఒకడు ప్రాణాలతో బయట పడ్డాడట. సంఖ్య ఇదే కావచ్చు, కాకపోవచ్చు. మరణాలు నిజం.
వాళ్ల కోసం ఇంటి దగ్గర భార్యాబిడ్డలు ఎదురు చూస్తూ వుంటారు. వీళ్లు పంపే డబ్బులే ఆధారం కావచ్చు. టీవీల్లో, మీడియాల్లో రెండు రోజులు వార్తలొస్తాయి. తరువాత మరిచిపోతారు. వాళ్లకెంత పరిహారం దక్కుతుందో తెలియదు.
భాషరాని వాళ్లు, నోరున్నా అడగలేని వాళ్లు. లాక్‌డవున్‌లో డబ్బులు ఎగ్గొట్టి రోడ్డు మీదకి తోస్తేనే మౌనంగా నడుస్తూ వూరు చేరిన వాళ్లు. మరణం కూడా తమ తలరాత అని భావించేవాళ్లు.
హైదరాబాద్‌లో కొన్ని లక్షల మంది కార్మికులు భద్రత లేని స్థితిలో పని చేస్తున్నారు. అధికారులు పట్టించుకోరు. ప్రమాదాలు జరిగితే కాస్త హడావుడి. మళ్లీ మామూలే. మనం కూడా మరణానికి అలవాటు పడిపోతున్నాం.
జీఆర్ మహర్షి