కరోనా వైరస్ చేస్తున్న నష్టం అంచనా అంత సులువుగా అందేది కాదు. ప్రపంచంలోని ప్రతి రంగం కరోనా వైరస్ కారణంగా ఎఫెక్ట్ అవుతోంది. ప్రతి వాణిజ్య రంగం నష్టాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. టూరిజం, హోటల్, విమాన, సినిమా, మీడియా ఇలా ప్రతి రంగం కరోనా కారణంగా వేలాది కోట్లో, వందలాది కోట్లో నష్టపోతున్నాయి. ఒక్క ఆసుపత్రులు, మందుల దుకాణాలు మాత్రమే కరోనా బారి నుంచి తప్పించుకోవడమే కాకుండా, మరి కాస్త లాభాలు చేసుకునే అవకాశం వుంది.
తెలుగు నాట హోటళ్లు, రెస్టారెంట్లు, గట్టి దెబ్బతింటున్నాయి. పెద్ద పెద్ద స్టార్ హోటళ్లు నిర్వహణ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. సినిమా హాళ్లు మూత పడుతున్నాయి. దానివల్ల సిబ్బంది కూడా ఇంతో అంతో ఇబ్బందిని పాలు పంచుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
టాలీవుడ్ కూడా కాస్త ఎక్కువ నష్టమే చవిచూసేలా కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. చిన్న, మీడియం, పెద్ద సినిమాలు అన్నీ పనులను తాత్కాలికంగా పక్కన పెట్టాయి. దీనివల్ల విడుదల డేట్ లు కాస్తయినా తేడా వచ్చేలా కనిపిస్తోంది. మరో వారంలో కరోనా వ్యవహారం కుదుట పడిపోతే ఫరవాలేదు.
ఏప్రియల్ 2 నుంచి షెడ్యూలు అయిన సినిమాలు యథాతథంగా విడుదలయిపోతాయి. అలా కాకపోతేనే సమస్య. ముఖ్యంగా డొమస్టిక్ మార్కెట్ సంగతి ఎలా వున్నా, ఓవర్ సీస్ మార్కెట్ వ్యవహారం చూస్తుంటే ఇప్పట్లో కుదరుకునేలా కనిపించడం లేదు. కనీసం లో కనీసం నెల అయినా పట్టేలా వుంది. అలా అయితే ఓవర్ సీస్ మార్కెట్ ను వదులుకోవాల్సి వస్తుంది. లేదా సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టాల్సివస్తుంది.
ఏప్రియల్, మే నెలల్లో విడుదలయ్యే సినిమాలు అన్నీ కలిపి ఓవర్ సీస్ మార్కెట్ కనీసం ఓ ఇరవై కోట్లు అయినా వుంటుంది. అదంతా వదులుకునే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో నిర్మాణాలు ఆలస్యం అయిన కొద్దీ వడ్డీలు పెరుగుతాయి. కరోనా సాకు చూపి వడ్డీలు కోత కోస్తే, ఫైనాన్షియర్లు నష్టపోతారు. లేదూ అంటే నిర్మాతలు నష్టపోతారు. మొత్తం మీద ఎవరో ఒకరు నష్టపోవాల్సిందే.
అదే విధంగా కరోనా సర్దు కోకుండా విడుదల చేస్తే, డిస్ట్రిబ్యూటర్లు ముందుగా అనుకున్న రేట్లకు ఒప్పుకోకపోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు. సమ్మర్ సీజన్ అన్నది మరో ఎత్తు. ఏప్రియల్ మొదటి వారం నుంచి జూన్ మొదటి వారం వరకు టాలీవుడ్ కు సమ్మర్ సీజన్. ఈ రెండు నెలల్లో ఎంత పోయినా పోవడమే అవుతుంది.
మొత్తం మీద కరోనా కనుక మార్చితో వదిలేస్తే ఓకె. లేదూ ఏప్రియల్ లో కొనసాగితే మాత్రం, చాలా కష్టం. దాదాపు ప్రతి రంగానికి..ప్రతి వ్యక్తికి. అలాగే టాలీవుడ్ కు, సినిమా మీద ఆధారపడిన ప్రతి వాళ్లకు కూడా.