సాధారణంగా ఫ్లాప్ వస్తే మార్కెట్ తగ్గిపోతుంది. తదుపరి సినిమాకు ఎమౌంట్స్ అన్నీ పడిపోతాయి. కానీ శాటిలైట్ రైట్స్ విషయానికొచ్చేసరికి ఈ ఫార్ములా పనిచేయదు. మార్కెట్ తో సంబంధం లేకుండా ఈ రేటు పెరిగిపోతుంది. దీని దారి దీనిదే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ హీరో శర్వానంద్.
ఈ హీరో నటించిన పడి పడి లేచే మనసు సినిమా డిజాస్టర్ అయింది. రిలీజైన మొదటిరోజు, మొదటి ఆటకే ప్రేక్షకులు చేతులెత్తేశారు. యావరేజ్ గా కూడా ఆడే సినిమా కాదని తేల్చేశారు. ఇలాంటి డిజాస్టర్ తర్వాత శర్వా నుంచి మరో సినిమా వస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ఇంకా పేరు కూడా పెట్టకముందే, మార్కెట్ పడిపోయింది.
శర్వా-సుధీర్ వర్మ సినిమాను తీసుకునేందుకు బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కానీ శాటిలైట్ సెగ్మెంట్ లో మాత్రం ఈ సినిమా దుమ్ముదులిపింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ భారీ మొత్తానికి దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం డీల్ 8 కోట్ల రూపాయల వద్ద లాక్ అయినట్టు తెలుస్తోంది.
శర్వా సినిమా శాటిలైట్ కు 8 కోట్లు అంటే చాలా ఎక్కువ. మరి ఏ ధైర్యంతో ఆ ఛానెల్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుందో వాళ్లకే తెలియాలి. ఒక షెడ్యూల్ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.