Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మిస్టర్‌ మజ్ను

రివ్యూ: మిస్టర్‌ మజ్ను
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
తారాగణం: అఖిల్‌ అక్కినేని, నిధి అగర్వాల్‌, ప్రియదర్శి, హైపర్‌ ఆది, రావు రమేష్‌, నాగబాబు, సుబ్బరాజు, జయప్రకాష్‌, విద్యుల్లేఖ, సితార, పవిత్ర లోకేష్‌, సత్యకృష్ణన్‌ తదితరులు
సంగీతం: తమన్‌
కూర్పు: నవీన్‌ నూలి
ఛాయాగ్రహణం: జార్జ్‌ సి. విలియమ్స్‌
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
విడుదల తేదీ: జనవరి 25, 2019

''నాకు రాముడిలాంటి అబ్బాయి కావాలి'' అంటుందా అమ్మాయి. కానీ కృష్ణుడిలాంటి అబ్బాయికి మనసిచ్చేస్తుంది. అతనితో ఆమె అందమైన జీవితాన్ని ఊహించేసుకుంటే, అతనేమో ఆమె ప్రేమని 'ప్లాస్టిక్‌ బ్యాగ్‌తో ముఖాన్ని కప్పేసినట్టు' ఫీలవుతాడు. ఒక్కడికే ముద్దయినా, మనసయినా ఇచ్చేదనే తత్వం ఆమెది. అందమైన అమ్మాయి ఎక్కడ కనిపించినా చలించే గుణం అతనిది. భిన్న ధృవాలు ఆకర్షితమవుతాయనేది సైన్సు. ఆ సైన్సుతో ఈ ఇద్దరి నడుమ జరిగే కెమిస్ట్రీనే మిస్టర్‌ మజ్ను.

సాధారణంగా చాలా కథలు కొత్తగా వుండవు. అందులోను ప్రేమకథల్లో కొత్తదనం అస్సలుండదు. ఎందుకంటే ఎప్పుడయినా ఇద్దరు ప్రేమికులు ప్రేమలో పడడం, పరిస్థితుల కారణంగా విడిపోవడం, మళ్లీ తిరిగి ఒక్కటవ్వడం... ఇంతకుమించి లవ్‌స్టోరీలుండవు. ఆ పరిస్థితులు ఎక్స్‌ట్రీమ్‌గా చూపిస్తారు కొందరు. రొటీన్‌ పరిస్థితులే కల్పించి చెప్పే విధానంతో ఆకట్టుకుంటారు ఇంకొందరు. దర్శకుడు వెంకీ అట్లూరి తీసిన మొదటి చిత్రం 'తొలిప్రేమ'లో కొత్త కథేమీ లేదు. ఆనాటి 'తొలిప్రేమ' అంతటి గొప్ప సినిమా అయితే ఖచ్చితంగా కాదు.

కానీ మామూలు కథనే మెప్పించేలా చెప్పగలిగాడు, మార్కులు కొట్టేసాడు. 'మిస్టర్‌ మజ్ను'లో కూడా వెంకీ అదే బాట ఎంచుకున్నాడు. కృష్ణుడిలాంటి హీరో పరిచయం అవుతాడు. రాముడు కావాలనే అమ్మాయిని చూపెడతారు. ఈ ఇద్దరూ ప్రేమలో పడితే అది ఎటు వెళుతుందో, ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, ఏం చేస్తే కలుస్తారో... అన్నీ ఊహించేసుకోవచ్చు. 'ఎయిర్‌పోర్ట్‌ ఎండింగ్‌'తో సహా వెంకీ అట్లూరి ప్రేమకథకి సంబంధించిన అన్ని రెగ్యులర్‌ బాక్సులనీ టిక్‌ చేసుకుంటూ పోయాడు. కాకపోతే అన్నీ కాకపోయినా కొన్ని క్లిక్‌ అయ్యేట్టు చూసుకున్నాడు.

'చిక్‌ మ్యాగ్నట్‌' లాంటి హీరో క్యారెక్టర్‌ని పరిచయం చేసిన విధానం, ఆ తర్వాత హీరోయిన్‌తో అతడి పరిచయం, కాన్ట్‌ బట్‌ పొజిషన్‌లో ఇద్దరూ ఒకే చోట వుండాల్సి రావడం, ఈ ప్రాసెస్‌లో అతనిలో పైన ప్లేబాయ్‌ని దాటి లోపలి జెంటిల్మన్‌ని చూడడం, ఆమె ఇష్టంగా ప్రేమించడం, అతడు ఇబ్బంది పడడం, ఆమె వెళ్లిపోవడం, తర్వాత అతను తెలుసుకోవడం, అతను కావాలనడం, ఆమె కాదనడం, చివరకు ఎయిర్‌పోర్టులో కలుసుకోవడం... మిస్టర్‌ మజ్ను కథ సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా ఇంతే.

దీనిని కేవలం ఇద్దరు వ్యక్తుల సంఘర్షణగా పరిమితం చేయకపోవడం, కుటుంబాలని ఇన్‌వాల్వ్‌ చేసి తద్వారా ఎమోషన్‌ పండించడం ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడు వెంకీ స్కోర్‌ చేసిన బెస్ట్‌ గోల్‌. రావు రమేష్‌, అతని కొడుకుతో అఖిల్‌ ఈక్వేషన్‌ని ఎస్టాబ్లిష్‌ చేసిన విధానం, దానికి ఇచ్చిన ఫినిషింగ్‌ టూ గుడ్‌. దీనిని ఏదో నామ్‌ కే వాస్తే ఎమోషన్‌ లేదా హీరో క్యారెక్టర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లా కాకుండా, అతడి పైన కవర్‌ని దాటి లోని క్యారెక్టర్‌ని చూడడానికి హీరోయిన్‌కి ఒక ఆపర్చునిటీగా మలచడంతో సదరు ఫ్యామిలీ యాంగిల్‌ ఇంకా బాగా హెల్ప్‌ అయింది. తర్వాత బ్రేకప్‌లోను, ప్యాచప్‌లోను ఫ్యామిలీని ఇన్‌వాల్వ్‌ చేసిన తీరు మెప్పిస్తుంది.

సింపుల్‌ లవ్‌స్టోరీకి స్ట్రాంగ్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌ జోడించడంలో వెంకీకి త్రివిక్రమ్‌ స్ఫూర్తి అనిపిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ సీమ్‌లెస్‌గా, ఎక్కడా చిన్న జర్క్‌ కూడా లేకుండా సాగిపోతుంది. యాక్షన్‌ సీన్‌ కూడా ఫ్లోలో కలిసిపోయి... 'మజ్ను'తో అమ్మాయితో పాటు చూసేవాళ్లు కూడా లవ్‌లో పడేంత స్ట్రయికింగ్‌గా వుంటుంది. ఆమె చూపించే అతి ప్రేమతో తనకి ఇబ్బంది ఏమిటో విక్కీ (అఖిల్‌) ఎంత కన్విన్సింగ్‌గా చెబుతాడో, తన ఇష్టాన్ని ఇబ్బందిగా చూసిన అతడిని వదిలి ఆమె వెళ్లిపోయేప్పుడు కూడా తన ప్రేమని అంతే స్ట్రాంగ్‌గా ముద్రించి పోతుంది.

ఏ లవ్‌స్టోరీకి అయినా ప్రేమలో పడడం, విడిపోవడం వరకు ఈజీ. 'బ్రేక్‌' అయిన తర్వాత 'కలపడమే' ఇబ్బంది. అందుకే ఈ పార్ట్‌లో చాలా లవ్‌స్టోరీలు స్ట్రగుల్‌ అవుతుంటాయి. సాఫీగా సాగిపోయిన ఫస్ట్‌ హాఫ్‌ని మ్యాచ్‌ చేయడంలో ఫెయిలవుతుంటాయి. అక్కడ లేని జర్కులు ఎన్నో వచ్చి పడుతుంటాయి. వేరే కథలయితే అటు, ఇటు తిప్పి ఏదో చేయవచ్చు కానీ ప్రేమకథల్ని అక్కడే వుంచి, అవే పాత్రలతో, 'తెలిసిన' మజిలీకి చేర్చాలి. మిస్టర్‌ మజ్ను కూడా ద్వితియార్ధంలో ఇబ్బంది పడ్డాడు. ఆ రొటీన్‌ సంఘర్షణ తాలూకు ఇంపాక్ట్‌ని తగ్గించడానికి దర్శకుడు వెంకీ సపోర్ట్‌ కోసం చాలా క్యారెక్టర్లని ఇంట్రడ్యూస్‌ చేస్తాడు.

లండన్‌లో పైరేటెడ్‌ సినిమాలు మార్కెట్‌ చేసే హైపర్‌ ఆది, ఇంకా మాటలు రాని చంటి పిల్లాడి ఫీలింగ్స్‌ని చెప్పే యానిమేటెడ్‌ క్యారెక్టర్‌, చూడ్డానికి సింహంలా వున్నా ఇట్టే బ్రేక్‌ డౌన్‌ అయ్యే సుబ్బరాజు... ఇలా ప్యాడింగ్‌ దండిగా పెట్టుకున్నాడు. కానీ కామెడీని దాటి పాయింట్‌కి వచ్చినపుడు కాంటెంట్‌లో సరిపడా మ్యాటర్‌ లేదు. హీరో ఐడెంటిటీని దాచి పెట్టి 'గీత గోవిందం' తరహా టెన్షన్‌ కోసం ట్రై చేసారు కానీ అదంతగా వర్కవుట్‌ అవలేదు. సన్నివేశ పరంగా స్టఫ్‌ లేని సమయంలో వెంకీ తన సంభాషణలని కవచంగా వాడుకున్నాడు.

పతాక సన్నివేశం ఎయిర్‌పోర్ట్‌కి షిఫ్ట్‌ అయి రొటీన్‌గా ముగిసినా కానీ అది మరీ బోరింగ్‌గా అయిపోకుండా క్యారెక్టరయిజేషన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఎండ్‌ చేయడం... 'ఏఎన్నార్‌ లివ్స్‌ ఆన్‌' అంటూ కొసమెరుపు ఆకట్టుకుంటాయి. అఖిల్‌కి 'హలో'తో లవ్‌స్టోరీస్‌కి వార్మప్‌ అయి వున్నాడు. ఇక్కడ తనలోని నటుడికి కావాల్సిన పిచ్‌ దొరకడంతో ఫుల్‌గా వాడేసుకున్నాడు. అఖిల్‌ పక్కన ఎస్టాబ్లిష్డ్‌ నటి వుంటే 'ముదురు' అనిపించే ప్రమాదం వుందని 'లేతగా' వున్న నిధిని తీసుకున్నట్టున్నారు.

కానీ ఈ పాత్రని పండించడానికి అనుభవం అవసరం. లేదా కనీసం అభినయం తెలిసిన నటి అయినా కీలకం. పలు సందర్భాల్లో నిధి తేలిపోయింది. సపోర్టింగ్‌ యాక్టర్స్‌ అంతా తమ వంతు చేయాల్సింది చేసారు. ప్రేమకథలకి కీలకమైన మ్యూజిక్‌, కెమెరా కూడా చక్కగా అమిరాయి. తమన్‌ 'తొలిప్రేమ' స్థాయి మ్యూజిక్‌ ఇవ్వకపోయినా మరో మెప్పించే సౌండ్‌ట్రాక్‌ ఇచ్చాడు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగా చేసాడు. సినిమాటోగ్రాఫర్‌ ప్రేమకథకి కావాల్సిన రంగుల్ని, హంగుల్ని జోడించాడు.

అంతవరకు వద్దనుకున్న అమ్మాయి పట్ల హీరో సడన్‌గా ఆకర్షితుడు కావడం, అంతవరకు సఫొకేటింగ్‌గా అనిపించిన ప్రేమ కోసం ఒక్కసారిగా పరితపించడానికి తగిన రీజనింగ్‌ చూపించలేదు. ఈ రియలైజేషన్‌ అంతా ఒక పాటలో జరిగిపోవడం ఎస్కేపిజంలా అనిపిస్తుంది. మిగిలిన విషయాలని ఓవర్‌ లుక్‌ చేసినా కానీ ఇలాంటి కీలకమైన సన్నివేశాలని కేవలం 'హార్ట్‌ బ్రేక్‌ - బ్రేకప్‌' లాంటి 'మాటల'తో ఒప్పించాలని చూడడం తగదు. ఇక్కడ ఏర్పడ్డ డిస్‌కనక్ట్‌ని మళ్లీ ట్రాక్‌ మీదకి తెచ్చేంత స్ట్రాంగ్‌ కాంటెంట్‌ లేకపోవడంతో దర్శకుడు అడిషినల్‌ క్యారెక్టర్స్‌పై డిపెండ్‌ అవ్వాల్సి వచ్చింది.

ఎవరినైనా ఇట్టే కన్విన్స్‌ చేసే హీరోకి తన ప్రేమని ఆమెకి బలంగా చెప్పే సందర్భాన్ని కూడా క్రియేట్‌ చేయలేదు. ఫస్ట్‌ హాఫ్‌లో మనసులు గెలిచే మజ్ను సెకండ్‌ హాఫ్‌కి వచ్చే సరికి పాస్‌ మార్క్స్‌ కోసం బాగా కష్టపడ్డాడు. సెకండ్‌ హాఫ్‌పై కాస్త శ్రద్ధ పెట్టినట్టయితే మజ్ను కేవలం పైన మేకప్‌తో ఆకట్టుకోవడడమే కాకుండా మనసులని గెలిచేసి వుండేవాడు.

బాటమ్‌ లైన్‌: రొటీన్‌ మన్మథుడే!
- గణేష్‌ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?