ఇది వరకూ తమ తనయులను కేబినెట్ లో మంత్రులుగా పెట్టుకున్న ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఎమ్మెల్యే కాకపోయినా తన తనయుడిని మంత్రిని చేశారు. కనీసం ఒక్కసారి ఎమ్మెల్యేగా నెగ్గిన అనుభవం కూడా లేని లోకేష్ ను చంద్రబాబు నాయుడు మంత్రిని చేసుకున్నారు. మంత్రి అయిన అనంతరం ఎన్నికలకు వెళ్లి లోకేష్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు!
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తన తనయుడిని మంత్రిని చేసుకుని ముచ్చట తీర్చుకున్నారు. ఇప్పుడేమో లోకేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడనే ఖ్యాతిని పొందారు. ఇక మహారాష్ట్రలో ఎమ్మెల్యేగా నెగ్గిన కొడుకును మంత్రిని చేసుకున్నాడు అక్కడి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఇక కేసీర్ కేబినెట్లో ఆయన తనయుడు కేటీఆర్ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. గత ఐదేళ్లూ ఆయన ఆ హోదాలో కొనసాగారు, ఇప్పుడూ సాగుతున్నారు.
అదలా ఉంటే.. ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత ఎమ్మెల్సీ అవుతున్నారు. ఆమె స్థానిక ఎన్నికల కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె విజయం దాదాపు లాంఛనమే. ఇలాంటి నేపథ్యంలో కవిత కేవలం ఎమ్మెల్సీగా మిగలకపోవచ్చునేమో! ఆమె మంత్రి పదవిని తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెను కేసీఆర్ కేబినెట్లోకి చేర్చుకోవచ్చని వార్తలు వస్తున్నాయి.
ఒకవైపు కొడుకు మంత్రిగా ఉన్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు కూతురును కూడా కేబినెట్లోకి తీసుకుని కేసీఆర్ కొత్త రికార్డును స్థాపిస్తారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. తన సంతానంలో ఇద్దరిని కేబినెట్లో కలిగిన సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. మరోవైపు ఆయన మేనల్లుడు కూడా కేబినెట్లో ఉన్న సంగతీ తెలిసిందే.