అగ్నిపథ్ విషయంలో మోదీ ముందు ఆప్షన్ లేదు. ఈ రోజు కాకపోతే రేపు అయినా సైనిక దళాలపైన ఖర్చు తగ్గించాల్సిందే. పార్ట్‌టైం సైనికుల్ని తీసుకోవడం న్యాయమా అని మనం ఎమోషనల్‌గా ఫీలవుతున్నాం కానీ, ఎమోషన్స్‌తో ప్రభుత్వాలు నడపలేరు. దానికి డబ్బు కావాలి.
కాలంతో పాటు యుద్ధమూ మారింది. రష్యాలాంటి తెలివైన దేశం కూడా టెక్నాలజి పవర్ గుర్తించకుండా, పెద్ద సైన్యం, ట్యాంకులతో బయలుదేరింది. ఉక్రెయిన్‌ని పదిరోజుల్లో చీమని నలిపినట్టు నలిపేస్తాను అనుకుంది. ఉక్రెయిన్ చీమే కానీ, టెక్నాలజీ తెలిసిన చీమ, మూడు నెలలు దాటినా చీమ దారికి రాలేదు. పైగా అపారనష్టం చేసింది. డ్రోన్ల సాయంతో ట్యాంకుల్ని పేల్చేసింది. డిజిటల్ టెక్నాలజితో రష్యాని ముప్పుతిప్పలు పెడుతోంది.
వాస్తవానికి ప్రపంచమంతా కళ్లతో చూస్తున్న మొదటి యుద్ధం ఇది. గతంలో జరిగిన యుద్ధాల్లో ఇంత కమ్యూనికేషన్స్ లేవు. కువైట్ యుద్ధంలో కూడా మీడియా కవర్ చేసినవే వార్తలు. ఈ యుద్ధంలో ఎవరికి వాళ్లు వీడియోలు తీసి బయట ప్రపంచానికి చూపిస్తున్నారు. ఉక్రెయిన్ సైన్యం రష్యాని ఏ స్థాయిలో ఎదిరిస్తోందో తెలుస్తోంది.
ఇపుడు సైన్యానికి కావాల్సింది మానవ బలం కాదు, టెక్నాలజి బలం. అధునాతన ఆయుధాల మీద ఖర్చు పెట్టాల్సిన సమయం. అందుకని అనేక దేశాల్లో వచ్చినట్టు ఇక్కడా సైన్యం మీద ఖర్చు తగ్గించే ఆలోచన వచ్చింది. ఇది అమానవీయమే. కానీ వేరే దారి లేదు. బ్యాంకుల్ని కంప్యూటరీకరణ చేసినపుడు చాలా సంఘాలు సమ్మె చేసాయి. ఈ రోజు కంప్యూటర్ లేని బ్యాంకుని వూహించలేం.
అన్ని ప్రభుత్వ సంస్థల్లో మాన్ పవర్ తగ్గించినట్టే సైన్యంలో కూడా జరుగుతుంది. ఒకవేళ తాత్కాలికంగా ఇది ఆగినా, భవిష్యత్తులో ఆగదు.
టెక్నాలజి రూల్ చేస్తున్నపుడు మనుషులకి విలువుండదు. దీనికి మోదీని నిందించినా ప్రయోజనం లేదు. ఆయన ప్లేస్‌లో ఎవరున్నా రేపు జరగబోయేది ఇదే.
మనమైనా ఇల్లు కట్టుకుంటున్నపుడు యంత్రాలను వాడుతున్నాం కానీ, అయ్యో పాపం అని కార్మికులని పిలుస్తున్నామా? ప్రభుత్వమైనా అంతే.
అయితే ఇంత పెద్ద దేశం, పేద దేశంలో అన్ని పనులూ యంత్రాలే చేస్తే, మనుషులు ఎలా బతకాలి?
జీఆర్ మహర్షి