ఇద్దరూ ఐటీ మంత్రులే. ఇద్దరూ యువకులే. మరి ఎవరు పనితీరు ఏంటి అన్నది చూస్తే తానే బెటర్ అంటున్నారు గుడివాడ అమరనాధ్. ఆయన జగన్ మలి విడత క్యాబినేట్ లో ఐటీ పరిశ్రమలు, వాణిజ్య పనులు, మౌలిక సదుపాయాలు వంటి కీలకమైన అయిదు శాఖలకు అమాత్యుడు అయిపోయారు.
విభజన తరువాత ఇన్నేసి శాఖలు అందునా ప్రాముఖ్యం కలిగిన శాఖలు దక్కినది నాడు నారా లోకేష్ కి అయితే నేడు గుడివాడకే ఆ భాగ్యం దక్కింది. లోకేష్ అంటే చంద్రబాబు పుత్రరత్నం కాబట్టి అన్నేసి శాఖలు ఇచ్చారు అనుకున్నా గుడివాడకు ఆ లక్ తగడం అంటే నిజంగా గ్రేటే. జగన్ కి అత్యంత సన్నిహితుడు కాబట్టే ఈ గౌరవం అనేవాళ్ళూ ఉన్నారు. ఇలా శాఖల విషయంలో లోకేష్ తో పోలిక పెట్టుకున్న గుడివాడ ఇపుడు ఐటీ మంత్రిగానూ దూసుకుపోతున్నారు.
తాము ప్రచారం చేసుకోవడం లేదు కానీ టీడీపీ ఏలుబడిలో కంటే కూడా ఎక్కువ పెట్టుబడులే తెస్తున్నామని ఆయన చెప్పుకున్నారు. దావోస్ టూర్ కి మూడేళ్ళ తరువాత వెళ్ళాం, అయినా లక్షా పాతిక వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అంటున్నారు. విశాఖని ఐటీ రాజధానిగా చేసే విషయంలో కూడా నాడు వైఎస్సార్ తరువాత అంతలా చొరవ చూపిస్తోంది జగన్ ఏలుబడిలోనే అని చెప్పారు.
దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ విశాఖ రాక తమ హయాంలోనే జరిగింది అని గుర్తు చేసుకోవాలని అన్నారు. రహేజా సంస్థ కూడా వస్తోంది. మరిన్ని ఐటీ కంపెనీలు విశాఖకు రావాలని చూస్తున్నాయి. ఇదంతా చాలా షార్ట్ టైమ్ లో జరుగుతున్న డెవలప్మెంట్ అని గుడివాడ అంటున్నారు.
అవును ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రెండున్నర నెలలు మాత్రమే అయింది. మరి విశాఖ దశ మారుస్తామని, ఐటీకి కేరాఫ్ చేస్తామని చెప్పడం కాదు చేసి చూపుతున్నామని అంటున్నారు. సో లోకేష్ కంటే గుడివాడ ఐటీ మంత్రిగా బెటరేనా. వైసీపీ వారైతే ఎస్ అంటున్నారు. తమ్ముళ్ళు ఏ మాత్రం అంగీకరించరు. ఇక జనాలు ఏమంటారో.