టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యే “మల్లు”తున్నాడా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. పైకి మాత్రం తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విపరీతమైన ప్రేమను ఒలకబోస్తూ …సన్నిహితులు, మీడియా వద్ద ఆఫ్ ది రికార్డు అంటూ ఆయనపై విమర్శలు చేస్తున్న సంగతి అధిష్టానం దృష్టికి వెళ్లింది.
బంగారు పట్టణంగా పేరు గాంచిన నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సదరు నాయకుడి మాటలోనూ, నడవడికలోనూ తేడా వస్తుండడాన్ని పార్టీలోని కొందరు సీనియర్లు గ్రహించి క్రమంగా దూరమవుతున్నారు.
ఇవాళ ఆ ఎమ్మెల్యే నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశానికి పలువురు పార్టీకి చెందిన పట్టణ ప్రముఖులు, నాయకులు గైర్హాజరు కావడం మరింత చర్చకు దారి తీసింది. ఈనాడు అంటే తనకు గౌరవమని, సాక్షి పత్రికను అసలు చూడను, చదవనని చెప్పడం వెనుక… ఆ ప్రజాప్రతినిధిలో వచ్చిన మార్పునకు సంకేతంగా అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.
రెండోసారి ఎమ్మెల్యేగా పదవీ భిక్ష పెట్టిన వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడని అధిష్టానం అనుమానిస్తోంది. అలా కాని పక్షంలో జగన్ సొంత పత్రిక అని తెలిసి కూడా అవాకులు చెవాకులు పేలడం, అలాగే ముఖ్యమంత్రి దుష్టచతుష్టయంగా అభివర్ణించే వాటిలో ప్రధానంగా ఈనాడుపై ప్రత్యేకంగా గౌరవాన్ని చాటడం వెనుక చంద్రబాబు దృష్టిలో పడాలనే తాపత్రయం కనిపిస్తోందనే ప్రచారానికి బలం చేకూర్చుతోంది.
సహజంగా పార్టీ మారాలనే ఆలోచన వున్న వాళ్లే, ఇలా పరోక్ష సంకేతాలు ఇస్తుంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడు తున్నారు. ఇప్పుడా నాయకుడు కూడా తెలివిగానే పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఇదిలా వుండగా సదరు ప్రజాప్రతినిధి వ్యవహార శైలి నచ్చకపోవడం వల్లే… ఇవాళ ప్లీనరీ సమావేశానికి కొందరు ప్రముఖులు డుమ్మా కొట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ సమావేశాల్ని ఘన విజయం చేయాలని అధిష్టానం గట్టి పట్టుదలతో వుంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి పలువురు ప్రముఖులు హాజరు కాకపోవడం చిన్న విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ప్రస్తుతం కడప జిల్లా వ్యాప్తంగా ఆ ఎమ్మెల్యే భవిష్యత్‌పై మాత్రం విస్తృతమైన చర్చ జరుగుతోంది. అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి వుంది.