దోమ పురాణం

దోమ చాలా చిన్న ప్రాణి. కానీ మ‌నం దాన్ని జ‌యించ‌లేం. ఎందుకంటే దాని శ‌క్తి మ‌న‌కంటే చాలా పెద్ద‌ది. అది కుట్ట‌కుండా మ‌న చావు మ‌నం చావాల్సిందే. అంతే త‌ప్ప దాన్ని చంప‌లేం. ఒక‌వేళ…

దోమ చాలా చిన్న ప్రాణి. కానీ మ‌నం దాన్ని జ‌యించ‌లేం. ఎందుకంటే దాని శ‌క్తి మ‌న‌కంటే చాలా పెద్ద‌ది. అది కుట్ట‌కుండా మ‌న చావు మ‌నం చావాల్సిందే. అంతే త‌ప్ప దాన్ని చంప‌లేం. ఒక‌వేళ చంపితే దోమ‌ల పేరుతో జ‌రిగే ల‌క్ష‌ల కోట్ల వ్యాపారం మునిగిపోతుంది.

ఒక‌ప్పుడు దోమ‌ల నుంచి ర‌క్షించుకోడానికి దోమ తెర‌లు త‌ప్ప వేరే మార్గం లేదు. అవి కూడా రెడీమేడ్ దొరికేవి కావు. బ‌ట్ట కొని టైల‌ర్ ద‌గ్గ‌ర కుట్టించుకోవాలి. త‌ర్వాత నైలాన్ దోమ‌తెర‌లు వ‌చ్చాయి. దోమ‌తెర‌ల్ని క‌ట్ట‌డం ఒక ఆర్ట్‌. మంచానికి న‌లు వైపులా బ్యాలెన్స్‌డ్‌గా క‌ట్టాలి. ప‌రుపు మీదికి దూరే స‌మ‌యానికి , మ‌న‌తో పాటు ఒక దోమ‌ల మంద కూడా దూరి కంటికి క‌న‌ప‌డ‌కుండా న‌క్కుతుంది. 

మ‌నం మూల‌ల‌న్నీ వెతికి హ‌మ్మ‌య్య అని లైట్లు ఆర్పి నిద్ర‌పోగానే జుమ్మంది నాదం అని ఆర్కెస్ట్రాతో బ‌య‌ల్దేరుతాయి. ఒక్కోసారి చెవి ద‌గ్గ‌రికే వ‌చ్చి పాట వినిపిస్తాయి. ఆ రాగానికి చ‌ప్ప‌ట్లు కొడ‌తాం. జ్ఞానం లేని దోమ‌లు అది ప్ర‌శంస అనుకుని చ‌చ్చిపోతాయి. మ‌న ర‌క్తం మ‌న అర‌చేతుల‌కే అంటుతుంది. దోమ‌ల వ‌ల్ల నేర్చుకోవాల్సిన నీతి ఏమంటే అన్ని చ‌ప్ప‌ట్లు మ‌న మంచి కోర‌వు.

ఎన్ని అవ‌స్థ‌లు ప‌డినా ఒక్క దోమ చాలు, మ‌న క‌ల‌ల్ని నాశ‌నం చేయ‌డానికి. దోమ తెర‌ల బాధ‌లు ప‌డుతూ వుంటే ఎవ‌రో పుణ్యాత్ముడు టార్టాయిస్ కాయిల్స్ క‌నిపెట్టాడు. అది వెలిగిస్తే రాత్రంతా ఘాటు. దోమ‌ల వ‌ల్ల కొత్త జంట “ఎంత ఘాటు రాత్రియో” అని  పాడుకోవాల్సి వ‌చ్చేది. త‌ర్వాత ఓడోమాస్ వ‌చ్చింది. ఒళ్లంతా పూసుకుని తెల్లారి స్నానం చేయాలి. లేదంటే కంపు. మ‌నం ఎపుడైతే కొన‌డం స్టార్ట్ చేస్తామో వ్యాపార‌స్తులు ఊరుకోరు. అనేక ప్ర‌యోగాలు చేస్తారు. చివ‌రికి కాయిల్స్ ద‌గ్గ‌ర సెటిల్ అయ్యాం. ఇంత‌కు ముందు బిస్కెట్ల సైజులో బిల్ల‌లు పెట్టేవాళ్లం.

ఇప్పుడు పూర్వ‌కాలం దీప‌పు బుడ్డీల సైజులో కొంచెం చిన్న‌వి వ‌చ్చేశాయి. దాంట్లో మ‌ళ్లీ ప్లేవ‌ర్లు, ఎక్స్‌ట్రా ప‌వ‌ర్లు చాలా జాతులుంటాయి. కాల్గెట్ టూత్‌పేస్ట్‌కి ర‌క‌ర‌కాల గుణ‌గ‌ణాలు యాడ్ చేసి అదే పేస్ట్‌నే గ‌త 60 సంవ‌త్స‌రాలుగా అమ్ముతున్నారు (వాస్త‌వానికి ఆ కంపెనీ వ‌య‌సు 216 ఏళ్లు. అది అమెరికా కంపెనీ అని మ‌న‌కే గుర్తు లేనంత‌గా ఇళ్ల‌లో క‌లిసిపోయింది). అదే విధంగా దోమ‌ల కాయిల్స్ కూడా అమ్ముతున్నారు. దీని వ‌ల్ల దోమ‌లు కుట్ట‌డం త‌గ్గింది కానీ, అవి ఎక్క‌డికీ పోలేదు. మ‌న మ‌ధ్యే స‌హ‌జీవ‌నం చేస్తున్నాయి.

దోమ‌లు లేక‌పోతే ఫాగింగ్ పేరుతో మ‌న మున్సిపాల్టీల‌కి తిన‌డానికి డ‌బ్బులుండేవి కాదు. దోమ‌లు లేక‌పోతే మ‌లేరియా, డెంగీ, గ‌న్య‌, టైఫాయిడ్ ఉండేవి కాదు. జ్వ‌రాలు లేక‌పోతే కోట్ల రూపాయ‌ల ఫార్మా కంపెనీలు ఏం కావాలి? ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్లు వీళ్లంతా ఎవ‌రి కోసం?

ఏదైనా అణు యుద్ధం జ‌రిగి మ‌నిషి అంత‌రించిపోయినా కూడా దోమ అంత‌రించిపోదు. నూత‌న మాన‌వుడి ఆవిష్క‌ర‌ణ కోసం అది ఎదురు చూస్తూనే వుంటుంది. దోమ నుంచి ఆధునిక వ్యాపార‌వేత్త‌లు నేర్చుకున్న సిద్ధాంతం ఏమంటే సాటి మ‌నిషి ర‌క్తం తాగ‌డం.

ప్ర‌పంచ వ్యాపార పునాదుల‌న్నీ దోమ సూత్రం మీద ఆధార‌ప‌డే నిలిచి వున్నాయి.

జీఆర్ మ‌హ‌ర్షి