బాల్ ఠాక్రే పేరు వెనుక‌!

శివ‌సేన జాతీయ వార్త‌ల్లో వుంది. ఉద్ధ‌వ్ ఠాక్రే పార్టీని కాపాడుకోలేని స్థితిలో వున్నాడు. బాల్ ఠాక్రే బ‌తికి వుంటే క‌థ వేరే విధంగా వుండేది. ఆయ‌న మీద కూడా తిరుగుబాట్లు జ‌రిగాయి కానీ, పార్టీలో…

శివ‌సేన జాతీయ వార్త‌ల్లో వుంది. ఉద్ధ‌వ్ ఠాక్రే పార్టీని కాపాడుకోలేని స్థితిలో వున్నాడు. బాల్ ఠాక్రే బ‌తికి వుంటే క‌థ వేరే విధంగా వుండేది. ఆయ‌న మీద కూడా తిరుగుబాట్లు జ‌రిగాయి కానీ, పార్టీలో ఈ స్థాయి ముస‌లం ఎప్పుడూ లేదు.

మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో, ముఖ్యంగా ముంబ‌య్‌లో 60 ఏళ్లుగా వినిపిస్తున్న పేరు ఠాక్రే. అంద‌రూ అది మ‌రాఠీ పేరు అనుకుంటారు. అయితే అది ఒక ఇంగ్లీష్ ర‌చ‌యిత పేరు.

బాల్ ఠాక్రే తండ్రి కేశ‌వ్ ఇంటి పేరు ప‌న్వెల్క‌ర్‌. అయితే స్వ‌త‌హాగా ర‌చ‌యిత‌, పాత్రికేయుడు, కార్టూనిస్ట్ అయిన కేశ‌వ్ సాహిత్య ప్రియుడు. ఇంగ్లీష్ ర‌చ‌యిత విలియ‌మ్ మేక్‌పీస్ ఠాక్రేకి వీరాభిమాని. ఆయ‌న మీద అభిమానంతో ఇంటి పేరు మార్చుకున్నాడు. 1950లో వ‌చ్చిన సంయుక్త మ‌హారాష్ట్ర ఉద్య‌మంలో కేశ‌వ్ పాల్గొన్నాడు. మ‌హారాష్ట్ర మ‌రాఠీ మాట్లాడే వాళ్లదే అని వాళ్ల నినాదం.

బాల్‌ఠాక్రే కూడా కార్టూనిస్ట్‌గానే ప్రారంభ‌మ‌య్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఆయ‌న కార్టూన్లు వ‌చ్చేవి. ప‌ని చేస్తున్న ఫ్రీ ప్రెస్ జ‌ర్న‌ల్‌తో గొడ‌వ‌లు వ‌చ్చి సొంతంగా ప‌త్రిక పెట్టుకుంటే రెండు నెల‌లు కూడా న‌డ‌వ‌లేదు.

1960లో “మార్మిక్” అనే కార్టూన్ వీక్లీ పెట్టాడు. మ‌రాఠీల స‌మ‌స్య‌ల్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించేవాడు. 1966లో శివ‌సేన పుట్టుక‌కి వీక్లీ ఆఫీసే జ‌న్మ‌స్థానం. 1970లో వ‌చ్చిన స్థానిక ఎన్నిక‌ల్లో శివ‌సేన ఓడిపోయి బొంబాయికే ప‌రిమిత‌మైంది. 1975లో ఎమ‌ర్జెన్సీని బ‌ల‌ప‌రిచి, అరెస్ట్ నుంచి త‌ప్పించుకున్నాడు బాల్‌ఠాక్రే.

బొంబాయి ట్రేడ్ యూనియన్ ఉద్య‌మాల్లో క‌మ్యూనిస్టుల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసిన శివ‌సేన 1980 నాటికి కాంగ్రెస్‌కి ప‌క్క‌లో బ‌ల్లెంలా మారింది. 1989లో శివ‌సేన సొంత ప‌త్రిక “సామ్నా” ప్రారంభ‌మైంది. గిట్ట‌ని వాళ్ల‌ని ఉతికి ఆరేసేవాడు ఠాక్రే. 1991లో ఠాక్రే ప్ర‌ధాన అనుచ‌రుడు చ‌గ‌న్ భుజ్ బ‌ల్ పార్టీ నుంచి వెళ్లిపోవ‌డం ఠాక్రేకి మొద‌టి షాక్‌. 1976లో డాక్ట‌ర్ హేమ‌చంద్ర గుప్తే (బొంబాయ్ మేయ‌ర్‌) పార్టీని విడిచిపెట్టినా ఠాక్రే పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు.

1992లో బొంబాయ్ అల్ల‌ర్ల‌లో శివ‌సేన పూర్తి హిందుత్వ‌గా మారింది. 1995లో బీజేపీ పొత్తుతో మ‌హారాష్ట్ర‌లో అధికారంలోకి వ‌చ్చింది. వాస్త‌వానికి రిమోట్ కంట్రోల్ సీఎం బాల్ ఠాక్రేనే. ఆ విష‌యం ఆయ‌న చెప్పుకున్నారు.

బాలీవుడ్ ఆయ‌న ఆశీస్సుల కోసం క్యూలో వుండేది. ఆయ‌న‌కి వివాదాస్ప‌దంగా అనిపించిన సినిమాలు బొంబాయిలో ఆడేవి కావు. బొంబాయి (మ‌ణిర‌త్నం) సినిమా ఆడుతున్న థియేట‌ర్ల‌పై దాడి శివ‌సైనికుల ప‌నే. మ‌తం పేరుతో ఓట్లు అడుగుతున్నాడ‌ని ఆయ‌న్ని 1990 నుంచి 2005 వ‌ర‌కూ పోటీ చేయ‌కుండా ఎన్నిక‌ల క‌మిష‌న్ నిషేధించింది. ఓటు హ‌క్కు కూడా లేకుండా చేశారు.

2006లో సొంత కుటుంబం నుంచి తిరుగుబాటు. త‌మ్ముడు కొడుకు రాజ్‌ఠాక్రే మ‌హారాష్ట్ర నవ్ నిర్మాణ సేన పార్టీ పెట్టాడు. అదే స‌మ‌యంలో మాజీ సీఎం నారాయ‌ణ్ రాణే కూడా వెళ్లిపోయాడు. 2006 నుంచి శివ‌సైనికులు ముంబ‌య్‌లో మోర‌ల్ పోలీసులుగా మారారు. వాలెంటైన్స్ డేలో జంట‌ల‌కి పెళ్లి చేశారు.

హిట్ల‌ర్ దుర్మార్గుడే కానీ మంచి క‌ళాకారుడు అని పొగిడిన బాల్ ఠాక్రే 2012లో గుండెపోటుతో చ‌నిపోయాడు.

జీవితాంతం శివ‌సేన‌కి నెంబ‌ర్ 1 లీడ‌ర్‌గా ఉన్న బాల్ ఠాక్రే ఇప్పుడు లేడు. శివ‌సేన వుంది. అయితే ఠాక్రే కుటుంబం చేతి నుంచి జారిపోయిన‌ట్టే!

జీఆర్ మ‌హ‌ర్షి