టైటిల్: చోర్ బజార్
రేటింగ్: 1.5/5
తారాగణం: ఆకాశ్ పూరి, గెహనా సిప్పి, సుబ్బరాజు, సునిల్, సంపూర్ణేష్ బాబు, అర్చన తదితరులు
కెమెరా: జగదీష్ చీకటి
ఎడిటర్: అన్వర్ అలి, ప్రభుదేవ
సంగీతం: సురేష్ బొబ్బిలి, ప్రియదర్షన్
నిర్మాత: వి.ఎస్. రాజు, అల్లూరి సురేష్ వర్మ
దర్శకత్వం: జీవన్ రెడ్డి
విడుదల తేదీ: 24 జూన్ 2022
ఆదిత్య369లోలాగ మ్యూజియం లో డైమండ్ చోరీతో సినిమా మొదలవుతుంది. అయితే ఆ టైం మెషీన్ సినిమా టైముతో ఆడుకుంటే ఈ సినిమా ప్రేక్షకుల టైం తో ఆడుకుంటుంది.
మ్యూజియంలో దొంగతనానికి గురైన డైమండ్ మళ్లీ మ్యూజియం ని ఎలా చేరింది? కథగా చెప్పుకుంటే ఇంతే. ఇంతకంటే ఎక్కువ చెప్పుకుంటే హైరానే మిగులుతుంది.
థియేటర్లో కూర్చున్న సగటు ప్రేక్షకుడికి రానున్న రెండున్నర గంటలు ఎలా గడవబోతున్నాయో అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదు. అలా అర్థం చేసుకున్న జ్ఞానులు అరగంటకి లేచి మౌనంగా వెళ్లిపోయారు. మరికొందరు మహానుభావులు ఇంటర్వెల్లో బయటకు వెళ్లి మళ్లీ వెనక్కు రాలేదు. కానీ టికెట్ కొనుక్కున్నందుకు కనీసం చివరాఖర్లోనైనా ఏదైనా సంతృప్తి పరిచే ఘట్టముంటుందేమోనని కూర్చున్న కొందరు ఆశావహ ప్రేక్షకులు, అన్నీ తెలిసినా చివరిదాకా చూడక తప్పని సినీ విశ్లేషకులు పోరాటయోధుల్లాగ ఓపికపట్టి కూర్చున్నారు.
సినిమా మొదలైన కాసేపటికి డైమండ్ మీద మూత్రవిసర్జన చేసే సీన్ వస్తుంది. ఆ డైమండ్ ని ఆ పళంగా తీసుకునే సన్నివేశం జుగుప్స కలిగిస్తుంది. ఆ వెంటనే ఎందుకో తెలీదు గ్రాఫిక్స్ లో ఒక గ్రద్ద కనిపిస్తుంది. ఈ క్రమంలో హీరో ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది.
ఆకాష్ పూరి ని గొప్పగా పరిచయం చెయ్యాలి కాబట్టి ఒక కౌబాయ్ సెటప్ లో ఈ మధ్యన గళ్లా అశోక్ నటించిన “హీరో”లోని ప్రారంభ సన్నివేశాన్ని తలపించే సన్నివేశమొస్తుంది. ఆకాష్ హిందీలో డయలాగ్స్ వినిపిస్తాడు. తెలుగు సినిమాలో అంత హిందీ ఎందుకో తెలీదు. మెహబూబా, రొమాంటిక్ ల లో ఉన్న ఈ హిందీ జాడ్యం ఇక్కడ కూడా కంటిన్యూ అయింది.
ఇక హీరోయిన్ ఇంట్రడక్షనైతే చెప్పక్కర్లేదు. అదేంటో మొబైల్ ఆన్ చేసి రౌడీల ముందు బాలయ్య డైలాగుకి లిప్ సింక్ ఇచ్చి ధమికీ ఇస్తుంది.
మోజంజాహీ మార్కెట్ బ్యాక్ గ్రౌండులో సుబ్బరాజు క్యారెక్టర్ ఎంత కృతకంగా ఉందంటే అంత కృతకంగా ఉంది. ఆ క్యారక్టర్ చుట్టూ జరిగే పిచ్చగోల అస్సలు అర్థం కాదు. దీనికి తోడు ప్రేక్షక పిచ్చుకుల మీద బ్రహ్మాస్త్రంలాగ సంపూర్ణేష్ బాబు పాత్రొకటి. పిచ్చికి పరాకాష్టలా ఉంటుందది.
ఫస్టాఫులో దొంగతనానికి గురైన డైమండ్ చుట్టూ నడపాల్సిన కథని ఇంకెక్కడో నడుపుతూ మధ్య మధ్యలో డైమండ్ ని చూపిస్తూ వెళ్తుంటుంది.
ఇక ఆ చోర్ బజారైతే సరేసరి. అక్కడ ఏవేవో అమ్ముతుంటారు. ఏదేదో జరుగుతుంటుంది. ఒక సీన్లో సంపూర్నేష్ బాబు ఏదో పొగ వేస్తే అందరూ ఫ్రీజ్ అయిపోతారు.
కథకి సంబంధం లేని సీన్లు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. అసలీ సినిమాకి పని చేసిన ఎడిటర్ పరిస్థితి ఆలోచిస్తేనే జాలేస్తుంది. అందుకేనేమో ఇద్దరు మారారు.
ఎక్కడపడితే అక్కడ ఆకాష్ హిందీ డయలాగ్స్ చెప్తుంటే చిరాకొస్తుంది తప్ప అబ్బో బాలీవుడ్ లో ట్రై చేయొచ్చని మాత్రం అనిపించదు. అలా అనిపించుకోవడానికి, తరచూ తెలుగు సినిమాలో హిందీ డయలాగ్స్ చెబితే బాలీవుడ్ పిలుస్తుందని అనుకుంటున్నాడేమో. ఎంత హైదరాబాద్ బ్యాక్ గ్రౌండ్ సినిమా అయినా అంత హిందీ ఎందుకు తమ్ముడూ..అనాలనిపిస్తుంది.
ఇక లాయర్ గా డబల్ యాక్షన్లో లక్ష్మణ్ అనే నటుడు చేసే ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. “పతితులార భ్రష్టులార…” అంటూ శ్రీశ్రీ కవితలు ఎందుకు చదువుతాడో అర్థం కాదు.
ఇక కోర్టు సీనైతే ప్రేక్షకులని వెర్రోళ్లని చేయడమన్నట్టుంది.
చోర్ బజార్ తరపున మాట్లాడానికి హీరో కోర్టులో బోనెక్కి-“గూగులే మా చోర్ బజార్ ని గుర్తించింది. మీరు గుర్తించకపోతే ఎలా సర్…” అనగానే జడ్జ్ గారు వాటేపాయింట్ అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి “నోట్ దిస్ పాయింట్ యువరానర్” అనకుండానే ఏదో నోట్ చేసుకుంటాడు.
తాము చేసే దొంగతనాల వల్ల పేదోళ్ల ఇళ్లల్లో ఎలా దీపాలు వెలుగుతున్నాయో హీరో గారు “రాఖీ” ఎన్.టి.ఆర్ రేంజులో ఎమోషనల్ గా సుదీర్ఘమైన ఏకపాత్రాభినయం చేస్తాడు. దానికి జడ్జ్ గారు కరిగిపోయి చోర్ బజార్ వాసులకి అనుకూలంగా తీర్పు చెప్తాడు. ఈ సీన్ చేసాక ఆ జడ్జ్ పాత్ర పోషించిన కాశీ విశ్వనాథ్ కచ్చితంగా కాశీకి వెళ్ళుండాలి.
ఇక “అల్లరి అల్లుడు” లో రావు గోపాల్ రావు పాత్ర స్ఫూర్తితో సునీల్ చెప్పే అర్థం పర్థం లేని సామెతలైతే వర్ణనాతీతం. మచ్చుకి ఒక సామెత- “ముసలాయన కదా అని వీపు మీద ఎక్కించుకుంటే ఎగిరెగిరి ఏడనో నూకిండంట”. ఇలాంటివి ఒక నాలుగైదున్నాయి.
అలనాటి తార అర్చనకి ఇందులో హీరో తల్లిపాత్రిచ్చి ఆమె చేత డ్యాన్సులు గట్రా చేయించారు. ఆమె ఈ వయసులో అంత యాక్టివ్ గా నటించడాన్ని మెచ్చుకోగలం కానీ ఆ పాత్ర ఏ మాత్రం మనసుకి హత్తుకోదు.
“ఢీ”లో జయప్రకాష్ రెడ్డి టైపులో డయలాగ్ లేకుండా కుర్చీకే పరిమితమయ్యే ప్రాముఖ్యం లేని పాత్రలో కంచెరపాలెం రాజు (సుబ్బారావు) కనిపిస్తాడు.
సంగీత సాహిత్యపరంగా “జడ”, “నూనూగు మీసాల..” పాటలు బాగానే ఉన్నా ఇంత కంగాళీ కథనంలో అవి కొట్టుకుపోయాయి. ఈ పాటల్ని విడిగా ఆశ్వాదించాలి తప్ప సినిమా మధ్యలో కాదనిపిస్తుంది.
కథ, కథనం, పాత్రలు అన్నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటాయి. ఒక సన్నివేశంలో హీరో కార్ టైర్స్ ని దొంగతనంగా విప్పే వీడియో వైరలవుతుంది. అంత తక్కువ సమయంలో కారు టైర్ విప్పడం చూసి ఒక పెద్ద కంపెనీ చోర్ బజార్ కి మన హీరో కోసం వెతుక్కుంటూ వచ్చి నెలకి లక్షరూపాయల జీతంతో ఉద్యోగమిస్తుంది ఒక పెద్ద కంపెనీ.
ఈ రేంజులో ఉంటుంది ఆద్యంతం.
హైదరాబాదులోని ఎర్రగడ్డలో ఒక చోర్ బజార్ ఉంది. అదే ఏరియాలో మెంటలాసుపత్రి కూడా ఉంది. అందుకేనేమో హాల్లో కూర్చుని ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకి మెంటలాసుపత్రిలో ఉండే అనుభూతిని కలిగించాడు దర్శకుడు.
బాటం లైన్: బోర్ బజార్