హీరో అఖిల్ మూడో సినిమాగా, దర్శకుడు వెంకీ అట్లూరి రెండో సినిమాగా థియేటర్లలోకి మరో రెండు రోజుల్లో రాబోతోంది మిస్టర్ మజ్ఞు. సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుని, పాజిటివ్ బజ్ తో రిలీజ్ కు రెడీ అవుతోంది.
సంక్రాంతి హడావుడి ముగియడం, రెండు డిజాస్టర్ల కారణంగా థియేటర్ల దగ్గర పరిస్థితి అంత బాగా లేకపోవడంతో, మిస్టర్ మజ్ఞును కాస్త జాగ్రత్తగా, ప్లాన్డ్ గా విడుదల చేస్తున్నారు. థియేటర్లు చాలావరకు ఈవారం ఖాళీ అయిపోతాయి. అందువల్ల మజ్ఞుకు కావాల్సినన్ని థియేటర్లు.
అయితే అలా అని ఇష్టం వచ్చినట్లు థియేటర్లు తీసుకోకుండా, ఊరిని బట్టి, సెంటర్లను బట్టి సెలక్టివ్ గా థియేటర్లు తీసుకోవడం విశేషం. వాస్తవానికి సినిమా సోలో రిలీజ్. అందువల్ల ఎడా పెడా థియేటర్లు వేసి, ఓపెనింగ్స్ తెచ్చేసుకోవాలనుకుంటారు.
కానీ మిస్టర్ మజ్ఞును కొంతకాలం థియేటర్లలో రన్ వుండేలా, స్టడీగా నడిచేలా చూడాలని, నిర్మాత బోగవిల్లి ప్రసాద్ సెలక్టివ్ థియేటర్లనే తీసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు వందల థియేటర్ల వరకు మాత్రమే మిస్టర్ మజ్ఞును విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి కావాలంటే మరో వందా రెండువందల థియేటర్లు రెడీ. ఎందుకంటే కథానాయకుడు, వినయ విధేయరామ, కేజీఎఫ్, హుషారు, పెటాకు తీసుకున్న థియేటర్లలో చాలావరకు ఈవారం ఖాళీ అవుతాయి. ఎగ్జిబిటర్లు కూడా కొత్త సినిమా వేయాలనే చూస్తారు.
కానీ నిర్మాత ఆలోచన వేరుగా వుంది. అందుకే ప్లాన్డ్ గా మజ్ఞును విడుదల చేస్తున్నారు.