జ‌గ‌న్ ఒక్క‌సారి క‌మిట్ అయితే…!

అదేదో సినిమాలో చెప్పిన‌ట్టు… జ‌గ‌న్ ఒక్క‌సారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టు అర్థం చేసుకోవాలి. జ‌గ‌న్‌ ఒక్క‌సారి క‌మిట్ అయితే ఇక ఎవ‌రి మాట విన‌రు. ఇందుకు కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు ఖ‌రారు చేయ‌డ‌మే…

అదేదో సినిమాలో చెప్పిన‌ట్టు… జ‌గ‌న్ ఒక్క‌సారి చెబితే వంద‌సార్లు చెప్పిన‌ట్టు అర్థం చేసుకోవాలి. జ‌గ‌న్‌ ఒక్క‌సారి క‌మిట్ అయితే ఇక ఎవ‌రి మాట విన‌రు. ఇందుకు కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు ఖ‌రారు చేయ‌డ‌మే నిలువెత్తు నిద‌ర్శ‌నం. జ‌గ‌న్ ప్ర‌భుత్వం జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టింది. ఇది ఎన్నిక‌ల హామీ కావ‌డంతో జ‌గ‌న్ ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రించారు.

జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై కొన్ని చోట్ల తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చిన మాట నిజ‌మే. కొన్నిచోట్ల ప్ర‌జ‌ల డిమాండ్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని స‌ర్దుబాటు చేశారు. మ‌రికొన్ని చోట్ల మాత్రం స‌మ‌స్య ప‌రిష్కారాన్ని కాలానికే వ‌దిలేశారు. నేప‌థ్యంలో ఈ ఏడాది ఉగాది నాడు కొత్త జిల్లాల నుంచి పాల‌న ప్రారంభించారు.

కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌నే డిమాండ్స్ అన్ని పార్టీల నుంచి రావ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. ఈ నేప‌థ్యంలో కాస్త ఆల‌స్యంగా కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు అభ్యంత‌రాలు వుంటే నెల‌లోపు తెలియ‌జేయాల‌ని ప్ర‌భుత్వం స‌మ‌యం ఇచ్చింది. అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని డిమాండ్ చేసిన వారిలోనే కొంద‌రు వ్య‌తిరేకించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌శాంత‌త‌కు మారుపేరుగా నిలిచే అమ‌లాపురంలో విధ్వంసానికి దారి తీసింది. ఇది కులాల కొట్లాట‌కు దారి తీసింది. ప్ర‌భుత్వం పున‌రాలోచించి, వెన‌క్కి త‌గ్గుతుందేమో అనే అనుమానాలు త‌లెత్తాయి. అయితే అలాంటి ప్ర‌చారానికి చెక్ పెడుతూ శుక్ర‌వారం జ‌గ‌న్ కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

ప్ర‌జాభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కోన‌సీమ జిల్లాను అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లాగా పేరు మారుస్తూ ప్ర‌తిపాద‌న‌ల‌కు జ‌గ‌న్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అల్ల‌రిమూక‌ల విధ్వంసానికి భ‌య‌ప‌డేది లేద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ తేల్చి చెప్పిన‌ట్టైంది.