న్యాయస్థానం ఎదుట వైసీపీ రెబల్ ఎంపీ నాటకం రక్తి కట్టలేదు. వైసీపీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయించడమే పనిగా రఘురామ పెట్టుకున్నారు. పైగా ఆయన వైసీపీ తరపునే ఎంపీగా గెలుపొందడం గమనార్హం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రఘురామ మధ్య ఎక్కడ చెడిందో తెలియదు కానీ, పూడ్చలేనంత అగాథం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీ అప్పులపై రఘురామ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టి వేసింది. తామేమీ ఆడిటర్లం కాదని, న్యాయమూర్తులమని హైకోర్టు ధర్మాసనంలోని న్యాయకోవిదులు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో పిటిషన్పై కూడా రఘురామకు చుక్కెదురు కావడం గమనార్హం. ఈ సారి చింతామణి నాటకం నిషేధం స్టే విధించాలని రఘురామ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.
వైశ్యుల మనోభావాలను కించపరిచేలా వుందంటూ చింతామణి నాటకంపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రఘురామకృష్ణంరాజు యధావిధిగా హైకోర్టును ఆశ్రయించారు. నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని రఘురామ న్యాయస్థానాన్ని కోరారు. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం అనువాద ప్రతిని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. దీంతో మరోసారి రఘురామకు ప్రతికూల నిర్ణయం హైకోర్టు నుంచి ఎదురైంది. కేవలం జగన్ ప్రభుత్వంపై ద్వేషంతో వేస్తున్న పిటిషన్లు కావడంతో రఘురామకు వ్యతిరేక తీర్పులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఆశయంతో న్యాయపోరాటం చేస్తే ప్రయోజనం వుంటుందని నెటిజన్లు హితవు చెబుతున్నారు.
ఏది ఏమైతేనేం రఘురామ నాటకాలు ఇక ఎంతో కాలం సాగవని వరుస వ్యతిరేక తీర్పులు చెప్పకనే చెబుతున్నాయంటున్నారు. కానీ కిందికోర్టులు కాకపోతే, సుప్రీంకోర్టు వరకూ వెళుతూనే వుంటానని ఇప్పటికే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.