ఏపీ రాజకీయ నేతలతో పాటు, ప్రజలంతా సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరడంతో ఈరోజు ఎలాంటి తీర్పు వస్తుందనే అంశంపై అందర్లో ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదావేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో పాటు.. వాయిదాను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ధర్మాసనం ఈరోజు విచారణ ప్రారంభించనుంది.
సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన పిటిషన్ చాలా బలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, వైద్యారోగ్య అధికారుల్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. ఓవైపు కరోనా భయం అని చెబుతూనే, మరోవైపు నామినేషన్ల సందర్భంగా గొడవలు జరిగాయని చెప్పడం ఎన్నికల కమిషన్ ద్వంద్వ వైఖరిని నిదర్శనమని దుయ్యబట్టింది.
వీటితో పాటు.. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు చేపడుతున్న చర్యల్ని కూడా ప్రభుత్వం పిటిషన్ లో వివరించింది. అన్నింటికంటే ముఖ్యంగా హైకోర్టు ఆదేశాలతో లోకల్ బాడీ ఎలక్షన్లు జరుగుతున్న నేపథ్యంలో.. కనీసం హైకోర్టుకు కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియను వాయిదావేయడం ఏంటని ప్రశ్నించింది ప్రభుత్వం.
అటు ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ వాదన మరోలా ఉంది. కరోనాపై దేశం అత్యవసర స్థితిని ప్రకటించిందని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించడం వల్ల వాయిదా నిర్ణయం తీసుకున్నానని అంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చే అవకాశం ఉందని, క్యూలైన్ల్ కూడా ఉంటాయి కాబట్టి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని భావించి వాయిదా వేసినట్టు సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
వాస్తవంగా చూసుకుంటే.. ఇప్పుడు ప్రభుత్వ వాదనతో పాటు, అటు రమేష్ కుమార్ చెబుతున్న వాదనలో కూడా నిజం ఉంది. కాబట్టి దీనిపై ఈరోజు సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాలి. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల్ని జరుపుకోవచ్చని సుప్రీం చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!