లేస్తే మనిషిని కాను అని వెనకటికి ఒకడు అన్నట్లుగా సామెత ఉంది. మరి పచ్చ పార్టీ తమ్ముళ్ళు కూడా అదే బాపతు అనుకోవాలి. లేకపోతే ముంగిట్లో ఎన్నికలు ఉన్నపుడు నోట మాట రాలేదు. పైగా వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. దాడులు చేశారు అంటూ ఎన్నికల రద్దు కావాలని డిమాండ్ చేశారు.
వారి కోరిక సగం నెరవేరింది. ఎన్నికలు వాయిదా పడ్డాయి. దాంతో తాము ఓడిపోతామన్న భయంతో ఎన్నికలు వాయిదా వేయించామని వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఇపుడు ఉత్త కుమారుల మాదిరిగా గట్టి శపధాలే చేస్తున్నారు.
ఇపుడు ఎన్నికలు పెట్టమండి విజయం మాదే అని బీరాలు పలుకుతున్నారు. మాకు ఈ ఎన్నికలు ఓ లెక్క అన్నట్లుగా సౌండ్ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లు టీడీపీ గెలుచుకుంటుందని కూడా చిలక జోస్యాలు చెబుతున్నారు.
విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా ఇపుడు మీడియా ముందుకు వస్తున్నారు. ఎన్నికలు పెడితే గెలిచేది టీడీపీయే అని అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి వారు అంటూంటే ఎన్నికలను ఎదుర్కొనే సత్తా ఒక్క టీడీపీకే ఉందని మరో మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ అంటున్నారు. ఎన్నికల్లో గెలిచి బాబుకు బహుమానం ఇస్తామని మరో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ గొప్ప ప్రకటలనే చేస్తున్న్నారు.
మరి అంతా బాగుంటే ఈ ఎన్నికల వాయిదాలు ఎందుకు. సజావుగా జరిగే ఎన్నికలకు బ్రేకులెందుకు అని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు. నిజానికి ఎన్నికల్లో గెలిచే సీనే ఉంటే చంద్రబాబు రద్దు, వద్దు అంటూ పదే పదే పలవరించేవారా అని సెటైర్లు కూడా వేస్తున్నారు. మొత్తానికి ఆరు వారాలు ఎన్నికలు వాయిదా పడడంతో బడాయి తమ్ముళ్ళు బాగానే పెద్ద నోర్లు చేస్తున్నారు.