సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ను రాజ్యసభకు నామినేట్ చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అది కూడా గత కొంతకాలంలోనే కీలకమైన కేసులకు సంబంధించిన తీర్పులు ఇచ్చారు ఆయన. ఆ తీర్పులు వివిధ రకాల చర్చలకు దారి తీశాయి. వాటిని ఇచ్చిన వెంటనే ఆయన రిటైర్ అయ్యారు. ఇంతలోనే ఆయనకు రాజ్యసభ నామినేషన్ దక్కింది. రాష్ట్రపతి కోటాలో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఉన్నారు. సాధారణంగా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు జరిగే నామినేషన్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతాయి. కేంద్రంలోని అధికార పార్టీ సానుకూలురులకే ఇలాంటి నామినేషన్లు దక్కుతూ ఉంటాయనే అభిప్రాయాలున్నాయి.
ఇలాంటి నేపథ్యంలో రంజన్ గొగోయ్ నామినేషన్ పై కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడుతూ ఉంది. పదవిలో ఉన్నప్పుడు గొగోయ్ బీజేపీ పెద్దలకు సహకరించారని, అందుకు ప్రత్యుపకారంగానే ఆయనకు బీజేపీ వాళ్లు రాజ్యసభ బెర్తును ఖరారు చేశారని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆయన ఇచ్చిన తీర్పుల విషయంలో కూడా ఇప్పుడు చర్చ మొదలైంది.
ఇక తటస్థుల నుంచి కూడా ఈ విషయంలో విమర్శలు వస్తూ ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది.. ఆల్రెడీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా చేసిన వ్యక్తి ఇలా రాజ్యసభకు నామినేట్ కావడం ఏమిటి? అనేది. ఎందుకంటే.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అంటే మాటలు కాదు కదా, మొత్తం పార్లమెంట్ నే ప్రశ్నించేంత శక్తి కలిగిన పదవి అది. పార్లమెంట్ నిర్లయాలను సమీక్షించి, అవసరం అయితే వాటిని ఆపగల శక్తి ఉండే పదవి అది. అలాంటి హోదాను ఆల్రెడీ చూసిన గొగోయ్ ఇలా రాజ్యసభకు వెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి కొంతమంది.
ఇలాంటి రచ్చ నేపథ్యంలో గొగోయ్ స్పందించారు. తను రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించబోతున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు! రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఇతర అంశాల గురించి మాట్లాడబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు! మొత్తానికి విమర్శలకు జడిసేది లేదని గొగోయ్ స్పష్టం చేశారు. పదవిని స్వీకరించిన తర్వాతే అసలు కథ అన్నట్టుగా మాట్లాడారు.