దేశంలో కరోనా ఉధృతి కాస్త ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దేశంలో మొదట కరోనాను గుర్తించింది కూడా కేరళలోనే లాగుంది. అయితే అక్కడ రిజిస్టర్ అయిన కేసులకు చికిత్స అందించి నయం చేశారు వైద్యులు. వారిని డిశ్చార్జి చేశారు కూడా. అయితే ఆ తర్వాత కూడా కేరళలో కొన్ని కేసులను గుర్తించారు. వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఇంకా ఇండియాలో కరోనా పూర్తి నియంత్రణలో ఉన్నట్టే.
రాబోయే రెండు వారాలూ కీలకం అని, ఈ సమయంలోనే కరోనా విస్తరించే అవకాశం ఉందని, ఇప్పుడు అరికడితే పూర్తిగా నియంత్రణ సాధించవచ్చు అని వైద్య శాఖ వర్గాలు అంటున్నాయి. అయితే కరోనా గురించి నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ కేరళ శాఖ పెద్ద షాకింగ్ విషయాన్నే చెప్పింది. సంచలన నంబర్లను పేర్కొంది.
జాతీయ ఆరోగ్య సంస్థ కేరళ శాఖ అంచనా ప్రకారం..ఒక్క కేరళలోనే రానున్న రోజుల్లో ఏకంగా 65 లక్షల మందికి కరోనా సోకే అవకాశం ఉందట! అంత మందికి కరోనా సోకే అవకాశం ఉందని కేరళ శాఖ ఆ రాష్ట్ర హై కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొందట! అది ఊహించడానికే సాధ్యం కాని అంశం.
కరోనా తీవ్రత అత్యధికంగా ఉండిన చైనాలో కూడా అంతమందికి ఆ వైరస్ సోకలేదు. అయితే జాతీయ ఆరోగ్య శాఖ కేరళ విభాగం మాత్రం ఈ విచిత్రమైన నంబర్ చెప్పింది. దాదాపు లక్ష మందికి పైగా ఐసీయూ విభాగాలు రెడీగా ఉండాలని కూడా ప్రతిపాదించింది. 65 లక్షల మంది అంటే.. కేరళ జనాభాలో దాదాపు 19 శాతం!
ఇంతకీ ఏ లెక్క ప్రకారం ఇంతమందికి కరోనా సోకుతుంది? అని అంటున్నారంటే..అదేదో షిప్ లో దాదాపు 3700 మంది ప్రయాణిస్తుంటే, వారిలో ఏకంగా 700 మందికి కరోనా సోకిందట. అంటే దాదాపు 19 శాతం మందికి కరోనా వైరస్ వ్యాపించిందట ఒక షిప్ లో. ఈ లెక్కన కేరళలో కూడా 19 శాతం మందికి కరోనా సోకుతుందని అక్కడి వైద్యాధికారులు అంచనా వేస్తున్నారట. అయితే ఇది కొంత విడ్డూరంగా కూడా అనిపించవచ్చు.
ఎక్కడో 19 శాతం మందికి సోకిందని… ఇక్కడే అంతే శాతంగా లెక్కేయడం సబబేనా? కరోనా సోకిన ఒక వ్యక్తి.. కనీసం ఇద్దరి నుంచి నలుగురికి అంటిస్తాడని కూడా కేరళ వైద్యులు చెప్పేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసుకోవడానికి వీలైనన్ని చర్యలు తీసుకోవడం సబబే కానీ, ఇలా భారీ నంబర్లు చెప్పి ప్రజలను భయాందోళనలకు గురి చేయడం ఎంత వరకూ సబబు?