నిన్నటి- ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇవాళ్టి- ముఖ్యమంత్రి జగన్ ..ఇద్దరూ ఒకరేనా? అప్పుడూ ఇప్పుడూ జగన్ ఒకేతీరుగా వ్యవహరిస్తున్నారా?
డబ్బు అధికారం హోదాలు మనుషుల్లో మార్పు తీసుకురావడం అనేది చాలా సాధారణమైన సంగతి. ఇవి తీసుకురాగల ‘మార్పు’పై ఆయా వ్యక్తులు ఎంత స్వీయనియంత్రణతో ఉంటారనేది వారివారి తరహాను బట్టి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు, వ్యవహారసరళి గురించి ప్రజలు ఆనాడు ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారో.. ఇవాళ కూడా అవే అభిప్రాయాలతో ఉన్నారని చెప్పలేం!
సింపుల్ గా చెప్పాలంటే.. ప్రజలు- ఆయనకు అధికారం ఇచ్చారు. అధికారం- ఆయనను ప్రజలకు దూరం చేస్తోంది. జగన్ లో వస్తున్న ఆ తేడా.. పార్టీకి, ఆయన భవిష్యత్తుకు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఈ పోకడ మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘జగన్‌లో ఆ తేడా.. వెరీ డేంజరస్!’
ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు వచ్చిందని, ఆయన తమను పట్టించుకోవడం లేదని పార్టీ నాయకులు, పెద్దవాళ్లు ఎవరైనా అంటే.. ఆ మాటలను ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే మాట సామాన్యులు అనకూడదు.. అలా అనే పరిస్థితి రాకుండా ముఖ్యమంత్రి చూసుకోవాలి. ఎందుకంటే.. రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి తమను పట్టించుకోవాలని కోరుకోవడంలో వారి స్వప్రయోజనాలే అధికంగా ఉంటాయి.
ఆ స్వప్రయోజనాలు నెరవేరనప్పుడు.. వారు ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కేవలం అపాయింట్మెంట్ ఇవ్వలేదని అలిగి పార్టీకి దూరం జరిగి బురద చల్లుతూ బతుకుతున్న వారు కొందరు.. ముఖ్యమంత్రిని కలవడం కుదరడం లేదని తమ ప్రెవేటు సంభాషణల్లో, ఆఫ్ ది రికార్డ్ మాటల్లో ఆడిపోసుకునే వారు మరికొందరు వైసీపీ నాయకుల్లో పుష్కలంగానే ఉంటారు. వారి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రజల సంగతి అలా కాదు.
ప్రజలు నేరుగా వ్యాఖ్యలు చేయకపోవచ్చు. ముఖ్యమంత్రి తీరును నిందించకపోవచ్చు. ముఖ్యమంత్రి స్థాయిలో కీలక బాధ్యతల్లో ఉండే నాయకుడు తమకు అందుబాటులో ఉండడం ఎలా సాధ్యమవుతుంది లెమ్మని సర్దుకుపోవచ్చు. కానీ.. వారికి అందుబాటులో ఉండడం అనేది సీఎం బాధ్యత. ఇతర ముఖ్యమంత్రులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ.. ఒకప్పుడు జనంతో మమేకమై మెలగిన, ఇప్పటికీ కూడా వారి బిడ్డగా తనకు గుర్తింపు ఉండాలని కోరుకుంటున్న జగన్ వంటి నాయకుడికి ఇది తగదు. ప్రజలు హర్షించరు.
పాదయాత్ర నాటి జగనేనా?
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర నిర్వహించారు. రికార్డుల్లోకెక్కిన పాదయాత్ర అది. ఇప్పుడు లోకేష్ నిర్వహిస్తున్న వంటిది కాదు. లోకేష్ పాదయాత్ర ఆద్యంతమూ జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తిపోయడం ఒక్కటే లక్ష్యంగా సాగిపోతూ ఉండగా.. ఆ నాడు జగన్ నిర్వహించిన పాదయాత్ర ఇప్పటికీ, ఎప్పటికీ కూడా ఒక రోల్ మోడల్ యాత్రలాగానే సాగిందని చెప్పాలి. సామాన్య జనాలతో 2004 ఎన్నికలకు పూర్వం వైఎస్ రాజశేఖర రెడ్డి, 2019 ఎన్నికలకు పూర్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మమేకం అయినట్టుగా మరొకరు కాలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు.
జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి భేషజాలు లేకుండా తారతమ్యాలు చూపించకుండా ప్రజలతో కలిసిపోయారు. పాదయాత్రలో జగన్ ను గమనినంచిన ప్రతి ఒక్కరూ కూడా జగన్ అంటే.. తమ కుటుంబంలో ఒక్కడు అని నమ్మారు, ప్రేమించారు. నిరుపేద వృద్ధులను ఆయన ఆలింగనం చేసుకున్నారు, తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చన వారిని ఆదరించి భుజం తట్టారు, తల నిమిరి శుభాకాంక్షలు తెలిపారు, ముద్దులు పెట్టి వారి పట్ల తన అనన్యమైన ఆప్యాయతను కూడా కనబరిచారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. వారి ప్రతి కష్టాన్ని కూడా సావధానంగా విన్నారు. కొన్నింటికి ఎక్కడికక్కడే తాను చేయగల పరిష్కారాలను కూడా ప్రకటించారు. కొన్ని సమస్యలను గమనించి.. పార్టీ పరమైన విధాన నిర్ణయాలుగా హామీలను రూపుదిద్దారు. మొత్తానికి తన ప్రవర్తనతో తాను ఒక పార్టీ అధినేతగా ప్రజల సేవకోసం ముందుకు వచ్చి, ముఖ్యమంత్రి స్థానంలో నిర్ణాయకంగా ఉండి పనిచేయాలని అనుకుంటున్న వ్యక్తినే తప్ప.. వ్యవహారంలో ప్రేమానుబంధాల్లో అందరిలాంటి సామాన్య వ్యక్తినే అనే అభిప్రాయాన్ని ఆయన అందరిలోనూ కలిగించగలిగారు.
నిజానికి ఇలాంటి మానవీయకోణమే జగన్ కున్న అసలు బలం! పార్టీ, వైఎస్సార్ కీర్తి, పార్టీ నాయకులు వెదజల్లిన కోట్లాది ఎన్నికల ఖర్చు ఇవన్నీ కూడా కాదు.. కేవలం జగన్ లోని మానవీయ కోణం అతిపెద్ద హేతువుగా ప్రజలు ఆయనను విశ్వసించి అధికారం కట్టబెట్టడానికి కారణం అయింది. ఏకంగా 151 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన ప్రజలతో అదేతరహాలో మమేకం అవుతున్నారా?
ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాత జగన్ నే కోరుకోవడం అనేది అత్యాశ. ప్రభుత్వాధినేతగా ఆయనకు సవాలక్ష ఒత్తిళ్లు ఉంటాయి. పని భారం ఉంటుంది. నిజమే. కానీ, కొన్ని వందలరోజుల పాటూ పగలంతా రోడ్లమ్మట నడుస్తూ ప్రజలను కలుసుకున్న వ్యక్తి, ఇప్పుడు కనీసం రోజులో ఒక గంట, ఏదైనా కార్యక్రమాలకు వివిధ ఊర్లకు వెళ్లినప్పుడు ఒక గంట సమయం కేటాయించలేకపోతున్నారా? అనే భావన ప్రజల్లో కలుగుతోంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో సీఎం నివాసం వద్ద ప్రతి ఉదయం సామాన్యులను కలవడానికి ఇక నిర్దిష్టమైన షెడ్యూల్డు కార్యక్రమం ఉండేది. ప్రతి ఉదయం పేదలను కలిసి వారినుంచి వినతిపత్రాలు తీసుకునే వారు. రాష్ట్రంలో ఏ మూల ఉన్న ఏ పేదవాడికైనా తమకు పెద్ద కష్టం వస్తే.. ముఖ్యమంత్రికి చెప్పుకోవచ్చు అనే ఒక నమ్మకం ఉండేది.
ఇవాళ ‘జగనన్నకు చెబుదాం’ అనే ఒక మాయా ప్రేరితమైన సాంకేతిక కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించి ఉండవచ్చు. రోజుకు వేలల్లో ప్రజలు కష్టాలు నివేదిస్తున్నారని నివేదికలు తయారవుతుండవచ్చు. కానీ.. నేరులో కలిసి వినతిపత్రాలు ఇవ్వగలిగిన వందల మంది ప్రజలకు కలిగే సంతృప్తి వీరికి కలుగుతున్నదా? అనేది ప్రశ్న! ముఖ్యమంత్రి ఎందుకిలా ప్రజలకు దూరం అయిపోతున్నారు?
కేవలం తన నివాసం వద్ద ప్రజల కష్టాలు వినడం గురించి మాత్రమే కాదు. వివిధ కార్యక్రమాలకోసం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు కూడా.. ఆ టూర్ లో ఒక గంట సమయాన్ని పేదలకోసం కేటాయించడానికి ముఖ్యమంత్రి వద్ద సమయం లేదా? ప్రజల వినతులు స్వీకరిస్తారనే కార్యక్రమం ప్రకటించి.. కొద్ది సమయం ఆయన స్వయంగా స్వీకరించి.. మిగిలిన వారినుంచి అధికారులనే తీసుకోమని చెప్పినా కూడా ప్రజలకు ఒక తృప్తి కలుగుతుంది కదా అనేది ఇక్కడ ప్రశ్న. ఈరోజుల్లో సాంకేతికత మానవ సంబంధాల్లో, మానవీయ కోణాల్లో తీసుకువస్తున్న సకల అరిష్టాలను రాజకీయరంగం కూడా అలవరచుకుంటున్నదని అనుకోవడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. తాను ఆ తరహా మనిషిగా వైఎస్ జగన్ ప్రొజెక్ట్ కాలేదు. తొలినుంచి ఆయన ప్రజల మనిషిగా ముద్రపడ్డారు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రజల నుంచి దూరం జరుగుతున్నారు.
వివిధ కార్యక్రమాల కోసం టూర్లు వెళుతున్నప్పుడు.. ఆర్గనైజ్డ్ సభలకు హాజరయ్యే, ఆహ్వానితులైన జనం మధ్యలో తప్ప.. ప్రజల మధ్యలో ఆయన మెదలుతున్న సందర్భాలెన్ని? ఏ ఊరిలోనైనా రోడ్డు మార్గంలో కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తే.. ఆ మార్గం పొడవునా.. రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు కట్టేసి, దుకాణాలు మూయించేసి.. జనసంచారాన్ని నిషేధించేసి.. చెట్లను కూడా నరికేసి.. ఏం సాధించాలనుకుంటున్నారు జగన్? ప్రజలను దూరం పెట్టాలనుకుంటున్నారా? ఆయన వస్తున్న తేడా, ప్రజల హృదయాల్లో ఉన్న ప్రేమను పలుచన చేస్తుందని ఎందుకు గ్రహించలేకపోతున్నారు?
ఐప్యాక్ మాయలు
వివిధ ఊర్లలో పర్యటించినప్పుడు.. ఐప్యాక్ ప్రతినిధులు చేసే మాయాజాలం కొంత ఉంటుంది. కొందరు రోగగ్రస్తుల్ని గుర్తించి.. సీఎంను కలిసే ఏర్పాటుచేస్తారు. వారిని మాత్రం సీఎం కలిసి.. వారికి సాయం ప్రకటిస్తారు. ఐ ప్యాక్ మాయలలో భాగంగానే.. పార్టీ సోషల్ మీడియా బృందాల వారితో కరచాలనాలుచేసి ఫోటోలు దిగుతారు. అక్కడితో ఆయన ప్రజలతో మమేకం కావడం అనేది అయిపోతుంది.
సామాన్యులకు ముఖ్యమంత్రికి మధ్య స్థానిక నాయకులు, పోలీసులు, ఇతర వ్యవస్థలు అన్నీ కలిసి ఇనుప అడ్డుగోడలు నిర్మిస్తుంటారు. అయితే ముఖ్యమంత్రిని ‘మనుషులకు’ దూరం చేస్తున్న ఈ గోడల నిర్మాణం.. ఆయనకు తెలియకుండా జరుగుతూ ఉంటుందని.. ఆయన ఇష్టానికి వ్యతిరేకం జరుగుతుందని అనుకుంటే మాత్రం భ్రమ.
వరదల్లో సీఎం స్వయంగా ఎందుకు వెళ్లాలి?
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ప్రజాజీవితం అస్తవ్యస్తం అయింది. బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించనే లేదని అందరూ విమర్శిస్తున్నారు. రావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలు అయింది. చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దు చేసుకుని, కేవలం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో సమీక్ష సమావేశం మాత్రం నిర్వహించి అక్కడితో చేతులు దులుపుకున్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లడం లేదనే విమర్శల గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన కౌంటర్ విమర్శలు చాలా డేమేజింగ్ గా కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఎందుకు వెళ్లాలి.. చంద్రబాబు లాగా వెళ్లి అక్కడ సహాయక చర్యలు చేస్తున్న అధికారుల కాళ్లకు అడ్డు పడాలా? అని వెటకారం చేస్తున్నారు! పని జరిగితే చాలు కదా అంటున్నారు- ఇది చిత్రమైన వాదన! అసమంజసమైన వాదన.
సీఎం వెంట అధికారులంతా ఉంటే రిలీఫ్ మెజర్స్ ఎవరు చూస్తారు.. అంటున్నారు. సీఎం వెంట అధికారులంతా ఎందుకు ఉండాలి? ఒకరిద్దరు కీలక అధికారులు ఉంటే సరిపోతుంది కదా. అధికారులందరూ తన వెంట ఉండాలనీ సీఎం ఎందుకు కోరుకోవాలి? ఎవరి పనులు వారుచేస్తూ ఉండగా.. తనకు స్థానిక పరిస్థితిని నివేదించడానికి ఒకరిద్దరిని మాత్రం వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి తిరిగినా సరిపోతుంది.
‘సీఎం స్వయంగా ఎందుకు వెళ్లాలి?’ అని అనడం ఆలోచించి తీరాల్సిన, అద్భుతమైన వాదన. చంద్రబాబును వెటకారం చేయడానికి ఈ వాదన బాగా ఉపయోగపడుతుంది. అవును సీఎం వెళ్లాల్సిన అవసరం లేదు. యంత్రాంగం మొత్తం సవ్యంగా పనిచేస్తే చాలు. ప్రజల కష్టాలను పట్టించుకుని, వారి బాధల పట్ల శ్రద్ధతో సేవలందిస్తే చాలు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినది బాగానే ఉంది. కానీ.. ఆ మాట చెప్పేముందు మరొక సంగతి గుర్తుంచుకోవాలి.
వివిధ సంక్షేమ పథకాల కింద బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడేలాగా వేల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి… ఒక్కో పథకానికి బటన్ నొక్కడానికి ఒక్కొక్క ఊరికి ఎందుకు వెళ్లాలి? ఫలానా ఊరిలో బటన్ నొక్కితే రాష్ట్రవ్యాప్తంగా అందరి అకౌంట్లలో పడుతున్నప్పుడు.. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలోనే కూర్చుని.. అన్ని పథకాల బటన్లను అక్కడే సమకూర్చుకుని తడవకొకటి నొక్కుతూ ఉంటే ప్రజల ఖాతాల్లో పడుతూ ఉంటాయి కదా? మరి ఎందుకు ‘స్వయంగా’ వెళుతున్నారు?
ఈ ప్రశ్నకు సజ్జలగానీ, పార్టీ నాయకులు ఏం సమాధానం చెబుతారో.. అదే సమాధానం వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు కూడా వర్తిస్తుంది. తమ కష్టాలు తీరుస్తాడనే నమ్మకంతో తాము ఎన్నుకున్న నాయకుడు.. తాము కష్టాల్లో ఉన్నప్పుడు కళ్లెదురుగా కనిపిస్తే చాలు.. వారికి అదొక ఊరట. జననేతగా ప్రజల హృదయాలలో కొలువుండే వైఎస్సార్ తనయుడు ఆ సత్యాన్ని గుర్తించకపోతే ఎలాగ?
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేశారు? రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన కార్యకర్తల నెట్ వర్క్ లేదా? ఆయన పాదయాత్రలో పర్యటించిన, పర్యటించని చిన్న చిన్న కుగ్రామాల నుంచి కూడా ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో.. తన పార్టీ నెట్ వర్క్ ద్వారా వివరాలు తెప్పించుకుని.. ప్రజల కష్టాల గురించి ఆయన ఒక అవగాహన కల్పించుకుని ఉండవచ్చు కదా? ఆ మాత్రం భాగ్యానికి స్వయంగా పాదయాత్ర చేసినది ఎందుకు?
ఎందుకనేది జగన్ కు చాలా స్పష్టంగా తెలుసు. మనసులను గెలుచుకోవాలంటే.. ప్రత్యక్షంగా మానవ సంబంధాల నిర్మాణమే దానికి పునాది అని ఆయన ఎరుగుదురు! ఆ మానవ సంబంధాల కోసమే.. ఆయన రికార్డు స్థాయిలో అతి సుదీర్ఘమైన పాదయాత్రను చేపట్టారు. లక్షల మంది ప్రజలను స్వయంగా కలిశారు. పసిపిల్లలను ఎత్తుకుని ఆడించారు. వృద్ధులను కౌగిలించుకుని ఊరడించారు. సోదరబంధంగా భావిస్తున్న వారందరికీ.. నుదుట ముద్దులు పెట్టి.. తన శుభకామనలు తెలియజేశారు.
ఆ రూపాల్లో తాను వారందరిలో ఒకడిని అని ఆయన నమ్మకం కలిగించారు. ఆరూపేణా ఆయన కలిగించిన నమ్మకమే ఆయనకు ఎన్నికల్లో శ్రీరామరక్ష అయింది. తిరుగులేని మెజారిటీతో ఆయనకు అధికారం కట్టబెట్టింది. కానీ.. అప్పట్లో ప్రజలు తమలో కలిసిపోయిన తమవాడు అని అనుకున్న జగన్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఇలాంటి తేడా మళ్లీ గెలిచి మరో ముప్ఫయ్యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించాలని తపన పడుతున్న జగన్ భవిష్యత్తుకు మంచిది కాదు. ఆ తేడా- పార్టీకి కూడా చేటు చేస్తుంది.
జగన్ ప్రభుత్వం అద్భుతమైన రీతిలో సంక్షేమ పథకాలను చేపడుతున్నది నిజమే. కానీ… కేవలం అదొక్కటే మళ్లీ మళ్లీ గెలిపిస్తుంటుందని అనుకోకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ప్రతి ఇంటికీ చెందిన బిడ్డని అని చాటుకోవడానికి జగన్ ఉత్సాహపడుతుంటారు.
కన్నబిడ్డ అమెరికాలో కోట్లు సంపాదిస్తూ.. ప్రతినెలా ఖర్చులకు కుగ్రామంలో ఉన్న తల్లిదండ్రులకు లక్షలు పంపుతూ.. ఏళ్లతరబడి వారి మొహం చూడకుండా గడిపేస్తూ ఉంటే.. ఆ కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంటుందా? కొడుకు పంపే లక్షలు చూసుకుని.. వాడు తమను చూడడానికి వస్తే ఎంత రాకపోతే ఎంత.. అని తల్లిదండ్రులు మురిసిపోగలరా? మానవ అనుబంధాలలో వస్తున్న మార్పును నిలదీసే ఈ ప్రశ్న.. జగన్ రాజకీయానికి కూడా వర్తిస్తుంది. ఆయన తన తీరు మార్చుకుని తాను ఎప్పటిలాగానే.. జనం మనిషిని అని చాటుకోవాలి. ప్రజలకు తన పట్ల ఉన్న నమ్మకాన్ని, ప్రేమను కాపాడుకోవాలి.
..ఎల్ విజయలక్ష్మి