టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో చిట్ట చివరి పాలక మండలి సమావేశం ఇవాళ జరగనుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో బోర్డు సభ్యులు సమావేశమై 80 అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. వైవీ సుబ్బారెడ్డి పాలక మండలి గడువు మంగళవారంతో ముగియనుంది. నూతన అధ్యక్షుడిగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియమితులైన సంగతి తెలిసిందే.
వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా కొనసాగారు. అప్పుడప్పుడు వివాదాలు చెలరేగాయి. ఇవన్నీ రాజకీయపర మైనవి కావడం గమనార్హం. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్‌గా వైవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ఆయనపై వుంది. దీంతో పూర్తిగా పార్టీ కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది.
కారణాలేవైనా ఉత్తరాంధ్రలో వైసీపీ పరిస్థితి గతంతో పోలిస్తే కొంత బలహీన పడింది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీని చక్కదిద్దాల్సి వుంది. ఆ మధ్య జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి చిరంజీవి గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారించకపోతే అసలుకే మోసం వస్తుందనే భావన వుంది.
విశాఖను రాజధాని చేస్తామన్నా పార్టీకి ఊపు రావడం లేదనే బెంగ వైసీపీలో వుంది. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకు వైవీ సుబ్బారెడ్డి ఎంత వరకు పని చేస్తారో చూడాలి.