“ఈనాడు అంటే గౌరవం. ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు కరపత్రాలే” అని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసులో ఏదీ దాచుకోకుండా కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడ్డం కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రత్యేకత. ఇవాళ ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పత్రికల తీరుతెన్నులపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఒక పత్రికలో తన అనుచరుల ఇసుక దందాపై కథనం వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా మీడియాతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడారు. ఈ సందర్భంగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న సాక్షి పత్రికపై కూడా సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం ప్రొద్దుటూరులో వైసీపీ ప్లీనరీ సమావేశం నిర్వహణకు సంబంధించి సమాచారాన్ని చెప్పేందుకు మీడియా సమావేశాన్ని మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో రాచమల్లు ఏమన్నారో ఆయన మాటల్లోనే…
“నిజం చెబుతున్నా. మీరు నమ్ముతారో లేదో తెలియదు. సాక్షి పత్రికను నేను అస్సలు చూడను, చదవను. ఎందుకంటే అది వైసీపీకి భజన చేస్తుంటుంది. టీడీపీకి ఆంధ్రజ్యోతి కరపత్రం అయినట్టే, మా పార్టీకి సాక్షి కూడా అంతే. కానీ ఈనాడు వయా మీడియాగా పోతుంటుంది. అందుకే ఆ పత్రిక అంటే నాకు గౌరవం. టీడీపీకి కొంత అనుకూలంగా ఈనాడు పత్రిక రాసినా, మిగిలిన విషయాల్లో వాస్తవాలు రాస్తుంది. అందుకే ఆ పత్రికను పాఠకులు ఆదరిస్తున్నారు.
చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి కొమ్ము కాస్తుంది. కానీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్ని చదువుతా. ఎందుకంటే మా ప్రభుత్వంపై ఏం విమర్శలు చేస్తాయో అని తెలుసుకోడానికి చదువుతా. కానీ ఆంధ్రజ్యోతి కోరుకున్నట్టు నా బొందిలో ప్రాణం వుండగా ఓడిపోను. పత్రికలు ఎప్పుడూ గెలపించడం, ఓడించడం చేయలేవు. పత్రికా యజమానులకు రాజకీయ ఎజెండా వుంటుంది. కానీ మీడియా ప్రతినిధులకు ఉండకూడదు. నాపై విద్వేషపూరితంగా రాస్తే, నేను కూడా అట్లే ఉంటా. ఆంధ్రజ్యోతి అంటే నాకు ద్వేషం. పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తే పది రోజులు లేదా 20 రోజులు చర్చించుకుంటారు. ఆ తర్వాత మరిచిపోతారు. మేము చేసే వాటిని కథనాలు ఆపుతాయా? నేను ఏదైనా చేస్తే, చేశానని ఒప్పుకుంటా” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఈనాడు అధిపతి రామోజీరావుపై రాచమల్లు సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చంక రామోజీరావు నాకుతాడని విమర్శించిన రాచమల్లు… పదిరోజులకే ఎంతో గౌరవమని చెప్పడం గమనార్హం. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ప్రతి సమావేశంలోనూ దుష్ట చతుష్టయం అంటూ చంద్రబాబు, పవన్‌కల్యాణ్, ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థల్ని తిట్టిపోస్తున్న సంగతి తెలిసిందే.
తమ ముఖ్యమంత్రి దుష్టచతుష్టయంగా అభివర్ణించిన ఈనాడు అంటే తనకెంతో గౌరవమని అధికార పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి. మొత్తానికి రాచమల్లు కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి.