ఇప్పుడు కాదు.. దాదాపు ఐదేళ్లుగా వినాయక్ పొలిటికల్ ఎంట్రీపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. మొన్న ఎన్నికల్లో కూడా అతడు పోటీచేస్తాడని అనుకున్నారు. కానీ మిస్ అయిందంటూ మళ్లీ కథనాలు వచ్చాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి వీవీ వినాయక్ తెరపైకి వచ్చాడు. ఈసారి వైసీపీతో చర్చలంటూ తెగ స్టోరీలు వచ్చాయి.
కట్ చేస్తే వినాయక్ అన్ని పార్టీలకు సమదూరంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఏ పార్టీ కండువా కప్పుకోకూడదని ఫిక్స్ అయ్యాడు. చూస్తుంటే ఈ ఎన్నికలకు కూడా వినాయక్ దూరమయ్యేట్టు కనిపిస్తున్నాడు. పరోక్షంగా ఈ విషయాన్ని వినాయక్ కూడా నిర్థారించాడు.
ఈ దఫా ఎన్నికలకు ఈ దర్శకుడు దూరంగా ఉండడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒకటి ఆర్థికపరమైన కారణం. ఇప్పటికిప్పుడు ఎన్నికల బరిలో దిగి కోట్లలో డబ్బు ఖర్చుపెట్టేంత రేంజ్ లో వినాయక్ లేడంటున్నారు అతడి సన్నిహితులు. రీసెంట్ గా తనకు సంబంధించిన ఓ మల్టీప్లెక్సు కూడా అమ్ముకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.
మరోవైపు వినాయక్ రాజకీయాలకు దూరంగా ఉండడం వెనక మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. అంతా భావిస్తున్నట్టు అతడు వైసీపీలోనే చేరి, ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగితే, మెగా ఫ్యాన్స్ మొత్తం అతడికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది.
ఎందుకంటే జనసేనను కాదని వినాయక్ వైసీపీలోకి వెళ్తున్నారు మరి. ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాతే ఈసారి కూడా రాజకీయాలకు దూరంగా ఉండాలని వినాయక్ నిర్ణయించుకున్నాడట.