తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటల మరాఠీ అనేది మనందరికీ తెలిసిన సంగతే. ఆయన అద్భుతమైన వాగ్ధాటి, పటిమ ఉన్న నాయకుడు. మాటలతో ఎదుటివారిని సమ్మోహితుల్ని చేయగలరు. ఆయన వ్యతిరేకంగా నిరసనలు చేయదలచుకుని వచ్చిన వాళ్లు, ఆయనను నిలదీయడానికి ఎగబడిన వాళ్లు కూడా.. ఆయన మాటలు ఓ నిమిషం వింటే..ఆయన మాయలో పడిపోతారు. అలాంటి కల్వంకుట్ల చంద్రశేఖరరావు.. ఇప్పుడు తెలంగాణలో తన పాలన పట్ల మండిపడుతున్న ఉద్యోగవర్గాలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఎన్నికలు మరికొద్ది నెలల్లో వస్తున్నాయనగా.. ఇప్పుడిప్పుడే జనం మీదికి ప్రయోగించడానికి తన అమ్ముల పొదిలోంచి సమ్మోహన అస్త్రాలను బయటకు తీస్తున్నారు కేసీఆర్. నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న రైతురుణమాఫీ హామీకి చిటికెలో మోక్షం కల్పించారు. రోజుల వ్యవధిలోనే జీవో సహా నిధులు కూడా విడుదల చేసేస్తూ.. రైతులోకాన్ని ఆకట్టుకున్నారు. అదే తరహాలో ఇప్పటిదాకా కేసీఆర్ పాలన మీద మండిపడుతున్న ఉద్యోగ వర్గాల మీద ఫోకస్ పెట్టారు.
త్వరలోనే కొత్త పీఆర్సీ ఏర్పాటుచేస్తాననేది ఉద్యోగులకు కేసీఆర్ ప్రకటించిన వరం. అయితే ఇంత చిన్న వరంతో ఆయన ఎందరిని ఆకట్టుకోగలరనేది సందేహమే. ఎందుకంటే.. ఉద్యోగుల రైతులంత అమాయకులు కాదు. ‘త్వరలో’ అనే పదానికి ఖచ్చితమైన అర్థం అడగగలరు. అతి త్వరలోనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాం అని కేసీఆర్ అంటున్నారు. ఈ అంశాన్ని కూడా వారు నమ్మడం లేదు.
గత పీఆర్సీకి సంబంధించిన బకాయిలనే ఇప్పటిదాకా చెల్లించలేదు. ఇక కొత్త పీఆర్సీ విషయంలో ఎలా నమ్మగలం? అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు కూడా మా పిల్లలే అని కేసీఆర్ అంటున్నారు గానీ.. ఇలాంటి పడికట్టు మాటలకు ప్రజలు బుట్టలో పడుతారని అనుకోవడం భ్రమ.
ఒకవైపు ఉద్యోగుల్ని బుజ్జగించడానికి రకరకాల మాయమాటలు చెబుతూనే.. తనకు ఏ ఒక్క విషయంలోనూ స్పష్టత లేనట్టుగా పరిస్థితి తయారైంది.ఎందుకంటే.. ఒకవైపు రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూరగానే ఉద్యోగులకు జీతాలు పెంచుతాం అని కేసీఆర్ అతి గొప్ప వరం ప్రకటించారు. ‘ఆర్థిక వనరులు సమకూరగానే’ అనే పదాలకు మీనింగ్ ఏమిటో ఆయనొక్కరికే తెలియాలి. ఈ మాట ద్వారా.. అసలుఎప్పటికీ జీతాలు పెరగవేమో అనే భయం ఉద్యోగుల్లో కడుగుతోంది.
ఒకవైపు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారు కొత్త పీఆర్సీ కమిటీని కూడా ఏర్పాటుచేసి.. ఏడాదిలోగా సిఫారసులు ఇవ్వాలని డెడ్ లైన్ కూడా పెట్టింది. వారలా ఉద్యోగుల మన్నన చూరగొంటుండగా.. తెలంగాణలో కేసీఆర్ ఇంకా మాటలదశలోనే పొద్దుపుచ్చుతున్నారు. ఇదే వైఖరి కొనసాగితే.. కేసీఆర్ పట్ల ఉద్యోగుల్లో మరింత ద్వేషం పెరిగే ప్రమాదం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.