“యాభై ఏళ్లు దాటాక విడాకులా? ఏమన్నా అర్థముందా? ఆ వయసులో అదేం పోయేకాలం?” …ఇలాంటి మాటలు మనం వింటుంటాం.
అంటే పెళ్లికే కాదు, విడాకులకి కూడా “వయసు” గురించి మాట్లాడుతుంది సమాజం.
కానీ రానురాను ఆ రోజులు పోతున్నాయి. కాదేదీ వయసుకనర్హం అని ప్రపంచంలో చాలామంది నిరూపిస్తున్నారు.
ఆ మధ్యన బిల్ గేట్స్ 70 దాటాక భార్యనుంచి విడాకులు తీసుకుంటే ఆశ్చర్యపోయారు. అలాగే కెనెడా ప్రధాని కూడా 50 ఏళ్ళు దాటాక తన విడాకుల్ని ప్రకటించాడు. అయితే ఇది కేవలం సెలెబ్రిటీల విషయమే కాదు సమాన్యులు కూడా చాలామంది 50-60 దాటాక విడాకుల గురించి ఆలోచిస్తున్నారు. దీనికి కారణాలు అనేకం.
గతంలో స్త్రీకి ఆర్ధిక స్వేచ్ఛ ఉండేది కాదు. కష్టమో, నిష్టూరమో పిల్లలకోసమైనా భర్తతో కలిసుండాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. అంటే భర్త వదిలేస్తే పోవాలి తప్ప, భార్య తనంతట తాను విడాకుల గురించి ఆలోచించే ధైర్యం చేసేది కాదు. పైగా “క్షమయా ధరిత్రి” అంటూ ఆమెకు ఒక బిరుదుకూడా తగిలించేసి అలాగే ఉండాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. భర్తలతో సమానంగా, కొన్ని సార్లు భర్త కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న భార్యలున్నారు. ఆ దాంపత్యం కొనసాగాలంటే ఇద్దరూ చాలా విషయాల్లో సర్దుకుపోవాలి. ఏమాత్రం నోరు జారినా భార్య ఈగో హర్టవ్వచ్చు ఆవిడ భర్తని పొమ్మనొచ్చు. అది ఏ వయసులోనైనా జరగొచ్చు. ముఖ్యంగా భారతీయ కుటుంబాల్లో ఇటువంటి బంధం పొసగని జంటలు పిల్లల పెళ్లిళ్లు అయ్యే వరకు కలిసుండి తర్వాత ఎవరి దారిన వారు సర్దుకుంటున్నారు.
“అదేంటి…వృద్ధాప్యంలో తోడు కావాలి కదా! వదిలేసుకుంటే ఎలా?” అని అడగడం సహజం. అయితే ఆ తోడు నచ్చకే కదా విడిపోయేది! డబ్బుంటే ఖరీదైన ఓల్డ్ ఏజ్ హోంస్ ఉన్నాయి. కావాల్సినంత మంది సేవకుల మధ్యన బతికి ఏదో ఒకనాడు అక్కడే హాయిగా కన్నుమూసేయొచ్చు అనుకుంటున్న వాళ్లు ఎందరో.
నిజానికి కలిసున్న వృద్ధ జంటల్లో కూడా ఒకరు పోతే ఇంకొకర్ని ఈ ఖరీదైన ఓల్డేజ్ హోంస్ కి తరలిస్తున్న పిల్లలే ఉంటున్నారు. కనుక చాలామంది వృద్ధ జంటలకి అంతిమగమ్యం ఇలాంటి ఆశ్రమాలే. కనుక ఆ పనేదో ముందే చేసేసుకుంటున్నారు నచ్చని భాగస్వామితో వేగలేనివాళ్లు.
అమెరికన్స్ లో “గ్రే హెయిర్ డైవొర్స్” అనేది ప్రస్తుతం హాట్ టాపిక్. ఆ తెల్లవాళ్ల సంస్కృతిలో 18 ఏళ్లు దాటాక పిల్లలు తమ పిల్లలు కాదు అన్నట్టు ఉంటారు. వాళ్ళ పెళ్లిళ్లు వాళ్లే చేసుకుంటారు, లేదా విడిగా ఉంటారు, ఆర్ధికంగా తల్లిదండ్రులపై ఆధారపడరు, చుట్టం చూపుగా ఏ క్రిస్మస్ కో, థాంక్స్ గివింగ్ డే కో మూడుంటే వస్తారు లేదా లేదు. కనుక భార్యాభర్తలకి పిల్లల కనెక్షన్ అనబడే కామన్ పాయింట్ ఉండదు కాబట్టి వారి మధ్య సయోధ్యలేనప్పుడు విడిపోవాలనే ఆలోచనలు వెంటనే వస్తాయి. గణాంకాల ప్రకారం 1960లకి ఇప్పటికి చూస్తే ఈ తరహా షష్టిపూర్తి అయ్యాక పుచ్చుకునే విడాకుల కేసులు మూడింతలు పెరిగాయట. ఆ దేశ జనాభా మాత్రం అప్పటికీ ఇప్పటికీ రెండింతలే పెరిగింది.
నచ్చని జీవిత భాగస్వామితో చచ్చేదాకా బతికేకంటే విడిగా ఉండి మరిచిపోయిన తనని తాను అన్వేషించుకుంటూ శేషజీవితం గడపాలనుకునేవాళ్లకి ఆనందం, ఆరోగ్యం రెండూ దక్కుతున్నాయని అమెరికన్ సైకాలజిస్టులు చెప్తున్నారు. అయితే అలా బతకడానికి తగిన ఆత్మస్థైర్యం, మానసిక శక్తి, ప్రాక్టికాలిటీ అవసరం. వాళ్లకే ఇది చెల్లుతుంది.
ఈ తరహా జంటలతో పాటూ మరొక రకం కూడా ఉంటున్నారు. 50 వరకు విడిగా ఉండి సడెన్ గా వాళ్లకి పెళ్లి కావాలనిపిస్తుంది. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అలా చేసుకున్న కొన్నాళ్లల్లోనే పొసగక విడాకులు కావాలనుకుంటారు. ఈ రకంగా లేటు వయసులో పెళ్లిళ్లు, అంతలోనే విడాకులు కేటగరీ కూడా పెరుగుతోంది. ఈ రకం పెళ్లిళ్లల్లో ఎక్కువగా ఆర్ధికపరమైన అవసరాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఆ అవసరాలు విసిగించడం మొదలుపెట్టగానే విడాకులు గుర్తొస్తున్నాయి.
ఈ గ్రే హెయిర్ డైవొర్సీలని పక్కన పెడితే 30 దాటిన చాలామంది యువతీయువకులు ఇక పెళ్లి చేసుకోనక్కర్లేదని నిర్ణయించేసుకున్న వాళ్లుంటున్నారు. స్వచ్ఛందబ్రహ్మచర్యమన్నమాట! బ్రహ్మచర్యమంటే ఇక్కడ కేవలం పెళ్లి చేసుకోరంతే… లివిన్ రిలేషన్ తో కొనసాగుతారు ఏ లీగల్ కమిట్మెంట్ లేకుండా!
ఆర్ధికంగా, ఆదాయం పరంగా, ఆరోగ్యం విషయంగా బలంగా ఉండే వయసు కనుక 35 దాటాక వచ్చే మెచ్యూరిటీ వల్ల పెళ్లిపై ఆసక్తి కోల్పోతున్నారు. అదే 20ల్లో ఉండగా పెద్దల నిర్ణయానికి తలవంచే వయసు కావడం వల్ల పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. కనుక ఒక అంచనా ఏమిటంటే 30 లోపు పెళ్లి జరగకపోతే ఇక వివాహఘడియ జీవితంలో రాని ఘటనలే ఎక్కువౌతున్నాయి.
ఏది ఏమైనా పెళ్లి, విడాకులు అనేవి వ్యక్తిగత విషయాలు. అయితే మనిషి సంఘజీవి కనుక వాటి ప్రభావం సమాజం మీద కూడా ఉంటుంది.
పద్మజ అవిర్నేని