భారతదేశంలో కరోనా భయాలు గత వారం నుంచినే పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోం ఈ వారం నుంచినే షురూ అయ్యింది. అయితే .. చైనాలో కరోనా ఫియర్స్ నెల కిందటి నుంచినే ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో కరోనా ప్రభావం అక్కడ చాలా పెరిగింది. ఆ సమయం నుంచినే నివారణ చర్యలు కూడా మొదలయ్యాయి.
అందులో భాగంగా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ను ఇచ్చాయి అక్కడి కంపెనీలు. ఎవరూ ఆఫీసులకు రానక్కర్లేదని, ఇంటి నుంచి పని చేయాలని సూచించాయి. అదంతా కరోనా నివారణకు జరిగిన ప్రయత్నం. అయితే అది చైనా. ఒకదానికి మందేస్తే మరో దానిపై అది ప్రభావం చూపినట్టుగా.. కరోనా భయంతో ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోం అవకాశం చైనాలో విడాకుల సంఖ్య పెరగడానికి కారణం అవుతోందట!
గత నెల రోజుల్లో చైనాలో దాఖలైన విడాకుల కంప్లైంట్ల సంఖ్య బాగా పెరిగిందట. కొన్ని ప్రాంతాల్లో విడాకులు కావాలంటూ కోర్టులకు పిటిషన్లు పెడుతున్స వారి సంఖ్య అమాంతం రెట్టింపు అయ్యిందట. ఇదంతా ఎందుకు? అంటే భార్యాభర్తలు ఇంట్లో కూర్చుని పని చేయడం వల్ల! అని అంటున్నారు అక్కడి విశ్లేషకులు.
మామూలుగా మొగుడూ, పెళ్లాం తమ తమ పనులకు వెళ్లిపోతారు. ఏ సాయంత్రమో ఇంటికి చేరతారు. అలాంటి సందర్భాల్లో కలిసి ఉండే గంటలు తక్కువే. అయితే ఎప్పుడైతే కరోనా ప్రభావంతో భార్యాభర్తలిద్దరూ ఇళ్లలోనే కూర్చున్నారో అక్కడ నుంచి కథ మారిందట! ఇంట్లోనో ఉండటంతో ఒకరికొకరు మొహం మొత్తడం, గొడవలు పడటం.. అవి తీవ్రంగా మారి విడాకుల వరకూ వెళ్లిపోవడం! గతంలో కూడా విడాకుల పిటిషన్లు దాఖలైనా.. గత నెల నుంచి వాటి సంఖ్య బాగా పెరిగినట్టుగా అక్కడి గణాంక నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లోనే ఉండటంతో.. భార్యభర్త గొడవలు పడి విడాకులు తీసుకునేంత వరకూ పరిస్థితి వచ్చిందని, కరోనా ఇలా కాపురాలను కూలుస్తోందని చైనీ మీడియానే చెబుతూ ఉంది! కుటుంబ వ్యవస్థ అంత పటిష్టంగా లేని దేశంలో కరోనా ఇలా కూడా దెబ్బేస్తున్నట్టుగా ఉంది!