సైఫ్ అలీఖాన్.. పటౌడీల వంశలో ప్రస్తుత రాజు. అయితే ఆయన రాజరికం పట్టాభిషిక్తం వరకే. పటౌడీ చాలా దశాబ్దాల క్రితం రాజరిక పాలన చేశారు. సైఫ్ అలీఖాన్ తాత ఇఫ్తీకర్ అలీ పటౌడీల వంశంలో ప్రజలను ఏలిన చివరి రాజు. ఆ తర్వాత బ్రిటీష్ వాళ్ల ప్రభావం, భారత దేశానికి స్వతంత్రం నేపథ్యంలో.. వీరి రాజరికం కూడా పేరుకు మాత్రమే మిగిలింది. వీరు రాజరిక నియమాలను పాటిస్తూ ఉంటారు. ఆ పరంపరలో భాగంగా ఆ మధ్య సైఫ్ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
వీరికి రాజరికం కేవలం పేరు ప్రఖ్యాతులనే కాదు.. ఆస్తులను కూడా ఇచ్చింది! అయితే వాటిని వీరు వినియోగించుకోలేకపోయారట ఇన్నాళ్లూ. అందులో ఒకటి పటౌడీ ప్యాలెస్. గుర్గావ్ ప్రాంతంలో వీరి ప్యాలెస్ ఒకటి ఉంది. అది మామూలు ప్యాలెస్ కాదు. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. పదుల కొద్దీ గదులుంటాయి. ఒక రాజమహల్ అది. ఇఫ్తీకర్ కాలంలో దాన్ని నిర్మించుకున్నారట. అప్పటి నుంచి వారసత్వ ఆస్తిగా పటౌడీలకు అది దక్కింది. అయితే కొన్నేళ్లుగా ఆ భవంతి వీరి ఆధీనంలో లేనట్టుగా తెలుస్తోంది.
దాన్ని రెంట్ కు ఇచ్చారట. ఒక హోటల్ కంపెనీ వాళ్లు దాని నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారట. దాన్ని వారు నిర్వహిస్తూ పటౌడీ కుటుంబానికి కొంత మొత్తాన్ని జమ చేస్తున్నట్టుగా ఉన్నారు. అలా రెంట్ కు ఇచ్చేసిన ఆ భవంతిని ఇప్పుడు సైఫ్ అలీఖాన్ మళ్లీ సొంతం చేసుకున్నాడని సమాచారం. రెంట్ కు ఇచ్చారంటే.. అది నిర్వహించలేక కాదు. ఒక రకంగా కుదువపెట్టడమని సమాచారం.
సినిమాలతో తను సంపాదించిన డబ్బుతో ఇప్పుడు తమ ప్యాలెస్ ను మళ్లీ సొంతం చేసుకున్నాడట సైఫ్. ఇప్పుడు సైఫ్ కు పూర్తిగా సొంతం అవుతున్న ఆ ప్యాలెస్ విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు అని అంచనా! అందులో కొన్ని హాలీవుడ్ సినిమాలతో పాటు, భారతీయ సినిమాలు కూడా అనేకం షూటింగ్ జరుపుకున్నాయి.