కూతురికి కరోనా… దాచిపెట్టిన తండ్రిపై కేసు

ఓవైపు కరోనాపై ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ మరోవైపు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా సోకిన తన ముద్దుల కూతర్ని తండ్రి దాచిపెట్టిన వైనం బయటపడింది. ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో జరగలేదు.…

ఓవైపు కరోనాపై ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ మరోవైపు కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా సోకిన తన ముద్దుల కూతర్ని తండ్రి దాచిపెట్టిన వైనం బయటపడింది. ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో జరగలేదు. మన దేశంలోనే ఆగ్రాలో జరిగింది. ప్రస్తుతం ఆ మూర్ఖపు తండ్రిపై కేసులు పెట్టారు పోలీసులు.

ఆగ్రాలోకి కంటోన్మెంట్ రైల్వే కాలనీలో నివశిస్తున్న ఓ మహిళకు ఈమధ్యే పెళ్లయింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన భర్తతో కలిసి హనీమూన్ వెళ్లింది. ఆమె వెళ్లింది ఇటలీకి. తిరిగొచ్చిన తర్వాత భర్త ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లాడు, సదరు యువతి మాత్రం ఆగ్రాలోని తన తల్లిదండ్రులతో ఉండిపోయింది.

కట్ చేస్తే.. ఇటలీ నుంచి తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. అతడ్ని వెంటనే ప్రత్యేక వార్డుకు తరలించి, అతడి ట్రావెల్ హిస్టరీని చెక్ చేశారు. అతడి భార్య కూడా ఇటలీకి వెళ్లిందని గుర్తించి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించారు. ఆగ్రాలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న అమ్మాయిని పరీక్షించేందుకు వైద్యబృందం వెళ్లగా.. అమ్మాయి తండ్రి వాళ్లను తప్పుదోవ పట్టించాడు.

తన కూతురు ఇంట్లో లేదని.. బెంగళూరు వెళ్తోందని నమ్మించే ప్రయత్నం చేశాడు యువతి తండ్రి. కానీ వైద్య బృందానికి అనుమానం వచ్చి ఇంట్లో గాలించగా, సదరు యువతి ఇంట్లోనే ఉన్నట్టు తేలింది. దీంతో వెంటనే ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి, కూతుర్ని దాచిపెట్టడానికి ప్రయత్నించిన తండ్రిపై కేసు నమోదుచేశారు.

హనీమూన్ వెళ్లొచ్చిన ఈ జంటకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించారు. భర్తను బెంగళూరులో, భార్యను ఆగ్రాలో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కూడా శాంపిల్స్ సేకరించి, కరోనా టెస్ట్ కు పంపించారు.

యుద్ధం మధ్యలో యోగాసనాలు వెయ్యకూడదు