వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 151 అసెంబ్లీ సీట్లతో ఘన విజయం సాధించాడు. ముఖ్యమంత్రిగా పది నెలల కాలాన్ని పూర్తి చేసుకున్నాడు. జగన్ పాలనను అంచనా కట్టడానికి ఇది చాలా స్వల్ప సమయం. ఎందుకంటే ఇంకా ఆయనకు నాలుగేళ్ల రెండు నెలల సమయం ఉంది. అయితే ఏమాటకా మాట చెప్పుకోవాలి. కేవలం పది నెలల కాలంలో ఇంత సంచలనం రేకెత్తించిన ముఖ్యమంత్రి మరొకరు తెలుగు గడ్డపై గతంలో లేరు. భవిష్యత్ గురించి చెప్పలేం.
ప్రజల్లో హృదయాల్లో చెరగని ముద్ర వేసుకునేలా పాలన సాగించాలని జగన్ ఆశయాన్ని ఎవరూ శంకించలేరు. ఎలాగైతే తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ప్రజలు దేవుడిలా కొలుస్తూ ఆయన ఫొటోను పెట్టుకున్నట్టే, తన ఫొటోను కూడా తమ ఇళ్లలో పెట్టుకునేలా పాలన సాగిస్తానని జగన్ అనేక సందర్భాల్లో చెప్పాడు. అంతే కాదు, తండ్రికంటే ఉన్నతంగా ప్రజాసంక్షేమ పథకాలు అందిస్తానని కూడా ఆయన పదేపదే చెబుతూ వచ్చాడు,
సంక్షేమ పథకాల అమల్లో తండ్రికి మించిన తనయుడిగా పేరు సంపాదించుకున్నాడు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మ్యానిఫెస్టో అమలుకు సీరియస్‌గా దృష్టి పెట్టాడు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే..వృద్ధుల పింఛన్‌ను రూ.3 వేలకు పెంచే క్రమంలో మొదటి విడతగా రూ.2,250 చేస్తూ ఫైల్‌పై సంతకం చేశాడు. ఇలా మొదలు పెట్టిన జగన్ ….నవరత్నాల్లోని ప్రతి స్కీంకు ఒక్కో నెల శ్రీకారం చుడుతూ వచ్చాడు. తనవి చంద్రబాబు మల్లే ఎన్నికల పథకాలు కావని, ప్రజాసంక్షేమ పథకాలని ఆచరణలో చేసి చూపిస్తున్నాడు.
మరి ఇంత చేస్తున్నా…రాష్ట్రంలో ఏదో జరగరానిది జరుగుతున్నదనే భావన, తీవ్ర గందరగోళ పరిస్థితులు ఎందుకు? అనే ప్రశ్న. పాలనలో జ‘గన్’ మిస్ ఫైర్ అవుతున్నదెక్కడ? ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్ని ఇది. దీనికి కారణం లేకపోలేదు. జగన్ ఆలోచన ధోరణే ప్రధాన సమస్య అని చెప్పక తప్పదు. జగన్ సరిదిద్దుకోవాల్సిన ప్రధాన లోపాలున్నాయి.
ప్రజాస్వామ్యం అంటే కేవలం లెజిస్లేచర్ మాత్రమే కాదు. ప్రజాస్వామ్య మనుగడకు నాలుగు స్తంభాలూ ముఖ్యమే. ఈ నాలుగు ఏంటంటే….లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడీషియరీ, ఫోర్త్ ఎస్టేట్‌గా పిలుచుకునే మీడియా. జగన్ పదేపదే తాను 151 సీట్లతో అధికారంలోకి వచ్చానని, కావున అన్నీ తానైనప్పుడు మిగిలిన వాళ్ల జోక్యం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అంతెందుకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినప్పడు, సీఎం జగన్ సీరియస్ అయ్యాడు. సీఎం నేనా, ఆయనా ( రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్) అని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ఎన్నికల సంఘానిది తప్పా, ఒప్పా అనే విషయాలు పక్కన పెడితే….ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగు స్తంభాల్లో ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ బలమైందని సీఎం గ్రహించాలి, గుర్తించాలి. ఒకవేళ లెజిస్లేచర్ మాత్రమే అన్ని వ్యవస్థల కంటే గొప్పదని భావించి, అందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తేనే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుంది.
జగన్ సర్కార్‌లో ప్రధానమైన లోపం నాలుగు వ్యవస్థలను సమన్వయపరచుకునే నెట్వర్క్ లేకపోవడం. ఈ విషయంలో చంద్రబాబునాయుడికి మించిన వారు మరొకరు లేరు. తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు చంద్రబాబును జగన్ సహా వైసీపీ మంత్రులు, నేతలు తరచూ చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటాడని విమర్శిస్తుంటారు. ఇవన్నీ చేతకాని, అసమర్థత నుంచి వచ్చే విమర్శలే. తామెందుకు మిగిలిన వ్యవస్థలతో బాగుండటం లేదని జగన్‌తో పాటు ఆయన కోటరీ ప్రశ్నించుకోవాలి.
ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డిని తీసుకొందాం. ‘మిస్టర్ సీఎం’ పేరుతో టీవీ9లో ఓ కార్యక్రమానికి వైఎస్సారే స్వయంగా స్టూడియోకు వెళ్లేవారు. ప్రేక్షకులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలను తెలుసుకునేవాళ్లు. ఇక జగన్ విషయానికి వద్దాం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన పది నెలలకు, అది కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో మీడియా ముందుకొచ్చాడు.
ఈ మీడియా సమావేశానికి కూడా కేవలం కొంత మందికి మాత్రమే అనుమతి. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎల్లో మీడియా యజమానులతో విభేదించారే తప్ప, జర్నలిస్టులతో కాదనే విషయాన్ని గుర్తించాలి. కానీ జగన్ మాత్రం యజమానులతోనే కాదు జర్నలిస్టులు కూడా వద్దనుకున్నారు. అంటే నాలుగు స్తంభాల్లో ఒక స్తంభాన్ని పూర్తిగా కాదనుకున్నారన్న మాట. వైఎస్ తన ప్రేమతో శత్రువులను తగ్గించుకుంటే, జగన్ మాత్రం తన వ్యవహారశైలితో ప్రేమించే వాళ్లను కూడా దూరం చేసుకుంటాడు. ఇదే తండ్రీకొడుకుల మధ్య ఉన్న వ్యత్యాసం.
ఇక న్యాయ వ్యవస్థ. చట్టం తన పని తాను చేసుకుంటుందని జగన్ ఆదర్శాలు చెబుతుంటాడు. కానీ న్యాయ వ్యవస్థతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని…మరీ ముఖ్యంగా జగన్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. న్యాయ వ్యవస్థతో సరైన సంబంధాలు లేకపోవడం వల్ల తన సర్కార్ ఎంత నష్టపోతున్నదో జగన్‌కు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఒక్కసారి తనకు వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థలో తీర్పులిస్తే, దాంతో కూడా తలపడడానికి సిద్ధపడే నైజం జగన్‌ది.
ఇక ఎగ్జిక్యూటివ్. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సీఎస్ మార్పు జరిగింది. భారత ఎన్నికల సంఘం సీఎస్‌గా సుబ్రమణ్యాన్ని నియమించింది. జగన్ ప్రభుత్వం కూడా ఆయన్నే కొనసాగించింది. అయితే ఏమైందో తెలియదు కానీ, ఉన్నట్టుండి ఆయన మార్పు జరిగి…నీలం సహాని అనే మహిళా ఐఏఎస్ అధికారిని నియమించుకున్నారు. కానీ సీఎంఓలో ప్రవీణ్ ప్రకాశ్ లాంటి అధికారులకు పెత్తనం ఇవ్వడం వల్ల మిగిలిన ఉన్నతాధికారుల్లో అసంతృప్తి ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఇక జగన్ సర్కార్‌లో సలహాదారులు తప్ప వ్యూహకర్తలు లేకపోవడం అతి పెద్ద లోపమని చెప్పొచ్చు. ఇప్పటికైనా సీఎం జగన్ లెజిస్లేచర్ మాత్రమే సర్వం అనే భావజాలం నుంచి బయటపడాలి. ఆ ఆలోచన జగన్ మనసులో ఉన్నంత వరకు, ఆయన మిగిలిన వ్యవస్థలను కలుపుకుపోలేడు. అలాంటప్పుడు పాలన ముందుకు సాగదు. ఏదో రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి.
మనిషికి తల ఉంటేనే సరిపోదు. కళ్లు, చెవులు, ముక్కు, నోరు…ఇలా అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. అలా కాకుండా తానే గొప్పని తల అనుకున్నా…లేదు లేదు ప్రపంచాన్ని వీక్షించే తాను లేకపోతే తల ఉండి ఏ ప్రయోజనం అని కళ్లు పొగరుబోతుతో వ్యవహరిస్తే….మిగిలిన విభాగాలు తాము పని చేయడం మానేస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవం ఏమంత కష్టమైన పని కాదు.
పైన పేర్కొన్నట్టు ప్రభుత్వం కూడా అలాంటిదే. ప్రభుత్వంలో అనేక యంత్రాంగాలు ఉంటాయి. వేటికవే గొప్ప. తండ్రిలా రెండోసారి అధికారంలోకి రావాలంటే జుడిషీయరీ, మీడియా, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలను సమన్వయం చేసే సమర్థులైన వ్యక్తులతో వ్యవస్థను నెలకొల్పాల్సిన తక్షణావసరం ఉంది. అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లే పదినెలల కాలంలో జగన్ సర్కార్‌కు ఇన్ని అడ్డంకులు అని చెప్పక తప్పదు.