సమ్మోహనం సినిమా తరువాత దిల్ రాజు యూనిట్ లోకి వచ్చారు డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ. ఇద్దరు హీరోల కథ రెడీ చేసారు. నాని రెడీ అయ్యాడు. కానీ మరో హీరో దొరకడం లేదు. దీంతో సినిమా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంది. దీంతో కింకర్తవ్యం అన్న ఆలోచనలో వున్నారు ఇంద్రగంటి అని వినికిడి.
దీనికి నిర్మాత దిల్ రాజు మరో తరుణోపాయం చెప్పారని తెలుస్తోంది. సింగిల్ హీరో కథ తయారుచేయండి. నానితో వెళ్లిపోదాం అని దిల్ రాజు పాచిక విసిరారని తెలుస్తోంది. మరి ఇప్పటికిప్పుడు ఇంద్రగంటి సింగిల్ హీరో కోసం స్క్రిప్ట్ తయారుచేస్తారా? లేక మరో హీరో కోసం వేట కొనసాగిస్తారా? అన్నది డవుట్.
ఇదిలావుంటే జెర్సీ సినిమా ఫినిష్ చేసి విక్రమ్ కుమార్ సినిమా మీదకు వెళ్తున్నాడు నాని. ఆ తరువాత ఏమిటి? అన్నది ప్రశ్న. దిల్ రాజు-ఇంద్రగంటి రెడీ అంటే ఇటు వస్తాడు. లేదూ అంటే మరెటైనా వెళ్లే అవకాశం కూడా వుంది.
గీతా-యువి బ్యానర్ మీద కూడా నానితో సినిమా చేసే ఆలోచన ఒకటి చర్చల్లో వున్నట్లు వినిపిస్తోంది. అది కానీ ఫిక్స్ అయితే ఇంద్రగంటి సినిమా మరి కాస్త ఆలస్యం తప్పదు.